‘గోల్డ్ థీఫ్’ గ్యాంగ్‌పై అనుమానాలు
దేశవ్యాప్తంగా 70 మందితో క్రిమినల్ నెట్‌వర్క్
ఆధునిక కమ్యూనికేషన్, అనుచరులకు జీతాలు, బోనస్‌లు
మార్చి, ఏప్రిల్‌లో పెద్దపల్లిలో బస చేసిన దొంగలు
ధర్మపురి లాడ్జికి వచ్చింది ఆరుగురు
ఆరో వ్యక్తే ఐదుగురిని తప్పించినట్లు అనుమానాలు
దర్యాప్తు పక్కదారి పట్టేలా
బ్యాగు, బైకు వదిలివేత
● దేశవ్యాప్తంగా సుశిక్షితులైన 70 మందితో క్రిమినల్ నెట్‌వర్క్
● బిహార్, పశ్చిమబెంగాల్, ఒడిశా, మధ్యప్రదేశ్ ఇతర రాష్ట్రాల్లో కేసులు
● చోరీ చేసిన మొబైళ్లు, ఎన్‌క్రిప్టెడ్ యాప్స్ (ఫేస్‌టైంతోసహా)తో జైలు నుంచే వీడియో కాల్స్ ద్వారా రియల్ టైం మానిటరింగ్ ద్వారా ఆదేశాలు.
● గోల్డ్ లోన్ కంపెనీలు, నగల దుకాణాలు, జువెల్లరీ షోరూంలే టార్గెట్
● అనుచరులకు వేతనాలు, నేరాల్లో ప్రతిభ
కనబరిస్తే బోనస్‌లు
● పలు రాష్ట్రాల్లో తనిష్క్, మణప్పురం, ముత్తూట్ తదితర సంస్థల నుంచి 30కిలోలకు పైగా బంగారం తస్కరణ.
● పారిపోయేందుకు ప్రత్యామ్నాయాలు, దోపిడీకి ముందు రెక్కీ ఈ గ్యాంగ్ ప్రత్యేకత.
● ప్రస్తుతం బిహార్, వెస్ట్‌బెంగాల్‌లో కేసులు.
బిహార్ జైలు నుంచి
సాక్షిప్రతినిధి,కరీంనగర్ :
జులాయి సినిమాలో విలన్ ఒక దొంగ.. చోరీ చేసిన ప్రతిసారీ పోలీసులకు తప్పుడు క్లూ వదిలి.. తాను మాత్రం మరో మార్గంలో పరారవుతుంటాడు. దీనినే పోలీసు పరిభాషలో ‘అటెన్షన్ డైవర్షన్’ అంటారు. ఈ టెక్నిక్‌నే కరీంనగర్‌లోని పీఎంజే జువెల్లరీ దోపిడీలో దొంగలు వినియోగించినట్లు తెలుస్తోంది. దేశంలోని అనేక జువెల్లరీ షాపులను నిలువుదోపిడీ చేసిన బిహార్‌కు చెందిన ‘గోల్డ్ థీఫ్’ అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ గ్యాంగ్ ఉత్తర భారతంలో దోపిడీలు, కిడ్నాప్‌లు, అక్రమ వసూళ్లకు ప్రసిద్ధి. దేశవ్యాప్తంగా గోల్డ్ థీఫ్‌కి క్రిమినల్ నెట్‌వర్క్ ఉంది. ఇతను కన్నేశాడంటే.. ఇతని అనుచరులు పథకం పన్ని బంగారం మొత్తం ఊడ్చి పారేస్తుంటారు. సుశిక్షితులైన దొంగలు కావడంతో ఇప్పటివరకు అన్నీ భారీ చోరీలే నమోదయ్యాయి. ప్రస్తుతం గోల్డ్ థీఫ్ బిహార్ జైలులో ఉన్నాడు. అక్కడ నుంచే దోపిడీకి ప్రణాళిక రచించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ధర్మపురికి వచ్చింది మొత్తం ఆరుగురు..
ఈనెల 3న.. కరీంనగర్ పీఎంజే జువెల్లరీస్‌లో దొంగతనం చేసింది ఐదుగురు కాదు.. ఆరుగురిగా పోలీసులు గుర్తించారు. ఈనెల ఒకటిన ఉదయం ధర్మపురిలోని విజయలక్ష్మి లాడ్జిలో తొలుత నలుగురు, తర్వాత మరొకరు వచ్చారు. ఇంకోవ్యక్తి సాయంత్రం వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అతడే ఈ ఽఐదుగురిని ధర్మపురి నుంచి ఛత్తీస్‌గఢ్ లేదా ఝార్ఖండ్ వైపు తప్పించి ఉంటాడని అనుమానిస్తున్నారు.
జార్ఖండ్‌కు చెందిన సౌరభ్‌కుమార్‌మిశ్రా పేరుతో విజయలక్ష్మి లాడ్జిలో రూ.1200కు గది అద్దెకు తీసుకున్నారు. ధర్మపురిలో దైవదర్శనం కూడా చేసుకున్నట్లు ఆధారాలు లభించాయి. ఉత్తరభారతంలో దొంగలు చోరీకి ముందు పూజలు చేయడం ఆనవాయితీ.
ఏప్రిల్ 27నుంచి 30వరకు దొంగలు పెద్దపల్లిలోని పరమేశ్వర లాడ్జిలో బస చేశారు. అక్కడ నుంచే దొంగతనానికి ప్లాన్ చేసినట్లు సమాచారం. అక్కడ కూడా జార్ఖండ్‌కు చెందిన చిరునామాతో గుర్తింపుకార్డులు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇదే వ్యక్తులు మార్చి నెలలోనూ ఇదే లాడ్జిలో బస చేసినట్లు కూడా దర్యాప్తులో తేలింది. చోరీకి ముందు సిద్దిపేట పరిసరాల్లోనూ ఈ ముఠా సంచరించినట్లు సమాచారం.
ఘటనాస్థలంలో మహారాష్ట్రకు చెందిన బ్యాగు, గోదావరి తీరంలో బైక్‌ను అటెన్షన్ డైవర్షన్ కోసమే కావాలని వదిలేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పల్సర్ బైకు చాసీస్‌ను గుర్తించిన పోలీసులు అది ఢిల్లీదిగా తేల్చారు. బ్యాగు, బైకు విషయంలో పోలీసులను తప్పుదోవ పట్టించి దర్యాప్తు జాప్యానికి కారణమైనట్లు అనుమానిస్తున్నారు. అది అనుభవమున్న దొంగలకే సాధ్యం.
చోరీలో పాల్గొన్న వారి ఆచూకీని ఇప్పటికే కనుగొన్న పోలీసులు బిహార్‌లోని నిందితుల ఇళ్లు, నిందితులు, స్నేహితుల ఇళ్ల వద్ద నిఘా పెట్టారు. ఎలాగైనా రెండు రోజుల్లో పట్టుకుంటామని ధీమాగా ఉన్నారు.


