యూఎస్‌ టేనస్సీ: స్కూల్‌లో పూర్వ విద్యార్థి కాల్పులు.. చిన్నారులు, సిబ్బంది మృతి

US School Nashville School Shooting Deadly Attack By former student - Sakshi

నాష్‌విల్లే: అగ్రరాజ్యంలోని గన్‌ కల్చర్‌ మరోసారి ప్రపంచాన్ని నివ్వెర పోయేలా చేసింది. టేనస్సీ స్టేట్‌ రాజధాని నాష్‌విల్లేలోని ఓ ప్రైవేట్‌ ఎలిమెంటరీ స్కూల్‌లో సోమవారం ఘోరం జరిగింది. ఓ మహిళ జరిపిన కాల్పుల్లో ఆరుగురు చనిపోయారు. మృతుల్లో ముగ్గురు పిల్లలు(9 ఏళ్లలోపు వయసు వాళ్లే), ముగ్గురు సిబ్బంది(స్కూల్‌ హెడ్‌ సహా) ఉన్నారు. కాల్పులు జరిపింది అదే స్కూల్‌ పూర్వ విద్యార్థి కాగా, ఆమెను అక్కడిక్కడే కాల్చి చంపారు పోలీసులు. 

నాష్‌విల్లేకు చెందిన 28 ఏళ్ల  ఆడ్రీ హేల్‌ ఈ కాల్పులకు తెగబడినట్లు పోలీసులు ప్రకటించారు. రెండు రైఫిల్స్‌ Assault Rifles, ఓ హ్యాండ్‌ గన్‌తో స్కూల్‌ సైడ్‌ డోర్‌ నుంచి ప్రవేశించిన దుండగురాలు.. విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో ముగ్గురు చిన్నారులు, ముగ్గురు సిబ్బంది అక్కడికక్కడే కుప్పకూలారు.  ఎమర్జెన్సీ కాల్‌ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. పదిహేను నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకున్నారు.

మరిన్ని దాడులకు ప్లాన్‌!
మిగతా పిల్లలు, స్టాఫ్‌ను భద్రంగా బయటకు తీసుకొచ్చారు. కాల్పులకు దిగిన మహిళను అక్కడిక్కడే కాల్చి చంపారు. ఇదిలా ఉంటే.. ఆడ్రీ హేల్‌ అదే స్కూల్‌లో పూర్వ విద్యార్థి. ఆమెను ట్రాన్స్‌జెండర్‌గా గుర్తించారు పోలీసులు. ఆమెకు ఎలాంటి నేర చరిత్ర లేదని, బహుశా కోపంలోనే ఆమె అలా దాడికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు చెప్తున్నారు. పక్కా ప్లాన్‌తోనే ఆమె కాల్పులకు తెగబడింది. కేవలం స్కూల్‌ను మాత్రమే ఆమె లక్ష్యంగా చేసుకోలేదు. ఆమె దగ్గర మరికొన్ని లొకేషన్లకు సంబంధించిన మ్యాప్‌లు దొరికాయి. అందులో ఈ స్కూల్‌ ఒకటి. బహుశా.. ఆమె మరిన్ని దాడులకు సిద్ధమై ఉందేమో అని ఓ అధికారి తెలిపారు. కోపంలోనే ఆమె కాల్పులకు దిగిందా? లేదా ఇంకా వేరే కారణం ఉందా? అనేది దర్యాప్తులో తేలుస్తామని వెల్లడించారు.  

ఇదిలా ఉంటే కాల్పుల ఘటనపై వైట్‌హౌజ్‌ స్పందించింది. హృదయవిదారకరమైన ఘటన అని ఓ ప్రకటన విడుదల చేసింది. జో బైడెన్‌  ప్రభుత్వం చేస్తున్న ఆయుధ నిషేధ చట్టానికి Assault weapons Ban మద్దతు ఇ‍వ్వాలంటూ రిపబ్లికన్లను వైట్‌హౌజ్‌ ఆ ప్రకటనలో కోరింది. ఇదిలా ఉంటే.. అమెరికాలో సామూహిక కాల్పుల ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ప్రత్యేకించి స్కూల్స్‌పై దాడుల్లో నరమేధం ఎప్పటికప్పుడు ఆయుధాల నిషేధ చట్టం గురించి చర్చ తీసుకొస్తోంది అక్కడ. కిందటి ఏడాది టెక్సాస్‌ రాష్ట్రంలోని ఉవాల్డేలో జరిగిన కాల్పుల్లో 19 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు చనిపోయారు. 2012లో.. కనెక్టికట్ రాష్ట్రంలో జరిగిన కాల్పుల ఘటనలో 26 మంది చనిపోగా.. అందులో 20 మంది పిల్లలే ఉన్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top