కోఆప్షన్‌ ఎవరికో..? | - | Sakshi
Sakshi News home page

కోఆప్షన్‌ ఎవరికో..?

Feb 22 2026 7:13 AM | Updated on Feb 22 2026 7:13 AM

కోఆప్షన్‌ ఎవరికో..?

కోఆప్షన్‌ ఎవరికో..?

● ఎదురుచూస్తున్న నాయకులు ● పెరుగుతున్న ఆశావహులు ● ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు ● ఒకరిని మించి మరొకరు ప్రయత్నాలు

జగిత్యాల: కౌన్సిలర్‌తో సమాన హోదా ఉండే కో–ఆప్షన్‌ పదవుల కోసం అప్పుడే నాయకులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. మున్సిపల్‌ ఎన్నికలు ముగియడంతో ఇక కో–ఆప్షన్‌ పదవుల భర్తీ మిగిలింది. ఆ పదవి కోసం ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. మున్సిపాలిటీ చట్టం ప్రకారం నోటిఫికేషన్‌ జారీ కాగానే కో–ఆప్షన్‌ పదవులను భర్తీ చేయనున్నారు. దాదాపు ఒక్కో మున్సిపాలిటీ నుంచి నలుగురు లేదా ఐదుగురు ఉండే అవకాశం ఉంటుంది. దరఖాస్తులను బట్టి అర్హులైన వారు ఎక్కువగా ఉంటే తీసుకోనున్నారు. రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌, మాజీ కౌన్సిలర్లు, అల్పసంఖ్యాక వర్గీయులు, స్వచ్ఛంద సంస్థల నుంచి ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. గతంలో ప్రతి మున్సిపాలిటీలో నలుగురు ఉండగా.. ఈసారి కొంత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

ఓడిన అభ్యర్థుల ప్రయత్నాలు

కౌన్సిలర్‌గా పోటీ చేసి.. అత్యధికంగా ఖర్చు పెట్టిన వారు కనీసం కో–ఆప్షన్‌ పదవినైనా దక్కించుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. జగిత్యాలలో మాజీమంత్రి, ఎమ్మెల్యే వర్గాలు ఉండగా.. వీరిద్దరూ ప్రతిపాదించిన అభ్యర్థులకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో అప్పుడే పైరవీలు మొదలుపెడుతున్నారు. గతంలో టికెట్లు రానివారికి పోటీ నుంచి విరమించుకుంటే కో–ఆప్షన్‌ పదవి ఇస్తామని బుజ్జగించిన విషయం తెల్సిందే. వారంతా ఇప్పుడు పదవి ఆశిస్తున్నారు.

నేతల చుట్టూ ప్రయత్నాలు

ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చేలోపే కొత్త పాలకవర్గం మద్దతు తీసుకుని కో–ఆప్షన్‌ పదవి పొందాలని ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. నోటిఫికేషన్‌ జారీ కానప్పటికీ.. పైరవీలు మాత్రం జోరుగా సాగిస్తున్నారు. ఎన్నికల్లో కష్టపడ్డామని, టికెట్‌ రాకున్నా పక్కకు తప్పుకొన్నామని, కష్టపడిన ఓడిపోయామని, తమకు కో–ఆప్షన్‌ పదవి ఇవ్వాలని ఆశావహులు కోరుతున్నారు.

పోటీ పెరిగే అవకాశం

ఈసారి మున్సిపాలిటీల్లో పదవులకు పోటీ పెరిగే అవకాశం కనిపిస్తోంది. మరో అవకాశం లేకపోవడంతో కనీసం ఈ పదవినైనా దక్కించుకోవాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పదవిని కౌన్సిల్‌పై అనుభవం ఉన్నవారికి, స్వచ్ఛంద సంస్థలవారికి, రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌కు ఇస్తుంటారు. ఈసారి మాత్రం ఓడిపోయిన అభ్యర్థులు పదవులు ఆశిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఇద్దరి నుంచి ముగ్గురిని తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ దరఖాస్తులు అధికంగా వచ్చి సిఫారసులు అధికంగా ఉంటే మరికొందరిని కూడా తీసుకోవచ్చని మున్సిపల్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement