
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి ఉషా వాన్స్ ‘గ్రీన్‌లాండ్ పర్యటన’ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. రెండ్రోజులు ఆమె పర్యటించాల్సి ఉండగా.. ప్రకటన వెలువడి 24 గంటలు గడవక ముందే గ్రీన్‌లాండ్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఉష పర్యటనను బహిష్కరించాలని అక్కడి తాత్కాలిక ప్రభుత్వం నిర్ణయించింది. విలువైన ఖనిజాలు ఉన్న ఈ అతిపెద్ద ద్వీపదేశాన్ని హస్తగతం చేసుకుంటానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వరుస ప్రకటనలే ఇందుకు కారణం.
అమెరికా సెకండ్ లేడీ ఉషా వాన్స్(Usha Vance) ఈ నెల 27 నుంచి 29వ తేదీదాకా గ్రీన్‌లాండ్‌లో పర్యటించాల్సి ఉంది. అవన్నాట కిముస్సర్సులో జరగబోయే డాగ్‌స్లెడ్ రేసుకు హాజరు కావడంతో పాటు పలు ప్రాంతాల్లో ఆమె పర్యటించనున్నారు. అయితే ఈ పర్యటనను ఆ దేశ ప్రధాని మ్యూట్ ఎగేడే తీవ్రంగా విమర్శిస్తున్నారు. అమెరికా-గగ్రీన్‌లాండ్ మధ్య ఒకప్పటిలా మంచి సంబంధాలు లేవని.. అది ఈమధ్యే ముగిసిపోయిందని అన్నారాయన.

అలాగే ఉషా వాన్స్ పర్యటన.. ముమ్మాటికీ గ్రీన్‌లాండ్‌ను రెచ్చగొట్టడం కిందకే వస్తుందని అంటున్నారాయన. అంతేకాదు.. ఆమె వెంట జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్ట్‌జ్, ఎనర్జీ సెక్రటరీ క్రిస్ రైట్‌లతో కూడిన బృందాలు వస్తుండడంపైనా ఎగేడే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక తన పర్యటనకు ముందు ఉషా వాన్స్ ఓ వీడియోను పోస్ట్ చేశారు.
SLOTUS VISITING GREENLAND
🇬🇱 Hands up If USA should purchase Greenland. pic.twitter.com/fkduBBVOPB— Usha Vance News (@UshaVanceNews) March 23, 2025
గ్రీన్‌లాండ్(GreenLand).. అతిపెద్ద ద్వీపం. అర్కిటిక్-అట్లాంటిక్ మహాసముద్రాల మధ్యలో ఉంటుంది. భౌగోళికంగా ఉత్తర అమెరికాలో భాగమైనప్పటికీ.. యూరప్ దేశాలతోనే రాజకీయ, సంప్రదాయపరంగా కలిసి ఉంది. అయితే ఇది స్వతంత్ర దేశం కాదు. కింగ్‌డమ్ ఆఫ్ డెన్మార్క్ సరిహద్దులో అటానమస్‌గా ఉండిపోయింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచే గ్రీన్‌లాండ్‌ను చేజిక్కించుకోవడంపై ట్రంప్ వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అయితే.. ఈ ప్రతిపాదనను ఇటు గ్రీన్‌లాండ్, అటు డెన్మార్క్ రెండూ వ్యతిరేకిస్తున్నాయి. రెండు నెలల కిందట ట్రంప్ పెద్ద కొడుకు గ్రీన్‌లాండ్‌ను సందర్శించారు.
మార్చి 11వ తేదీన జరిగిన గ్రీన్‌లాండ్ పార్లమెంట్ ఎన్నికల్లో డెమోక్రట్స్ ఘన విజయం సాధించారు. డెమోక్రట్స్ నేత జెన్స్ ఫ్రెడ్‌రిక్ నీల్సన్ సైతం ఉషా వాన్స్ పర్యటనను తీవ్రంగా తప్పుబట్టారు. అయితే విమర్శలతో సంబంధం లేకుండా.. ఉషా వాన్స్ పర్యటన భద్రత కోసం అమెరికా నుంచి ప్రత్యేక బలగాలు గ్రీన్‌లాండ్‌కు చేరుకున్నాయి. మరోవైపు ఈ పర్యటనను వ్యతిరేకిస్తూనే.. అమెరికాతో దౌత్యపరమైన సంబంధాల దృష్ట్యా గ్రీన్‌లాండ్‌కు తమ పోలీసు బలగాలను డెన్మార్క్ పంపించింది.