
కీవ్: అలాస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన భేటీ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్, పుతిన్ జరిపే చర్చల సఫలం కావు అంటూ వ్యాఖ్యలు చేశారు. యుద్ధాన్ని ముగించే ఉద్దేశ్యం పుతిన్‌కు లేదంటూ విమర్శలు చేశారు. అందువల్లే ఈ భేటీని పుతిన్ వ్యక్తిగత విజయంగా జెలెన్ స్కీ అభివర్ణిస్తున్నారు.
అలాస్కా వేదికగా ట్రంప్, పుతిన్ మధ్య భేటీ జరుగుతున్న నేపథ్యంలో జెలెన్ స్కీ స్పందించారు. ఈ సందర్బంగా జెలెన్ స్కీ ట్విట్టర్ వేదికగా వీడియోలో మాట్లాడుతూ.. ఉక్రెయిన్ లేకుండా ట్రంప్, పుతిన్ చర్చలేంటి?. ఉన్నత స్థాయి చర్చలు జరుగుతున్న రోజున కూడా ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగిస్తున్నాయి. యుద్ధాన్ని ముగించే ఉద్దేశ్యం మాస్కోకు లేదని మరోసారి నిరూపితం అయ్యింది. యుద్ధానికి సరైన ముగింపు ఎలా సాధించాలనే దానిపై ఉక్రెయిన్.. వాషింగ్టన్, యూరోపియన్ మిత్రదేశాలతో చర్చలు జరుపుతోంది. ఆయా దేశాలతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తోంది. యుద్ధాన్ని ముగించడానికి ఉక్రెయిన్ సాధ్యమైనంత పనిచేయడానికి సిద్ధంగా ఉంది. మేము అమెరికా నుండి బలమైన స్థానాన్ని ఆశిస్తున్నాము’ అని చెప్పుకొచ్చారు.
On the day of negotiations, the Russians are killing as well. And that speaks volumes. Recently, weʼve discussed with the U.S. and Europeans what can truly work. Everyone needs a just end to the war. Ukraine is ready to work as productively as possible to bring the war to an end,… pic.twitter.com/tmN8F4jDzl
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) August 15, 2025
ఉక్రెయిన్ డిమాండ్స్ ఇవే?
- రష్యాతో ఘర్షణలో బాధిత దేశమైన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ స్కీ భాగస్వామి చేయకుండా ట్రంప్, పుతిన్ జరిపే చర్చలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
- ఈ కారణంగానే వీరి భేటీని పుతిన్ వ్యక్తిగత విజయంగా జెలెన్స్కీ అభివర్ణిస్తున్నారు.
- శాంతి చర్చలు జరపాలంటే రష్యా బేషరతుగా కాల్పుల విరమణను ప్రకటించాలన్నది ఉక్రెయిన్ డిమాండ్.
- రష్యాకు తమ భూభాగాల అప్పగింత ప్రతిపాదనను వ్యతిరేకిస్తోంది.
- యుద్ధ ఖైదీలను విడుదల చేయాలని, రష్యా అపహరించుకుపోయిన తమ దేశ చిన్నారులను తిరిగి అప్పగించాలని కోరుతోంది.
- భవిష్యత్తులో తమ దేశంపై రష్యా దాడి చేయకుండా రక్షణలు కల్పించాలని పట్టుబడుతోంది.
- రష్యాపై విధించిన అంతర్జాతీయ ఆంక్షలను ఒక్కసారిగా కాకుండా క్రమంగా ఎత్తివేయాలని డిమాండ్ చేస్తోంది.
- అవసరమైతే వాటిని మళ్లీ విధించేందుకు అవకాశం ఉండాలి.
మరోవైపు.. అలాస్కా వేదికగా ట్రంప్, పుతిన్ మధ్య జరిగిన కీలక భేటీ ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ముగిసింది. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ భేటీ ఎలాంటి ఫలితం తేల్చకుండానే ముగిసిపోయింది. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించినట్టు తెలిపారు. గతంలో ట్రంప్ అధికారంలో ఉండి ఉంటే ఉక్రెయిన్‌తో రష్యాకు యుద్ధం వచ్చి ఉండేది కాదని పుతిన్ మరో మారు పేర్కొన్నారు. ట్రంప్ స్పందిస్తూ.. ఈ చర్చల్లో ఎంతో పురోగతి ఉందన్నారు. చాలా అంశాలను ఇద్దరం అంగీకరించాం. అయితే, కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయన్నారు. త్వరలో తాను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, యురోపియన్ యూనియన్ నేతలతో మాట్లాడతానని ట్రంప్ తెలిపారు.