జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో బుధవారం 45.3 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. బీర్‌పూర్ మండలం కొల్వాయిలో 45.3, రాయికల్ మండలం అల్లీపూర్‌లో 45.2, ఇబ్రహీంపట్నం మండలం గోదూర్‌లో 45.1, మల్లాపూర్ మండలం గోదూర్‌లో 44.8, మల్లాపూర్‌లో 44.7, కోరుట్ల మండలం అయిలాపూర్‌లో 44.5, మెట్‌పల్లిలో 44.5, ధర్మపురి మండలం జైనాలో 44.3, మేడిపల్లిలో44.1, రాయికల్‌లో 44.1 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి.
మక్క రైతుల ధర్నా
జగిత్యాలఅగ్రికల్చర్: కొనుగోలు చేసిన మక్కలను తరలించడం లేదంటూ రైతులు జగిత్యాల మార్కెట్‌యార్డు ఎదుట నిజమాబాద్–కరీంనగర్ రహదారిపై బుధవారం ధర్నాకు దిగారు. 15 రోజులు గడస్తున్నా.. మక్కలు కొనడం లేదని, కాంటా వేసిన వాటిని తరలించడం లేదని ఆందోళనకు దిగారు. ప్రస్తుతం మార్కెట్‌లో 10 వేల క్వింటాళ్లకు పైగా మక్కలు ఉన్నాయని, 15వేల బస్తాలు కాంటా చేసి ఉన్నాయని, వర్షం వస్తే తమ పరిస్థితి ఏంటని అధికారులను నిలదీసారు. స్థల సమస్య కారణంగా ఇతర రైతులు మక్కలను మార్కెట్‌కు తీసుకురాలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఐ కరుణాకర్, ఎస్సై సదాకర్, ట్రాఫిక్ ఎస్సై మల్లేశం వచ్చి రైతులతో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి అధికారులతో ఫోన్‌లో మాట్లాడడంతో రైతులు శాంతించారు.
మంత్రి కొండా సురేఖ దిష్టిబొమ్మ దహనం
ధర్మపురి: హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడారని పేర్కొంటూ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ దిష్టిబొమ్మను పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద బుధవారం బీజేపీ నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మంత్రిగా ఉన్న సురేఖ హిందూదేవతలను కించపర్చారని, జైశ్రీరాం అంటే డబ్బులు రాలుతాయా..? అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. మైనార్టీల ఓట్ల కోసం హిందూ దేవుళ్లను కించపరిచేలా మాట్లాడడం సరికాదన్నారు. నాయకులు గాజు భాస్కర్, స్తంభంకాడి శ్యాం, పల్లెర్ల సురేందర్ తదితరులున్నారు.


