ఈనామ్‌కే వాస్తే..
● లోకల్ వ్యాపారులే ఈ–నామ్‌లో ధరల నిర్ణయం
● రైతులకు అందే ధరలు అంతంతే
జగిత్యాలఅగ్రికల్చర్: రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే ఉద్దేశంతో వ్యవసాయ మార్కెట్లలో ఈ–నామ్ ఆన్‌లైన్ కొనుగోలు పద్ధతిని కేంద్ర ప్రభుత్వం 2016 ఏప్రిల్ 14న ప్రవేశపెట్టింది. కానీ.. క్షేత్రస్థాయిలో రైతు పంట ఉత్పత్తులను స్థానిక వ్యాపారులే కొనుగోలు చేస్తుండడం ద్వారా ఈ–నామ్ ప్రతిఫలాలు అన్నదాతలకు అందడం లేదు. ఫలితంగా మార్కెట్ వ్యవస్థ నామ్‌కే వాస్తేగా మారిపోయిందంటున్నారు. జిల్లాలో జగిత్యాల, మెట్‌పల్లి, గొల్లపల్లిలో ఈ–నామ్ మార్కెటింగ్ పద్ధతిని ప్రవేశపెట్టినప్పటికీ అందులో లోకల్ వ్యాపారులే రేటు నిర్ణయిస్తుండటంతో పెద్దగా ఒరిగిందేమీ లేదని పెదవి విరుస్తున్నారు.
పోటీతత్వం పెంచేలా..
మార్కెట్‌కు రైతులు తీసుకొచ్చిన ఉత్పత్తులకు అధిక ధర పలికేలా.. వ్యాపారుల్లో పోటీ ఏర్పడేలా.. కొనుగోళ్లు పారదర్శకంగా జరిగేలా ఈ–నామ్ మార్కెటింగ్ వ్యవస్థను తీర్చిదిద్దారు. ఇందుకోసం మార్కెట్‌యార్డుల్లో కంప్యూటర్లు, ఆపరేటర్లను నియమించారు. రైతుల పంట ఉత్పత్తులను లోకల్ వ్యాపారులతోపాటు ఇతర రాష్ట్రాల వ్యాపారులూ కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాల మార్కెట్లను ఈ–నామ్‌కు అనుసంధానం చేశారు. ఈ విధానంలో ఆన్‌లైన్‌లో ఈ–బిడ్డింగ్ పద్ధతిలో విక్రయాలు చేపడతారు. ఈ పద్ధతిలో రైతులు మార్కెట్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి వ్యాపారుడు సరుకు కొని.. రైతులు బయటకు వెళ్లే వరకు ఇ–ఎంట్రీ, ఇ–టెండరింగ్, ఇ–పేమెంట్, ఇ–పర్మిట్..ఇలా అన్ని రకాల ప్రక్రియ ఆన్‌లైన్ పద్ధతిలోనే కొనసాగుతాయి.
క్షేత్రస్థాయిలో లోకల్ వ్యాపారులే దిక్కు
ఈ–నామ్ పద్ధతి ఉన్న మార్కెట్లలో రైతుల ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు లోకల్ వ్యాపారులే దిక్కయ్యారు. రైతులు మార్కెట్‌యార్డుకు పంట ఉత్పత్తులు తీసుకరాగానే.. కమీషన్ ఏజెంట్లు ఇ–ఎంట్రీ పద్ధతిలో తమ దుకాణానికి ఎంత సరుకు వచ్చిందనే విషయాన్ని మార్కెట్‌లోని ఈ–నామ్‌లో ఎంట్రీ చేయిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు పంట ఉత్పత్తులను కొనుగోలు చేసే వ్యాపారులు యార్డుల్లో తిరిగి.. కాగితంపై రేటు రాసుకుని.. ఆ రేటును ఇ–టెండరింగ్‌లో నమోదు చేయిస్తున్నారు. ఫలితంగా ఎప్పటి మాదిరిగానే వ్యాపారుల్లో పోటీలేకపోవడంతో రైతులకు అనుకున్న స్థాయిలో ధర రావడం లేదు. ఆయా మార్కెట్లలోని కొనుగోలుదారులు ఏదోరేటును కంప్యూటర్‌లో నమోదు చేస్తున్నారు. ఆ రేటును కమీషన్ ఏజెంట్లు రైతులకు చెప్పడంతో ఇదేం ఖర్మరా బాబు అనుకుంటూ.. ఆ రేటుకే రైతులు సంతృప్తి చెందుతున్నారు.
నాణ్యత పరికరాలు లేవు
స్థానిక వ్యాపారుల్లోనూ పోటీ లేకపోవడం, బయటి వ్యాపారులు అసలు ఈ–నామ్‌లో పాల్గొనకపోవడంతో అనుకున్న లక్ష్యాలు నెరవేరడం లేదు. మార్కెట్లకు రైతులు తీసుకొచ్చిన ఉత్పత్తుల్లో నాణ్యత పరీక్షించే పరికరాలుగానీ, వసతులుగానీ లేవు. తేమశాతం, మట్టి, పక్వంరాని, చెడిపోయిన, రంగు మారిన ధాన్యం శాతం ఏ మేరకు ఉందనే విషయాలను మార్కెట్ సిబ్బంది ఆన్‌లైన్‌లో పెట్టాల్సి ఉంటుంది. అవేమీ ఈ–నామ్ మార్కెట్లలో కనబడకపోవడంతో నామమాత్రంగా వ్యవస్థను కొనసాగిస్తున్నారు.
ఫలాలు అందడం లేదు
త్వరలో నాణ్యత ల్యాబ్‌లు
జగిత్యాల, గొల్లపల్లి, మెట్‌పల్లిలోని ఈ–నామ్ మార్కెట్లలో ఉత్పత్తుల నాణ్యత పరీక్షించే ల్యాబ్‌ను ఏర్పాటు చేయబోతున్నాం. మార్కెట్‌లలో వసతులు కల్పిస్తున్నాం. ఉత్పత్తులను ఇ–టెండరింగ్ ద్వారానే కొనుగోలు చేస్తున్నారు.
– ప్రకాష్, మార్కెటింగ్ అధికారి
ఈ–నామ్ ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా ఒక్క రైతు ధాన్యాన్ని కూడా ఇతర రాష్ట్రాల వ్యాపారులు కొన్నది లేదు. నామమాత్రంగానే నడిపిస్తున్నారు. ఉత్పత్తుల కొనుగోలుకు వ్యాపారులు పోటీపడితేనే రైతులకు మంచి ధర వస్తుంది.
– పడిగెల రవీందర్ రెడ్డి, రాయికల్
ఈనామ్‌కే వాస్తే..
ఈనామ్‌కే వాస్తే..


