కందుల కొనుగోలుకు ఎదురుచూపు
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో సాగు చేసిన కంది పంట ఇప్పుడిప్పుడే మార్కెట్‌కు వస్తోంది. ఓపెన్ మార్కెట్‌లో సరైన ధర లభించడం లేదు. దీంతో రైతులు పెట్టిన పెట్టుబడికి.. వస్తున్న ఆదాయానికి పొంతన లేకుండా పోయింది. మార్క్‌ఫెడ్ ద్వారా కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
జిల్లాలో 15 వేల ఎకరాల్లో సాగు
జిల్లాలో 15 వేల ఎకరాల్లో కంది పంటను వేయగా.. ప్రస్తుతం పంటను కోసి ఆరబెడుతున్నారు. కంది పంటకు ప్రభుత్వ మద్దతు ధర రూ.8వేలు ఉండగా.. గ్రామాల్లో దళారులు రూ.7వేలకే కొనుగోలు చేస్తున్నారని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఫలితంగా రైతులు ఒక్కో క్వింటాల్‌కు రూ.వెయ్యి వరకు నష్టపోతున్నారు. రైతులు ఎన్ని క్వింటాళ్లు తెచ్చినా ఎలాంటి నిబంధన విధించకుండా ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కందికి అనుకూలమైన వాతావరణం
ఈ ఏడాది కంది పంటకు అనుకూలమైన వాతావరణం ఉండటంతోపాటు కంది పంటకు ఒక్కటి రెండు తడులు ఇవ్వడం, రెండు మూడు సార్లు తెగుళ్లు, పురుగుల నివారణకు రసాయన మందులు పిచికారీ చేస్తే పంట ఏపుగా పెరుగుతుంది. రైతులు అన్ని రకాల యాజమాన్య పద్ధతులు పాటించడంతో ఎకరాకు 7 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది పంట కోతకు కూడా హార్వెస్టర్లను ఉపయోగించి కూలీల సమస్య తగ్గించుకుంటున్నారు. మార్క్‌ఫెడ్ సంస్థ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుకు సిద్ధపడుతున్నప్పటికీ.. ఒక్కో రైతు నుంచి 4నుంచి5 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయాలని నిబంధన తీసుకరానున్నట్లు సమాచారం. పంట బాగా పండినప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే ఎలా అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం కందుల కొనుగోలు కేంద్రాల ప్రారంభం తాత్సారం చేస్తుంటే నిల్వ చేసే స్థోమత లేక రైతులు తక్కువ ధరకు దళారులకు విక్రయించుకునే అవకాశం ఉంది. రైతుల పంటనంతా దళారుల పాలైన తర్వాత కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే, రైతుల పేర్ల మీద దళారులే మార్క్‌ఫెడ్‌కు అమ్ముకునే అవకాశం ఉంది.


