ద.ఆఫ్రికాలో కొత్త వేరియంట్‌ | Sakshi
Sakshi News home page

ద.ఆఫ్రికాలో కొత్త వేరియంట్‌

Published Thu, Dec 24 2020 4:27 AM

UK has two cases of variant linked to South Africa - Sakshi

లండన్‌: దక్షిణాఫ్రికాలో మరో కొత్త కరోనా వైరస్‌ వేరియంట్‌ను గుర్తించారు. దీనివల్లనే అక్కడ కేసుల సంఖ్యతో పాటు ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య భారీగా పెరుగుతోందని నిర్ధారించారు. ఇది కరోనా సెకండ్‌వేవ్‌ అని పేర్కొన్నారు.  దక్షిణాఫ్రికాలో గుర్తించిన ఈ రెండో రకం కరోనా వైరస్‌ను తాజాగా యూకేలోనూ గుర్తించారు. వేగంగా వ్యాప్తి చెందే లక్షణమున్న ఈ కరోనా వైరస్‌ను బ్రిటన్‌లో కరోనా బారిన పడిన ఇద్దరిలో గుర్తించామని బ్రిటన్‌ ఆరోగ్య శాఖ మంత్రి మాట్‌ హాన్‌కాక్‌ వెల్లడించారు. వారిద్దరూ ఇటీవల దక్షిణాఫ్రికా వెళ్లి వచ్చారని తెలిపారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా నుంచి రాకపోకలను యూకే నిషేధించింది.

గత రెండు వారాల్లో దక్షిణాఫ్రికా వెళ్లివచ్చినవారు, వెళ్లి వచ్చిన వారిని కలిసిన వారు వెంటనే క్వారంటైన్‌కు వెళ్లాలని హాన్‌కాక్‌ సూచించారు. ‘ఇది మరింత వేగంగా వ్యాప్తి చెందుతోందనేదే ఆందోళనకర అంశం. యూకేలో గుర్తించిన వైరస్‌ వేరియంట్‌ కన్నా ఇది ఎక్కువ ఉత్పరివర్తనాలు చెందిన వైరస్‌’ అని పేర్కొన్నారు. కొత్త వైరస్‌ కట్టడి విషయంలో, సంబంధిత సమాచారం తమకు అందించే విషయంలో దక్షిణాఫ్రికా పారదర్శకంగా వ్యవహరించిందన్నారు. యూకేలో గుర్తించిన కొత్త వేరియంట్‌కు, దక్షిణాఫ్రికాలో గుర్తించిన వేరియంట్‌కు  పోలికలున్నప్పటికీ.. అవి వేరువేరు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రెండూ ఎన్‌501వై మ్యూటేషన్‌కు గురయ్యాయన్నారు. రెండు కూడా వేగంగా వ్యాప్తి చెందే లక్షణాన్ని కలిగి ఉన్నాయని ప్రొఫెసర్‌ సుసాన్‌ వివరించారు.

యూకేలోని మరిన్ని ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు!
కొత్త రకం కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కఠిన లాక్‌డౌన్‌ ఆంక్షలను యూకేలోని మరిన్ని ప్రాంతాలను విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అత్యధిక సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో మంత్రివర్గం బుధవారం ప్రత్యేకంగా సమావేశమై, లాక్‌డౌన్‌ ప్రాంతాలను విస్తరించాలనే విషయంలో చర్చలు జరిపారు. కొత్తగా గుర్తించిన కరోనా వైరస్‌ కారణంగానే కేసుల సంఖ్య పెరుగుతోందని, అయితే, ఈ కొత్త వైరస్‌ లండన్, ఆగ్నేయ ఇంగ్లండ్‌ ప్రాంతాల్లోనే అధికంగా కేంద్రీకృతమై ఉందని యూకే కమ్యూనిటీస్‌ మంత్రి రాబర్ట్‌ జెన్‌రిక్‌ తెలిపారు. ఆ ప్రాంతాల్లో ఇప్పటికే టయర్‌ 4 ఆంక్షలు అమల్లో ఉన్నాయన్నారు. మిగతా ప్రాంతాల్లో ప్రస్తుతానికైతే ఈ వైరస్‌ స్ట్రెయిన్‌ ఎక్కువగా కనిపించడం లేదని, అయినా, ముందు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతాల్లోనూ కఠిన లాక్‌డౌన్‌ ఆంక్షలను విధించే విషయమై ఆలోచిస్తున్నామని వివరించారు. మరోవైపు, బ్రిటన్‌ నుంచి ప్రయాణీకులు, సరుకు రవాణాలపై నిషేధాన్ని ఫ్రాన్స్‌ రెండు రోజుల పాటు సడలించింది. యూకేలో బుధవారం 39,237 కరోనా కేసులు, 744 మరణాలు నమోదయ్యాయి.  

కొత్తగా 23,950 పాజిటివ్‌ కేసులు
 న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 23,950 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అలాగే 333 మంది కరోనా బాధితులు కన్నుమూశారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా మొత్తం కేసుల సంఖ్య 1,00,99,066కు, మరణాల సంఖ్య 1,46,444కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు 96,63,382 మంది కరోనా బాధితులు పూర్తిగా కోలుకున్నారు. రికవరీ రేటు 95.69 శాతానికి చేరింది. మరణాల రేటు 1.45 శాతానికి పడిపోవడం ఊరట కలిగించే పరిణామం. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 2,89,240 మాత్రమే ఉన్నాయి. మొత్తం కేసుల్లో ఇవి కేవలం 2.86 శాతమే.

జాన్సన్‌ రాక కష్టమే!
న్యూఢిల్లీ: వచ్చేనెల రిపబ్లిక్‌ దినోత్సవానికి ముఖ్య అతిథిగా బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ రావడం అనుమానమేనని బ్రిటీష్‌ మెడికల్‌ అసోసియేషన్‌ చైర్‌ ఆఫ్‌ కౌన్సిల్‌ చా. చాంద్‌ నాగ్‌పాల్‌ అభిప్రాయపడ్డారు. బ్రిటన్‌లో కరోనా వైరస్‌ కొత్త రూపుతో దాడి చేస్తున్న తరుణంలో బోరిస్‌ జాన్సన్‌ దేశం విడిచి వెళ్లకపోవచ్చన్నారు. ఇప్పటికైతే బ్రిటీష్‌ ప్రభుత్వం జాన్సన్‌ ప్రయాణంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కానీ ఇదే వేగంతో కరోనా వ్యాప్తి కొనసాగితే మాత్రం ఆయన వెళ్లరని చెప్పారు. ఒకవేళ లండన్‌ సహా ఇతర ప్రాంతాల్లో విధించిన లాక్‌డౌన్‌ తదితర ఆంక్షల ఫలితంగా పరిస్థితి అదుపులోకి వస్తే జాన్సన్‌ ప్రయాణం ఉండొచ్చన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement