ఎయిర్‌పోర్టులో పోయింది.. చెత్త తొట్లో దొరికింది!

Valuable Painting Was Found In Trash Took Place In Germany - Sakshi

బెర్లిన్‌: ఎయిర్‌పోర్టులో మర్చిపోయి పోగొట్టుకున్న విలువైన పెయింటింగ్‌ దగ్గరలోని చెత్తతొట్లో దొరికిన సంఘటన జర్మనీలో జరిగింది. పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ప్రముఖ వ్యాపారవేత్త అనుకోకుండా 2.8లక్షల యూరోల విలువైన (సుమారు రూ.2.5 కోట్లు) ప్రఖ్యాత పెయింటింగ్‌ను డస్సెల్‌డార్ఫ్‌ విమానాశ్రయంలో మర్చిపోయాడు. ఫ్రెంచ్‌ సర్రీయలిస్టు టాంగే గీసిన ఈచిత్రాన్ని డస్సెల్‌డార్ఫ్‌ నుంచి టెల్‌ అవీవ్‌కు వెళ్లే ప్రయాణంలో నవంబర్‌ 27న సదరు వ్యాపారవేత్త పోగొట్టుకున్నాడు.

ఇజ్రాయిల్‌లో విమానం దిగిన అనంతరం పెయిటింగ్‌ మర్చిపోయిన సంగతి గుర్తుకువచ్చి డస్సెల్‌డార్ఫ్‌ పోలీసులకు విషయం తెలియజేశాడు. అనంతరం ఈమెయిల్స్‌లో పెయింటింగ్‌ వివరాలను ఆయన అందజేసినా ఎయిర్‌పోర్టులో కనిపించలేదని పోలీసులు తెలిపారు. దీంతో వ్యాపారవేత్త మేనల్లుడు బెల్జియం నుంచి వచ్చి స్థానిక పోలీసులను కలిశాడు. అదనపు వివరాలు అందుకున్న అనంతరం పోలీసులు పలుచోట్ల విచారించగా ఒక ఇన్‌స్పెక్టర్‌కు సదరు పెయింటింగ్‌ ఒక పేపర్‌ రీసైక్లింగ్‌ చెత్తతొట్లో కనిపించింది. ఈ రీసైక్లింగ్‌ తొట్టిని ఎయిర్‌పోర్టు క్లీనింగ్‌ కంపెనీ వాడుతోంది. అక్కడనుంచి తీసుకువచ్చిన పెయింటింగ్‌ను సదరు వ్యాపారవేత్తకు భద్రంగా అందజేసామని పోలీసులు చెప్పారు.   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top