శ్రీలంకలో చైనా ‘స్పై షిప్‌’తో భారత్‌ ఆందోళనకు గల 5 కారణాలివే..!

Why India Worried About The Chinese Ship At Sri Lanka Port - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ భద్రతా పరమైన ఆందోళనలు వ్యక్తం చేస్తున్నప్పటికీ చైనాకు చెందిన నిఘా నౌకా శ్రీలంకలోని హంబన్‌తోటా పోర్టుకు మంగళవారం చేరింది. తొలుత నౌక ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని చైనాకు సూచించిన శ్రీలంక.. భారత్‌ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అనుమతులు ఇచ్చింది. అసలు.. ఇంతకి చైనా స్పై షిప్‌తో భారత్‌ ఆందోళన చెందేందుకు గల 5 ప్రధాన కారణాలు తెలుసుకుందాం. 

► చైనా యాంగ్‌ వాంగ్‌ 5 నిఘా నౌక సెన్సార్లు కలిగి ఉంది. భారత్‌ బాలిస్టిక్‌ మిసైల్స్‌ను ప్రయోగిస్తే వాటిని ట్రాక్‌ చేయగలదు. ఈ మిసైల్స్‌ను భారత్‌ ఒడిశాలోని అబ్దుల్‌ కలామ్‌ ఐలాండ్‍ నుంచి ప్రయోగిస్తుంటుంది.

► యాంగ్‌ వాంగ్‌ 5లోని అత్యాధునిక సాంకేతిక సామర్థ్యాలను ఉపయోగించికొని.. భారత క్షిపణుల పరిధి, ఖచ్చితత్వాన్ని అంచనా వేయగలగుతుంది చైనా. దీంతో మన క్షిపణుల వివరాలు డ్రాగన్‌ చేతికి చిక్కినట్లవుతుంది. ఆ నౌక ఆగస్టు 22 వరకు శ్రీలంకలోనే ఉండనుంది.

► యాంగ్‌ వాంగ్‌ 5 సముద్రంలో సర్వేలు నిర్వహించగలదు. దాంతో హిందూ మహా సముద్రంలో సబ్‌మెరైన్‌ కార్యకలాపాలు సాగించేందుకు వీలు కలగనుంది. 2021లో చైనాకు చెందిన సర్వే నౌక షియాంగ్‌ యాంగ్‌ హంగ్‌ 03 ఇలాంటి సర్వేలే నిర్వహించింది.

► 2014లో చైనాకు చెందిన అణ్వాయుధ సామర్థ్యం కలిగిన నౌకను ఓ పోర్టులోకి శ్రీలంక అనుమతించింది. దాంతో భారత్‌-శ్రీలంక మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే, ఈసారి చైనా నౌక ఆటోమేటిక్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్టమ్‌ ఆన్‌ చేసి ఉంటుందని, శాస్త్రపరమైన పరిశోధనలు చేసేందుకు అనుమతించటం లేదని శ్రీలంక పేర్కొంది. హంబన్‌తోటా నౌకాశ్రయం కార్యకలాపాలను చైనా సంస్థ నిర్వహిస్తున్నప్పటికీ ఆపరేషనల్‌ సమస్యలను తామే చూసుకుంటున్నట్లు శ్రీలంక పోర్ట్స్‌ అథారిటీ తెలిపింది.

► చైనాకు రుణాలు చెల్లించలేక హంబన్‌తోటా నౌకాశ్రయాన్ని 99 ఏళ్ల లీజుకు ఇచ్చిన క్రమంలో భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ పోర్టును మిలిటరీ అవసరాల కోసం ఉపయోగించే ప్రమాదం ఉందని ముందు నుంచే హెచ్చరిస్తోంది భారత్‌.

ఇదీ చదవండి: భారత్‌ హెచ్చరికలు బేఖాతరు.. శ్రీలంక చేరిన చైనా ‘స్పై షిప్‌’

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top