బల్దియా నగారా!
జగిత్యాల
ఉమ్మడి జిల్లాలో లోకల్ ఎలక్షన్ సందడి
13 మున్సిపల్, 2 కార్పొరేషన్లకు షెడ్యూల్
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
30తో ముగియనున్న ప్రక్రియ
ఫిబ్రవరి 11న పోలింగ్, 13న ఫలితాలు
సాక్షిప్రతినిధి, కరీంనగర్:
మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన దరిమిలా కోడ్ అమల్లోకి వచ్చింది. 28వ తేదీ (నేటి) నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమై 30వ తేదీ వరకు కొనసాగనుంది. 31న పరిశీలన, 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ, అదే తేదీన తుదిజాబితా ఖరారు కానుంది. ఫిబ్రవరి 11న ఉమ్మడి జిల్లాలోని 13 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనుండగా.. ఫిబ్రవరి 13న ఫలితాలు వెల్లడికానున్నాయి. 12వ తేదీని రీపోలింగ్ కోసం ముందుజాగ్రత్తగా రిజర్వుచేసి ఉంచారు. ఇప్పటికే కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో వార్డుల పునర్విభజన, ఓటరు తుదిజాబితా, పోలింగ్ కేంద్రాలు, ఉద్యోగులకు శిక్షణ, రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు పూర్తిచేశారు. ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు మొత్తం 17 రోజులపాటు ఎన్నికల వాతావరణం ఏర్పడనుంది.
నామినేషన్ కేంద్రాల ఏర్పాటు
ఉమ్మడి జిల్లాలోని 15 పురపాలికల్లో 5 చోట్ల బీసీలు, 4 చోట్ల ఎస్సీలు, 6 చోట్ల అన్‌రిజర్వ్‌డ్ (ఓసీ) వర్గాలకు అవకాశం కల్పించారు. కీలకమైన కరీంనగర్ కార్పొరేషన్ బీసీ జనరల్, రామగుండం కార్పొరేషన్ ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. కరీంనగర్‌లో జమ్మికుంట ఎస్సీ జనరల్‌కు, హుజురాబాద్, చొప్పదండి మున్సిపాలిటీలను ఎస్సీ మహిళలకు కేటాయించారు. జగిత్యాలలో అత్యధికంగా ఓసీలకు అవకాశం కల్పించారు. జగిత్యాల మున్సిపాలిటీ బీసీ (మహిళ)లకు కేటాయించగా, కోరుట్ల, ధర్మపురి మున్సిపాలిటీలు ఓసీ (మహిళ)లగా నిర్ణయించారు. ఇక రాయికల్, మెట్‌పల్లి మున్సిపాలిటీలు పూర్తి అన్‌రిజర్వ్‌డ్‌గా ప్రకటించారు. సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల మున్సిపాలిటీ జనరల్ (మహిళ)కు కేటాయించగా, వేములవాడ మాత్రం బీసీ (జనరల్) అవకాశం ఇచ్చారు. పెద్దపల్లి జిల్లాలో రామగుండం కార్పొరేషన్ ఎస్సీ జనరల్, పెద్దపల్లి, మంథని మున్సిపాలిటీలు బీసీ (జనలర్)లకు కేటాయించగా, సుల్తానాబాద్ పూర్తిస్థాయిలో అన్‌రిజర్వ్‌డ్‌గా డిక్లేర్ చేశారు.
కోర్టు దావాలపై ఉత్కంఠ..
ఉమ్మడి జిల్లాలో కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజనపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలైన దావాలపై ఉత్కంఠ నెలకొంది. పలు సామాజికవర్గాల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పాటించలేదని ఆరోపిస్తూ దాఖలైన ఆయా పిటిషన్లపై న్యాయస్థానాలు ఏ నిర్ణయం తీసుకుంటాయన్నది ఉత్కంఠగా మారింది.
తనిఖీలు ముమ్మరం... కోడ్ అమల్లోకి
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన దరిమిలా కరీంనగర్, రామగుండం కమిషనరేట్ల సీపీలు, సిరిసిల్ల, జగిత్యాల ఎస్పీలు తనిఖీలు ప్రారంభించారు. నగదు రవాణాపై ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం సూచనలు పాటించాలని స్పష్టంచేస్తున్నారు. ఇటు మేడారం బందోబస్తు, అటు మున్సిపల్ ఎన్నికలను సమన్వయం చేసుకునేందుకు ఆయా జిల్లా పోలీసులు ఇప్పటికే ప్రణాళికలు రచించారు. ఉదయం నుంచే అన్ని మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ల కౌంటర్లను పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు.
కోరుట్ల
వార్డులు: 33
చైర్మన్ ఆన్ రిజర్వ్
నామినేషన్ కేంద్రాలు: 3
రాయికల్
వార్డులు :12
నామినేషన్ కేంద్రాలు:01
చైర్మన్ రిజర్వేషన్ :
జనరల్
మెట్‌పల్లి
వార్డులు : 26
నామినేషన్ కేంద్రాల సంఖ్య : 1
చైర్మన్ రిజర్వేషన్ : జనరల్
ధర్మపురి
వార్డులు : 15
నామినేషన్ కేంద్రాల సంఖ్య:1
కౌంటర్లు : 5
చైర్మన్ రిజర్వేషన్ : జనరల్ మహిళ
వార్డులు : 50
నామినేషన్ కేంద్రాల సంఖ్య :2 (కౌంటర్లు 17)
చైర్మన్ రిజర్వేషన్ :
బీసీ మహిళా
బల్దియా నగారా!


