‘పుట్టుకతో పౌరసత్వం’ సబబే | US Supreme Court upholds birthright citizenship in blow to Trump | Sakshi
Sakshi News home page

‘పుట్టుకతో పౌరసత్వం’ సబబే

Jul 1 2026 5:13 AM | Updated on Jul 1 2026 5:13 AM

 US Supreme Court upholds birthright citizenship in blow to Trump

ఈ దేశంలో జన్మించిన ప్రతి ఒక్కరూ ఇక్కడి పౌరులే  

అమెరికా సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు  

ట్రంప్‌ కార్యనిర్వాహక ఉత్తర్వు కొట్టివేత  

అది రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానం స్పష్టీకరణ  

అమెరికాలో నివసిస్తున్న విదేశీయులకు భారీ ఊరట  

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వలసల విధానానికి దేశ అత్యున్నత న్యాయస్థానంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అమెరికాలో నివసిస్తున్న విదేశీయులకు భారీ ఊరట లభించింది. అమెరికా గడ్డపై జన్మించినవారికి పౌరసత్వం ఇవ్వడం సమంజసమేనని అమెరికా సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ‘జన్మతః పౌరసత్వం’వెసులుబాటుకు కళ్లెం వేస్తూ డొనాల్డ్‌ ట్రంప్‌ 2025 జనవరిలో జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వును న్యాయస్థానం మంగళవారం కొట్టివేసింది. అమెరికాలో చట్టవిరుద్ధంగా లేదా తాత్కాలికంగా నివసిస్తున్న వారికి పుట్టిన పిల్లలు అమెరికా పౌరులు కారని తేల్చిచెబుతూ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టింది.

జన్మతః పౌరసత్వం విస్తృత భావనను సమర్థించింది. తల్లిదండ్రులు అమెరికాలో చట్టవిరుద్ధంగా లేదా తాత్కాలికంగా ఉన్నప్పటికీ.. వారికి పుట్టిన పిల్లలకు 14వ రాజ్యాంగ సవరణ అమెరికా పౌరసత్వాన్ని కల్పిస్తోందని సుప్రీంకోర్టు పేర్కొంది. ట్రంప్‌ ఆర్డర్‌ను నిలిపివేస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వును సుప్రీంకోర్టు 6–3 తీర్పుతో సమర్థించింది. ఈ దేశంలో జన్మించిన ప్రతి ఒక్కరూ ఇక్కడి పౌరులేనని(చాలా పరిమితమైన మినహాయింపులతో) సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చరిత్రాత్మక తీర్పునిచ్చారు.

అంతర్యుద్ధం తర్వాత ఆమోదించిన 14వ సవరణపై సుదీర్ఘకాలంగా ఉన్న అవగాహనపై, ఇటీవలి ఫెడరల్‌ చట్టాలపైనా ఆధారపడి ఈ తీర్పును వెలువరించారు. ‘‘అçప్పుడైనా, ఇప్పుడైనా పౌరసత్వం అంటే హక్కులను కలిగి ఉండే హక్కు. అంటే రాజకీయ సమాజంలో స్వేచ్ఛగా పాలుపంచుకునే హక్కు. 14వ రాజ్యాంగ సవరణను రూపొందించినవారు.. ఈ దేశంలో స్వేచ్ఛగా జన్మించిన ప్రతి వ్యక్తికీ పౌరసత్వం హామీని వర్తింపజేశారు. ఆ వాగ్దానాన్ని ఈ రోజు మనం నిలబెట్టుకుంటున్నాం’’అని న్యాయమూర్తి జస్టిస్‌ జాన్‌ రాబర్ట్స్‌ తమ తీర్పులో వెల్లడించారు. ట్రంప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ను ఆరుగురు జడ్జీలు వ్యతిరేకించగా, ముగ్గురు సమర్థించారు.  

‘బర్త్‌ టూరిజం’ఆందోళనకరం: డి.జాన్‌ సౌర్‌  
అమెరికాలో జన్మించిన విదేశీయుల పిల్లలకు పౌరసత్వం విషయంలో ట్రంప్‌ నిర్ణయాన్ని సవాలు చేస్తూ న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ట్రంప్‌ నిర్ణయాన్ని యూఎస్‌ సొలిసిటర్‌ జనరల్‌ డి.జాన్‌ సౌర్‌ సమర్థించారు. జన్మతః పౌరసత్వ నిబంధనను ప్రధానంగా పూర్వకాలంలో బానిసలుగా ఉన్నవారికి, వారి పిల్లలకు పౌరసత్వం మంజూరు చేయడానికి తీసుకొచ్చినట్లు చెప్పారు. అమెరికాలో ‘బర్త్‌ టూరిజం’విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తంచేశారు. పుట్టే పిల్లలకు అమెరికా పౌరసత్వం కోసమే విదేశీయులు ప్రత్యేకంగా ఇక్కడికి వస్తున్నారని విమర్శించారు.

అయితే, ఇందులో నిజం ఎంతో చెప్పాలని న్యాయమూర్తులు ప్రశ్నించగా, కచ్చితమైన గణాంకాలు లేవని అంగీకరించారు. అమెరికా రాజ్యాంగం, న్యాయపరమైన నిర్ణయాలు, వ్యాఖ్యానాలు జన్మతః పౌరసత్వాన్ని బలంగా సమర్థిస్తున్నాయని పిటిషనర్లు వాదించారు. ట్రంప్‌ కార్యనిర్వాహక ఉత్తర్వు అమల్లోకి వస్తే తమ పౌరసత్వ హక్కులకు ముప్పు వాటిల్లుతుందని చెప్పారు. ట్రంప్‌ ఉత్తర్వులు ప్రతికూల పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని న్యాయ నిపుణులు హెచ్చరించారు. అమెరికాలో ఏటా జన్మంచే దాదాపు 2,50,000 మంది శిశువులపై దీని ప్రభావం పడే అవకాశం ఉందని, అలాగే లక్షలాది కుటుంబాలు తమ శిశువుల పౌరసత్వ హోదాను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు వెల్లడించారు.  

ట్రంప్‌కు ఈ ఏడాది రెండో పరాభవం  
సుప్రీంకోర్టులో ఈ కేసు మౌఖిక వాదనల సందర్భంగా ఒకసారి డొనాల్డ్‌ ట్రంప్‌ స్వయంగా హాజరయ్యారు. సుప్రీంకోర్టు ఎదుట హాజరైన తొలి సిట్టింగ్‌ అమెరికా అధ్యక్షుడిగా రికార్డుకెక్కారు. కానీ, కేసులో విచారణ ముగియక ముందే అక్కడినుంచి వెళ్లిపోయారు. అమెరికా అత్యున్నత న్యాయస్థానం ఈ ఏడాది ట్రంప్‌ కీలక విధానపరమైన నిర్ణయాన్ని రద్దు చేయడం ఇది రెండోసారి. ప్రపంచవ్యాప్తంగా విధించిన విస్తృతమైన సుంకాలను కోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో కొట్టివేసింది. తాజాగా ట్రంప్‌ పరిపాలనా యంత్రాంగానికి మరో ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది.

జన్మతః పౌరసత్వం అనేది వలస వ్యవస్థ దుర్వినియోగాన్ని ప్రోత్సహిస్తుందని ట్రంప్‌ ఆరోపిస్తున్నారు. ఆయన విధించిన ఆంక్షలను పలు దిగువ న్యాయస్థానాలు నిలిపివేశాయి. దాంతో అవి అమెరికాలో ఎక్కడా అమల్లోకి రాలేదు. జన్మతః పౌరసత్వం విషయంలో కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చే అవకాశం ఉందని ట్రంప్‌ ముందే గ్రహించారు. ‘బుద్ధిలేని న్యాయమూర్తులు’అని ఆక్షేపిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. పుట్టబోయే శిశువులకు అమెరికా పౌరసత్వం దక్కడం కోసం ప్రసవించడానికి అమెరికాకు ఇతరదేశాల ధనిక గర్భిణి స్త్రీలపైనా విమర్శలు ఎక్కుపెట్టారు.

విభేదించిన ముగ్గురు జడ్జీలు  
ట్రంప్‌ ఉత్తర్వును కొట్టివేస్తూ సుప్రీంకోర్టు 
ఇచ్చిన తీర్పుతో ధర్మాసనంలోని ముగ్గురు న్యాయమూర్తులు విభేదించారు. జస్టిస్‌ క్లారెన్స్‌ థామస్, జస్టిస్‌ నీల్‌ గోర్సచ్, జస్టిస్‌ శామ్యూల్‌ అలిటో ఈ తీర్పును ఆక్షేపించారు. 14వ రాజ్యాంగ సవరణను రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. కోర్టు తీవ్రమైన పొరపాటు చేసిందని అన్నారు. కేవలం బిడ్డకు జన్మనిచ్చు, వెంటనే స్వదేశాలకు తిరిగి వెళ్లే ‘బర్త్‌ టూరిస్టుల’ను ప్రోత్సహిస్తారా? అని నిలదీశారు. కోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుందని, ఇది విచారకరమని పేర్కొన్నారు. ఈ మేరకు వారు 91 పేజీల అసమ్మతి లేఖ రాశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement