మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
జగిత్యాల: మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు చేశామని, జిల్లాలోని ఐదు మున్సిపాలిటిల్లో 136 వార్డుల్లో 2,31,627 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. మంగళవారం మున్సిపల్‌కు సంబంధించిన నోటిఫికేషన్ రావడంతో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 379 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, జగిత్యాలలో రెండు నామినేషన్ కేంద్రాలు, రాయికల్, ధర్మపురిలో 1, కోరుట్లలో 3, మెట్‌పల్లిలో–1 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆర్వో, ఏఆర్వోలను 112 మందిని నియమించడం జరిగిందని, 6 ప్లయింగ్‌స్క్వాడ్స్, 5స్టాటిస్టిక్స్ సర్వైలైన్స్ టీమ్స్ , 50 జోనల్ ఆఫీసర్లను ఏర్పాటు చేశామన్నారు. 379 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. 455 పీవోలు, 1516 మందిని వోపీవోలను నియమించామన్నారు. ఎస్‌కేఎన్‌ఆర్ కళాశాలలోనే కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. నేటి నుంచి కోడ్ అమలులోకి వస్తుందని, మున్సిపాలిటిల్లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన బ్యానర్లను తొలగించాలన్నారు. ఒక వ్యక్తి రూ.50 వేలలోపే నగదు తీసుకెళ్లాలన్నా రు. ప్రజలందరూ సహకరించాలని కోరారు. అడిషనల్ ఎస్పీ శేషాద్రినిరెడ్డి మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికలకు అన్ని రకాల పోలీసు బందోబస్తు చేశామని, ఎన్నికలు విజయవంతం అయ్యేలా పోలీసు సిబ్బందికి అందరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, డీపీఆర్వో మధుసూదన్, కలెక్టరేట్ ఏవో హకీం పాల్గొన్నారు.
విద్యార్థులు ఉన్నతస్థాయికి ఎదగాలి
విద్యార్థులు కష్టపడి చదివి మరింత ఉన్నతస్థాయికి ఎదగాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జిల్లా నుంచి దక్షిణ భారత సైన్స్ ప్రదర్శనలో ప్రతిభ చూపిన విద్యార్థులు, ఉపాధ్యాయున్ని అభినందించారు. ఇన్‌స్పైర్ మానక్ పోటీలలో ప్రతిభ కనబర్చిన కోరుట్ల జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన ఎస్.హిమని, మెట్‌పల్లి జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన వాగ్దేవి, జగిత్యాల కేజీఆర్ ఉన్నత పాఠశాలకు చెందిన నబిర అజీన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. డీఈవో రాము, జిల్లా సైన్స్ అధికారి మచ్చ రాజశేఖర్ ఉన్నారు.
పదో తరగతి పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
పదో తరగతి పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఫౌండేషనల్ లిటరసి అండ్ న్యుమరసిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలాల వారిగా పిల్లలు చదవడం, రాయడం, కూడికలు, తీసివేతలు, గుణకారాలు, బాగాహారాల్లో సమీక్ష చేసి ప్రాథమిక స్థాయిలో జరిగే సమావేశాల్లో డేటాను విస్తరించుకుని ఉపాధ్యాయులకు లక్ష్యం నిర్దేశించి 40 రోజుల్లో విద్యార్థులు కనీసఅభ్యాసన స్థాయి సాధించేలా చూడాలన్నారు.
జాతరకు అన్ని ఏర్పాట్లు
మేడారం మహాజాతరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, భక్తులు వనదేవతల దర్శనాలకు వెళ్లి జాగ్రత్తగా రవాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మంగళవారం మేడారం మహాజాతరకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.


