కోరుట్ల: పట్టణంలోని బస్టాండ్ నుంచి ఓ బస్సును మంగళవారం తీసుకెళ్లిన ధర్మపురి మండలం నాగారం గ్రామానికి చెందిన నిందితుడు కందుల సాంబయ్యను అరెస్టు చేసినట్టు ఎస్సై చిరంజీవి తెలిపారు. బస్సును తీసుకెళ్లడంతోపాటు నిర్లక్ష్యంగా నడిపి పలువురికి ఢీకొట్టి గాయపరిచినందుకు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు పేర్కొన్నారు.
పాముకాటుతో గీతకార్మికుడి మృతి
తంగళ్లపల్లి(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లిలో బుధవారం గీత కార్మికుడు గుగ్గిళ్ల శ్రీనివాస్‌గౌడ్(46) పాముకాటుతో మృతిచెందాడు. మంగళవారం రాత్రి పాము కాటు వేయగా.. బుధవారం ఉదయం శ్రీనివాస్ నోటి నుంచి నురుగలు రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్న సమయంలో ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు.
కుప్పకూలిన రైస్‌మిల్లు
● రూ.3కోట్లకుపైగా ఆస్తినష్టం
పెద్దపల్లి: జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం ముసురువాన కురిసింది. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని సాయి సరస్వతి బాయిల్డ్ రైస్‌మిల్లు గోడలు కుప్పకూలినట్లు కార్మికులు తెలిపారు. గోదాములో నిల్వచేసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. సుమారు రూ.3కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు యజమాని శ్రీకాంత్ అధికారులకు విన్నవించారు. సమాచారం అందుకున్న రైస్‌మిల్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, మండల అధ్యక్షులు విజయ్‌పాల్‌రెడ్డి, చీటి సతీశ్‌రావు కేశవరావు తదితర అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఎంఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇంజం వెంకటస్వామి
బౌద్ధనగర్(హైదరాబాద్): ఎంఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్ జిల్లాకు చెందిన ఇంజం వెంకటస్వామిని ఇటీవల ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ నియమించారు. బుధవారం పార్శిగుట్టలోని ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యాలయానికి వచ్చిన ఎంఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామిని హైదరాబాద్ జిల్లా నాయకులు శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. నాయకులు డప్పు మల్లికార్జున్, రాజశేఖర్, సత్యనారాయణ, దావ శివ ప్రసాద్, ఎల్లయ్య, సత్యనారాయణ, బాబూరావు, విజయ్‌కుమార్, చాగంటి యాదగిరి, మీసాల శంకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.


