కోరుట్ల: కాంగ్రెస్ కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి, సీనియర్ నాయకుడు జువ్వాడి నర్సింగరావుకు వెలమ కార్పొరేషన్ చైర్మన్‌గా నియామకమయ్యారు. రాష్ట్రంలో మొదటిసారి ఏర్పాటు చేసిన వెలమ కార్పొరేషన్‌కు నర్సింగరావు నియామకం కావడం విశేషం. ఇటీవల నియోజకవర్గంలో మూడోవంతు సర్పంచ్ స్థానాలు గెలవడంతోపాటు కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీలను నర్సింగరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ కై వసం చేసుకుంది. జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా గుర్తింపు పొందిన ఈయన.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో ఏపీఐఐసీ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. కొంతకాలంగా జువ్వాడి నర్సింగరావుకు కార్పొరేషన్ పదవి ఖాయమని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వెలమ కార్పొరేషన్ చైర్మన్‌గా ఎంపిక చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు నూతనోత్సాహం నెలకొంది. పట్టణంలో టపాసులు పేల్చి, స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ.. తనను వెలమ కార్పొరేషన్ చైర్మన్‌గా ఎంపిక చేసిన కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, సీఎం రేవంత్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలకు పూర్తి న్యాయం చేస్తానని అన్నారు.


