58 ఏళ్ల తర్వాత ఫేస్‌బుక్‌ చేసిన మేలు | Sakshi
Sakshi News home page

58 ఏళ్ల తర్వాత ఫేస్‌బుక్‌ చేసిన మేలు

Published Sun, Apr 24 2022 10:28 AM

Woman finds her dad on Facebook after 58 years - Sakshi

ఫేస్‌బుక్‌ తెచ్చే తంటాలు గురించి రకరకాల వార్తలు వింటూనే ఉంటాం. ఫేస్‌బుక్‌ స్నేహాలు.. మోసాలు.. హ్యాకింగ్స్‌ ఇలా.. ఎఫ్‌బీ తెచ్చిపెట్టే ఇబ్బందులూ తెలుసుకుంటూనే ఉంటాం. అయితే ఈ కథ చాలా ప్రత్యేకం. 

బ్రిటన్‌లోని లింకన్‌షైర్‌లో నివసిస్తున్న ఒక మహిళ 58 ఏళ్ల తర్వాత ఫేస్‌బుక్‌ ద్వారానే తన కన్న తండ్రిని కలుసుకోగలిగింది. ఎన్నో ఏళ్లుగా ఎన్నో ప్రయత్నాలు చేసినా దొరకని తండ్రి గురించి.. స్థానిక ఫేస్‌బుక్‌ గ్రూపుల్లో తన చిన్ననాటి తండ్రి ఫొటో షేర్‌ చేసి, ‘ప్లీజ్‌ నా కన్న తండ్రిని వెతికి పెట్టండి’ అని పోస్ట్‌ చేసిన నాలుగు రోజులకే తన తండ్రి వివరాలు తెలుసుకోగలిగింది. 

జూలీ లుండ్‌ (59), ఏడాది వయసులో తన తండ్రికి దూరమైంది. తిరిగి 58 ఏళ్ల తర్వాత కలుసుకుంది. తన తండ్రి బ్రియాన్‌ రోథరీ.. వెస్ట్‌ యార్క్‌షైర్‌లోని డ్యూస్‌బరీలో ఉంటున్నాడని తెలుసుకుని అక్కడికి వెళ్లింది. ఆ సమయంలో ఇద్దరూ చాలా ఎమోషనల్‌ అయ్యారు. ‘ఇది నాకు మరిచిపోలేని అనుభూతి. నా చిన్నతనంలో నా కన్నతండ్రి గురించి అంత ఎక్కువ ఆలోచించలేదు. కనీసం ఎవరినీ అడగలేదు కూడా. ఈ ఏడాది మా అమ్మ, నా మారు తండ్రి చనిపోయారు. ఇప్పుడు నాకు నా కన్నతండ్రి, మారు తల్లి దొరికారు. ఇది నిజంగా ఒక అద్భుతం. ఒక విధంగా చెప్పాలంటే ఇది నా జీవితంలో జరిగిన మిరాకిల్‌. నా తండ్రిని మళ్లీ కలుసుకుంటానని నేనెప్పుడూ అనుకోలేదు. ఆయన ఇంకా బతికే ఉన్నారని కూడా అనుకోలేదు.

చదవండి: (అత్యంత ప్రత్యేకం.. ప్రళయమొచ్చినా.. లైట్‌ తీసుకుంటాయ్‌!)

ఒక వేళ ఉంటే వేరే దేశం వెళ్లారేమో.. లేదంటే ఈ దేశంలోనే ఏ మూలనో ఉండి ఉంటారేమో అనుకునేదాన్ని. కానీ గంట దూరంలోనే ఉన్నారని అసలు అనుకోలేదు. ఎంత మంచి టైమ్‌ను మిస్‌ అయ్యాం అనిపిస్తోందిప్పుుడు. ఇంత దగ్గరగా ఆయన ఉన్నారని ముందే తెలిసుంటే.. ఈపాటికి ఎన్నోసార్లు కలుసుకుని ఉండేదాన్ని. ఇక ఇప్పుడు బాధపడాల్సిన పనిలేదు. నేను ఆయన్ని చూడాలనుకున్నప్పుడల్లా కారేసుకుని ఇక్కడికి వచ్చేస్తాను. డ్యూస్‌బరి ఫేస్‌బుక్‌ ఫ్రెండ్స్‌ వల్లే ఇది సాధ్యమైంది. మా నాన్న కోసం నేను సంవత్సరాలుగా వెతుకుతున్నాను. కానీ ఆధారాల్లేక కనుక్కోలేకపోయాను’ అంటూ తన మనసులోని ఆవేదనను ఆనందబాష్పాలతో చెప్పుకొచ్చింది జూలీ. 

ఆమె తండ్రి రోథరీ మాట్లాడుతూ.. ‘నిజానికి నేను మిరాకిల్స్‌ నమ్మను. కానీ ఇప్పుడు అదే జరిగింది.. నేను ప్రతి ఆదివారం అక్కడికి వెళ్లి జూలితో ఆడుకునేవాడిని. ఒకరోజు నాకు కాల్‌ వచ్చింది. ఆమె(జూలి తల్లి) పాపను తీసుకుని లింకన్‌షైర్‌ వెళ్లిపోయిందని చెప్పారు. ఆ తర్వాత మళ్లీ వాళ్లను కలవలేదు. నా కూతురు ఎలా ఉండి ఉంటుందా? అనుకునేవాడ్ని చాలాసార్లు. నేను మళ్లీ ఆమెను చూస్తానని అనుకోలేదు. కుటుంబ పరిస్థితుల కారణంగా వాళిద్దరూ నాకు దూరమయ్యారు’ అంటూ చాలా ఎమోషనల్‌ అయ్యారు. ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

Advertisement
 
Advertisement
 
Advertisement