ప్లాస్మా థెరపీ: అనుమతులు నిలిపివేసిన యూఎస్‌!

US Food and Drug Administration Put Approval For Plasma Therapy On Hold Now - Sakshi

వాషింగ్టన్‌: మహమ్మారి కరోనా బారిన పడిన వారి పాలిట వరంలా పరిగణిస్తున్న ప్లాస్మా థెరపీ అనుమతులను అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ నిలిపివేసింది. ఈ చికిత్స ద్వారా కోలుకున్న పేషెంట్ల వివరాలు, సాధిస్తున్న సానుకూల ఫలితాల గురించి వైద్య నిపుణులు సందేహాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయం గురించి నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అలర్జీ, ఇన్‌ఫెక్షియస్‌ డిసీజెస్‌ క్లినికల్‌ డైరెక్టర్‌ హెచ్‌, క్లిఫార్డ్‌ లేన్‌ మాట్లాడుతూ.. ప్లాస్మా థెరపీపై పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించిన తర్వాత సమీప భవిష్యత్తులో అనుమతులు ఇచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు ఈ చికిత్స ద్వారా ఎంత మంది కోలుకున్నారు, ఏ మేరకు సత్ఫలితాలు లభించాయన్న వివరాలపై స్పష్టత లేనందున అనుమతులు నిలిపివేసినట్లు భావిస్తున్నామన్నారు. ఈ మేరకు న్యూయార్క్‌ టైమ్స్‌ గురువారం కథనం ప్రచురించింది. (కరోనా: ‘ప్లాస్మా థెరపి’ అంటే ఏమిటీ?)

కాగా కరోనాకు విరుగుడు టీకా అందుబాటులోని రాని నేపథ్యంలో భారత్‌ వంటి దేశాల్లో ప్లాస్మా థెరపీ ద్వారా మహమ్మారిని జయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. కరోనా వ్యాపించిన తొలినాళ్లలో పలు సూచనలు చేసిన భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌).. ఏప్రిల్‌ నుంచి ప్లాస్మా చికిత్స క్లినికల్‌ ట్రయల్స్‌ అధ్యయనం నిర్వహిస్తోంది. ఈ క్రమంలో జూలై 2న ఢిల్లీలోని లివర్‌ అండ్‌ బిలియరి సైన్సెస్‌లో ప్లాస్మా బ్యాంకును ఏర్పాటు చేసి.. కరోనా నుంచి కోలుకున్న వారి రక్తంలోని ప్లాస్మాను సేకరించి కోవిడ్‌ పేషెంట్లకు ఎక్కిస్తున్నారు. ఆ తర్వాత లోక్‌ నాయక్‌ జై ప్రకాశ్‌ నారాయణ్‌ హాస్పిటల్‌లో కూడా మరో బ్యాంకును ఏర్పాటు చేశారు. దీని గురించి అవగాహన పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా మరిన్ని ప్లాస్మా బ్యాంకులు అందుబాటులోకి వచ్చాయి. 

అయితే ఈ చికిత్స ద్వారా ఇంత వరకు ఏ మేర సానుకూల ఫలితాలు వచ్చాయన్న అంశంపై కొంతమంది నిపుణులు అనునామాలు వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎథిక్స్‌ ఎడిటర్‌ అమర్‌ జేసాని మట్లాడుతూ.. ‘‘దీని ద్వారా కరోనా రోగులు కోలుకుంటున్నారడానికి సరైన ఆధారాలు లేవు. ఏప్రిల్‌లో క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభమైనా, ఆగష్టు వరకు కూడా ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం, గణాంకాలు బయటకు రాకపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది’’ అని పేర్కొన్నారు. మరికొందరు నిపుణులు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడంతో ఎఫ్‌డీఏ తాత్కాలికంగా అనుమతులు నిలిపివేసినట్లు తెలుస్తోంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top