సందడే సందడి
జగిత్యాల: మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. నోటిఫిషన్ రావడం, నామినేషన్లు సైతం నేటి నుంచే ప్రారంభం కావడంతో హడావుడి ప్రారంభమైంది. నామినేషన్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. టేబుల్స్, టెంట్లు, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు.
అభ్యర్థుల హడావుడి...
నామినేషన్ల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అభ్యర్థుల్లో హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు రెడీ చేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రతి వార్డులో 3–4 అభ్యర్థులను ఎంపిక చేశారు. బీఫాంలు ఎవరికి వస్తే వారు నామినేషన్లు వేసే అవకాశం ఉంది. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు ఇప్పటికే పలు వార్డుల్లో సర్వే చేయించి గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చేలా జాబితాను రూపొందించుకున్నారు. నోటిఫికేషన్ వచ్చినప్పటికీ నామినేషన్లకు సమయం ఉంటుంది కావచ్చని భావించినా మూడు రోజులే ఉండటంతో అభ్యర్థులకు కొంత తలనొప్పిగానే మారనుంది.
బీఫామ్స్ ఎవరికి వచ్చేనో...
జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో అటు సీనియర్ నాయకులు మాజీమంత్రి జీవన్‌రెడ్డి ఇటీవలే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానంటూ కాంగ్రెస్ వైపున్న ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ మధ్య కోల్డ్‌వార్ జరుగుతోంది. ఇప్పటికే జీవన్‌రెడ్డి మొదటి నుంచి జెండా పట్టుకున్న వారికే టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, సంజయ్‌కుమార్ సైతం తమ వర్గానికే ఇవ్వాలని పేర్కొంటున్నట్లు తెలిసింది. ఏదేమైనా వీరి మధ్య కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేద్దామనుకున్న ఆశావహుల మధ్య గందరగోళం నెలకొంది. బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల నాయకులు నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతుండగా, కాంగ్రెస్‌లో మాత్రం అటు ఎమ్మెల్యే, ఇటు మాజీమంత్రి జీవన్‌రెడ్డి వర్గీయులు మాత్రం నామినేషన్లు వేసేలా చూస్తున్నారు. బీఫామ్స్ మాత్రం ఎవరికి వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది.


