మామిడికి తేనెమంచు పురుగు
జగిత్యాలఅగ్రికల్చర్: ఈ ఏడాది మామిడి పూతను చూసి మురిసిపోయిన రైతన్నకు ఆదిలోనే తేనె మంచు పురుగుతో కష్టాలు మొదలయ్యాయి. మామిడి పంట ద్వారా ఆదాయం ఏమోగానీ.. ఆ పంటకు రసాయన మందులు పిచికారీ చేసేందుకే రైతులు వేలకు వేలు ఖర్చు పెడుతున్నారు. వాతావరణ మార్పులతో నాలుగేళ్లుగా మామిడి రైతులకు తేనెమంచు పురుగులు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ ఏడాది కూడా మామిడి రైతులను దెబ్బతీస్తోంది. ఇప్పటికే చాలామామిడి తోటలను పురుగు ఆశించి, నష్టం వాటిల్లింది.
పూతను పీల్చేస్తున్న పురుగు
పురుగులు వాతావరణ మార్పులకు లోనై మామిడి పూతను ఆశిస్తాయి. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండటంతో జిల్లాలో ఎక్కువగా తేనెమంచు పురుగు ఆశిస్తోంది. ఈ పురుగులు గుంపులుగుంపులుగా మామిడి పూత, పిందైపె చేరి, వాటి నుంచి రసాన్ని పీల్చుతాయి. పూత, పిందె రాలిమాడిపోతుంది. ఈ పురుగులు విసర్జించిన తేనెలాంటి పదార్థంపై మసి కారణమైన శీలింధ్రాలు పెరిగి, ఆకులు, పూత, పిందైపె నల్లని మసి ఏర్పడుతుంది. ఈ పురుగు ఉధృతికి తోటల్లో కలుపు మొక్కలు ఎక్కువగా ఉండటం, వాతావరణం మబ్బుగా ఉండటం, గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండటం, ఉష్ణోగ్రత తక్కువగా ఉండడమే కారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు. పురుగుతో దాదాపు 20 నుండి 100 శాతం వరకు నష్టం ఏర్పడుతుంది.
విపరీతంగా పురుగు మందుల పిచికారీ
తేనెమంచు పురుగు కట్టడికి రైతులు విపరీతంగా రసాయన మందులు పిచికారీ చేస్తున్నారు. ఇప్పటికే ఒక్కో రైతు కనీసం రెండుమూడు సార్లు పిచికారీ చేసినప్పటికి పూత నిలవడం లేదు. ఒక్క ఎకరం పిచికారీ చేసేందుకు ట్రాక్టర్‌తో పాటు కూలీలు, రసాయన మందులకు దాదాపు రూ.20 వేల వరకు ఖర్చవుతోంది. పూతకు ముందే తోటలను లీజుకు తీసుకున్న దళారులు ఇబ్బంది పడుతున్నారు. పూత ఎండిపోవడమే కాక కొన్ని చోట్ల చెట్టంతా నల్లగా మారిపోతోంది. జగిత్యాల, రాయికల్, సారంగాపూర్, మేడిపల్లి, గొల్లపల్లి మండలాల్లోని చాలా మామిడి తోటల్లో తేనెమంచు పురుగు తన ప్రతాపాన్ని చూపిస్తోంది.
రైతుల ఆశలు ఆవిరి
మామిడి ఏడాదికి ఒకసారి మాత్రమే పంట వస్తుంది. నాలుగేళ్లుగా అంతంతమాత్రంగానే వచ్చిన ఆదాయం.. ఈ ఏడాది కూడా ఆశలు ఆవిరవుతున్నాయి. ఇప్పటికే రైతులు ఎకరాకు కనీసంగా రూ.25వేల వరకు ఖర్చు పెట్టారు. తేనెమంచు పురుగు వదలకపోవడంతో తోటలను తొలగించే ఆలోచనలో రైతులు ఉన్నారు.


