Beijing Winter Olympics-China: మా మద్దతు భారత్‌కే.. స్పష్టం చేసిన అమెరికా

US lawmakers laud India for diplomatic boycott of Beijing Olympics - Sakshi

వాషింగ్టన్‌: గాల్వాన్‌ ఘర్షణలో పాల్గొన్న సైనికాధికారిని బీజింగ్‌ వింటర్‌ ఒలింపిక్స్‌ టార్చ్‌బేరర్‌గా ఎంపిక చేయడంపై చైనాతో ఏర్పడ్డ వివాదంలో తమ మద్దతు భారత్‌కేనని అమెరికా పేర్కొంది. పొరుగు దేశాలను బెదిరించే, ఇబ్బంది పెట్టే చైనా చర్యలను గతంలో కూడా తప్పుబట్టామని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్‌ప్రైస్‌ అన్నారు. ఇలాంటి విషయాల్లో భారత్‌ వంటి మిత్ర దేశాలకు ఎప్పుడూ మద్దతుగా నిలుస్తామని చెప్పారు.

భారత్, చైనా సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నదే తమ ఉద్దేశమన్నారు. సీనియర్‌ యూఎస్‌ సెనేటర్లు మార్కో రూబియో, జిమ్‌ రిచ్‌ కూడా చైనా చర్యను దుయ్యబట్టారు. వింటర్‌ ఒలింపిక్స్‌కు చైనా రాజకీయ రంగు పూస్తున్న తీరుకు ఇది మరో నిదర్శనమని రూబియో విమర్శించారు. భారత దళాలపై దొంగచాటున దాడికి దిగిన సైనిక బృందంలోని అధికారిని టార్చ్‌బేరర్‌గా ఎంపిక చేయడం కచ్చితంగా రెచ్చగొట్టే ప్రయత్నమేనని ట్వీట్‌ చేశారు. ఈ విషయంలో చైనా తీరు సిగ్గుచేటని రిచ్‌ ట్వీట్‌ చేశారు.

భారత్‌ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు చేసే అన్ని ప్రయత్నాలకూ అమెరికా మద్దతుంటుందన్నారు. 2020 జూన్‌లో లడఖ్‌లోని గాల్వాన్‌ లోయ వద్ద మన దళాలపై చైనా జరిపిన దొంగచాటు దాడిలో పాల్గొన్న పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ అధికారిని శుక్రవారం నాటి ఒలింపిక్స్‌ ప్రారంభ వేడుకల టార్చిబేరర్ల బృందంలోకి చైనా ఎంపిక చేయడంపై దుమారం రేగింది. దీనిపై భారత్‌ తీవ్రంగా మండిపడింది. ఒలింపిక్స్‌ ప్రారంభ, ముగింపు వేడుకలను బహిష్కరించాలని నిర్ణయించింది. దూరదర్శన్‌ కూడా ప్రారంభ, ముగింపు వేడుకలను ప్రత్యక్షప్రసారం చేయబోదని ప్రసారభారతి వెల్లడించింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top