Work From Home: ఇక ఆ దేశంలో వర్క్‌ ఫ్రం హోం పక్కా! ఒకవేళ కుదరదు అనుకుంటే కారణాలు చెప్పాల్సిందే..

Work from home will soon be legal right in Netherlands - Sakshi

హేగ్‌: కరోనా మహమ్మారి పని సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా అనూహ్యంగా మార్చేసింది. సుమారు రెండేళ్లపాటు ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోం పద్ధతికి అలవాటు పడ్డారు. ఇప్పటికీ కొన్ని సంస్థలు ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నాయి. వర్క్‌ ఫ్రం హోం నచ్చిన ఉద్యోగులు కొందరు ఆఫీసులకు వెళ్లి పనులు చక్కబెట్టేందుకు విముఖత చూపుతున్నారు. ఈ నేపథ్యంలో నెదర్లాండ్స్‌ ప్రభుత్వం వర్క్‌ ఫ్రం హోం విధానాన్ని చట్టబద్ధ హక్కుగా మార్చేందుకు నడుం బిగించింది.

దీని ప్రకారం..ఉద్యోగులకు తమ యాజమాన్యాలను వర్క్‌ ఫ్రం హోం డిమాండ్‌ చేసే హక్కుంటుంది. తిరస్కరించే సంస్థలు అందుకు గల కారణాలను వివరించాల్సి ఉంటుంది. సంబంధిత బిల్లును ఆ దేశ దిగువ సభ ఇటీవల ఆమోదించింది. ఎగువ సభ కూడా ఆమోదిస్తే చట్ట రూపం దాల్చుతుంది. ఇలాంటి అవకాశం కల్పించిన మొట్టమొదటి దేశం నెదర్లాండ్స్‌ కానుంది. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు వారంలో నాలుగు రోజులు ఇంటి నుంచే విధులు నిర్వహించవచ్చంటూ స్కాట్లాండ్‌ ప్రభుత్వం గత నెలలో ఓ ప్రతిపాదన తీసుకువచ్చింది. బదులుగా వేతనంలో కోత ఉంటుందని మెలికపెట్టడం వివాదాస్పదమైంది.

ఆఫీసుకు రావాలంతే..!!
ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పడుతుండగా, ఆఫీసులకు రావాలంటూ కొన్ని సంస్థలు తమ ఉద్యోగులను గట్టిగా కోరుతున్నాయి. అందుకు తాజా ఉదాహరణ, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌..! ఆఫీసుకు రండి, లేదా రాజీనామా చేయండి అంటూ నెల క్రితం ఈయన తన ఉద్యోగులకు అల్టిమేటం ఇచ్చారు. యాపిల్‌ సంస్థ సీఈవో టిమ్‌ కుక్‌ కూడా ఇలాగే ఆదేశించి కంగు తిన్నారు. ఉద్యోగమైనా మానేస్తాం గానీ ఆఫీసులకు మాత్రం రాబోమంటూ ఉద్యోగులు తెగేసి చెప్పారట.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top