దొంగిలించిన బైక్‌ల గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

దొంగిలించిన బైక్‌ల గుర్తింపు

Jul 23 2026 2:24 AM | Updated on Jul 23 2026 2:24 AM

దోపిడీ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దుండగులు ఎత్తుకెళ్లిన రెండు బైక్‌లు హుజూరాబాద్‌ మండలం పెద్దపాపయ్యపల్లి శివారులోని ఎస్సారెస్పీ కాలువ సమీపంలో లభ్యమయ్యాయి. గ్రామ శివారులో అనుమానాస్పదంగా రెండు బైక్‌లు ఉన్నాయని గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో వెంటనే హుజూరాబాద్‌ ఏసీపీ వాసంశెట్టి మాధవి, సీఐలు జి.కరుణాకర్‌, శ్రీనివాస్‌ పరిశీలించారు. దోపిడీకి పాల్పడిన ముఠా హుజూరాబాద్‌ ప్రాంతానికి చెందినదేనా? లేక పోలీసులను తప్పుదారి పట్టించేందుకు ఉద్దేశపూర్వకంగా బైక్‌లను అక్కడ వదిలేసిందా? అనే కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. కరీంనగర్‌ నుంచి హుజూరాబాద్‌ వరకు ఉన్న మానకొండూరు, శంకరపట్నం, హుజూరాబాద్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలోని సీసీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఉప్పల్‌, జమ్మికుంట, బిజిగిరి షరీఫ్‌ రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్లలోని సీసీ కెమెరా దృశ్యాలను విశ్లేషిస్తూ నిందితుల కదలికలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

రెక్కీ చేశారా?

నగర నడిఒడ్డున ఉండే భగత్‌నగర్‌కు నేరుగా వచ్చి దోపిడీ చేయడంపై అనుమానం వ్యక్తం అవుతోంది. దోపిడీకి ముందుగానే కొద్దిరోజులు రెక్కీ చేశారా అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంత నగదు, బంగారం బాధితులు ఇంట్లో ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందనే కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతోంది.

కీలకంగా సర్జికల్‌ గ్లౌజ్‌

నిందితులు దోపిడీకి సర్జికల్‌ గ్లౌజులు వాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సర్జికల్‌ గ్లౌజ్‌ ముక్కలు లభ్యమైనట్లు తెలిసింది. దీని ఆధారంగా నిందితులు అప్పటికప్పుడే గ్లౌజులు కొని ఉంటారనే కోణంలో నగరంలోని అన్ని మెడికల్‌షాపుల సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. గతంలో హుజూరాబాద్‌ ప్రాంతంలో జరిగిన బంగారం దోపిడీ నిందితుడిని సర్జికల్‌ గ్లౌజ్‌ పట్టించింది.

హుజూరాబాద్‌ సమీపంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న బైక్‌లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement