భారత్‌పై డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ ప్రశంసలు

WHO Chief Thanks India For Support To Global Covid Response - Sakshi

జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ గేబ్రియేసస్‌ భారత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. మహమ్మారి కోవిడ్‌-19పై యుద్ధంలో నరేంద్ర మోదీ సర్కారు వ్యవహరిస్తున్న తీరును కొనియాడారు. కరోనా నివారణలో ప్రపంచ దేశాలకు తోడ్పాటు అందిస్తున్నందుకు ప్రధాని మోదీకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. పరస్పరం సమాచారం పంచుకుంటూ.. భారత్‌, డబ్ల్యూహెచ్‌ఓ కలిసి పనిచేస్తే, కోవిడ్‌ను కట్టడి చేయవచ్చని పేర్కొన్నారు. తద్వారా ఎన్నో ప్రాణాలను, ఎంతో మంది జీవనోపాధిని కాపాడవచ్చని, తమతో కలిసి పనిచేయాలని టెడ్రోస్‌ భారత్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ట్వీట్‌ చేశారు.

కాగా కోవిడ్‌ బారి నుంచి భారత్‌ తనను తాను కాపాడుకుంటూనే పొరుగు దేశాలకు కూడా సాయం అందిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జనవరి 20 నుంచి పొరుగు దేశాలకు వ్యాక్సిన్‌ పంపించే ప్రక్రియను భారత్‌ ప్రారంభించింది. ఇందులో భాగంగా తొలి రోజు భూటాన్, మాల్దీవులకు వ్యాక్సిన్‌ డోసులను సరఫరా చేశారు. రెండో రోజు బాంగ్లాదేశ్, నేపాల్‌లకు కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ని పంపించారు. శుక్రవారం మయన్మార్, సీషెల్లెన్స్‌లకు వ్యాక్సిన్‌ని సరఫరా చేశారు. (చదవండి: భారత్‌ వ్యాక్సిన్‌ మైత్రి..)

అదే విధంగా బ్రెజిల్, మొరాకో దేశాలకు సైతం కోవిడ్‌ –19 వ్యాక్సిన్‌ వాణిజ్య ఎగుమతులను కూడా భారత్‌ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో టెడ్రోస్‌ ఈ మేరకు ట్విటర్‌ వేదికగా స్పందించడం గమనార్హం. ఇక బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్ బొల్సనారో సైతం భారత్‌కు ధన్యవాదాలు తెలిపారు.ఇక బ్రిటన్‌కి చెందిన ఆస్ట్రాజెనికా, ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అభివృద్ధిపరుస్తోన్న కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ని ప్రపంచంలోనే అతిపెద్ద ఔషధ దిగ్గజ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారుచేస్తోన్న విషయం తెలిసిందే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top