మూలం కనిపెట్టడంలో అమెరికా విఫలం

US intelligence agencies fail to reach conclusion on COVID-19 origins - Sakshi

కరోనా వైరస్‌ పుట్టుకపై ఏకాభిప్రాయానికి రాలేకపోయిన అమెరికా ఇంటెలిజెన్స్‌

కరోనా వైరస్‌ జీవాయుధం కాదని స్పష్టీకరణ

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ పుట్టుకపై విచారణ జరిపిన అమెరికా ఇంటెలిజెన్స్‌ ఎటూ ఒక నిర్ణయానికి రాలేకపోయింది. ఆ వైరస్‌ వూహాన్‌ ల్యాబ్‌ నుంచి లీకయిందా లేదంటే సహజసిద్ధంగానే పుట్టుకొచ్చిందా అనే అంశంపై ఇంటెలిజెన్స్‌ అధికారులు ఏకాభిప్రాయం సాధించడంలో విఫలమయ్యారు. అయితే కరోనా వైరస్‌ని జీవాయుధంగా అభివృద్ధి చేశారని తాము భావించడం లేదని ఇంటెలిజెన్స్‌ తన నివేదికలో స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లో ఇచ్చిన ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్‌ అధికారులు వైరస్‌ పుట్టుకపై విచారణ జరిపి శుక్రవారం ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించారు.

వైరస్‌ వెలుగులోకి వచ్చిన తొలి రోజుల్లో వ్యాప్తి చాలా స్వల్పంగా ఉందని రాను రాను అది పెద్ద ఎత్తున విస్తరించిందని ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ నివేదికలో పేర్కొన్నారు. వూహాన్‌లో ఈ వ్యాధి లక్షణాలు 2019 నవంబర్‌లోనే కనిపించాయని, డిసెంబర్‌ నాటికి చైనా వ్యాప్తంగా విస్తరించాయని చెప్పారు. ‘వైరస్‌ని ఒక జీవాయుధంగా ఎవరూ అభివృద్ధి చేయలేదు. విచారణలో పాల్గొన్న ఇంటెలిజెన్స్‌ సంస్థలన్నీ దీనిపై ఒకే అభిప్రాయంతో ఉన్నాయి. అయితే ఈ వైరస్‌ జన్యుమార్పిడి ద్వారా సృష్టించిన ఆయుధం కాదు అని మాత్రం గట్టిగా నిర్ధారణకు రాలేకపోయాయి.

రెండు సంస్థలు మాత్రం దేని పైనా స్పష్టమైన నిర్ణయం రావడానికి తగిన ఆధా రాల్లేవని తెలిపాయి’ అని ఆ నివేదిక వివరిం చింది. కానీ ఆ ఇంటెలిజెన్స్‌ సంస్థల వివరాలేవీ అమెరికా వెల్లడించలేదు. కరోనా వైరస్‌ వ్యాప్తి వెలుగులోకి రాక ముందు చైనాలో శాస్త్రవేత్తలకు సైతం దీనిపై కనీస పరిజ్ఞానం లేదని ఇంటెలిజెన్స్‌ వర్గాలు తెలిపాయి. అన్ని విధాల అందుబాటులో ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి, విశ్లేషించిన తర్వాత ఇంటెలిజెన్స్‌ సంస్థలు ఈ వైరస్‌ సహజ సిద్ధంగా అయినా వచ్చి ఉండాలని లేదంటే ల్యాబ్‌ నుంచి ప్రమాదవశాత్తూ లీక్‌ అయి ఉండాలని భావి స్తున్నారు. అయితే ఈ రెండింటిలో ఏది సరైనదో చెప్పడానికి వారికి తగిన ఆధారాలైతే లభించలేదు.

అమెరికావన్నీ రాజకీయాలే: చైనా
మరోవైపు చైనా ఈ నివేదికపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. అమెరికా ఇంకా దీనిపై రాజకీయం చేయాలనుకుంటోందని ఆరోపించింది. వైరస్‌ పుట్టుకకు కారణాలు వెతికే పని శాస్త్రవేత్తలదే తప్ప ఇంటెలిజెన్స్‌ది కాదని వాషింగ్టన్‌లో చైనా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. అమెరికా ఇంటెలిజెన్స్‌ తప్పుల తడక నివేదిక ఇచ్చిందని అభిప్రాయపడింది.

కీలక సమాచారం చైనా దగ్గరే ఉంది : బైడెన్‌
అమెరికా ఇంటెలిజెన్స్‌ నివేదికతో పాటు అధ్యక్షుడు జో బైడెన్‌ ఒక ప్రకటనను విడుదల చేస్తూ కరోనా మూలాలు కనుక్కోవడానికి తమ పాలనా యంత్రాంగం చేయాల్సిన కృషి అంతా చేసిందని అన్నారు. కీలకమైన సమాచారం అంతా చైనా తన గుప్పిట్లో పెట్టుకొని ఉందని, మొదట్నుంచి చైనా అధికారులు అంతర్జాతీయ శాస్త్రవేత్తలకు సరైన సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రపంచ దేశాలను కరోనా అల్లకల్లోలం చేస్తూ మరణాల సంఖ్య పెరిగిపోతున్నా చైనా పారదర్శకంగా వ్యవహరించడం లేదని బైడెన్‌ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ ఏడాది మొదట్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ తమ విచారణలో ఈ వైరస్‌ వూహాన్‌లో జంతు మార్కెట్‌ నుంచి విడుదలైనట్టుగా నివేదిక ఇచ్చినప్పటికీ ఎందరో శాస్త్రవేత్తలకి దానిపై నమ్మకం కుదరలేదు.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top