
లండన్: ఓటు హక్కు వయో పరిమితిని 18 నుంచి 16 ఏళ్లకు తగ్గిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2029లో జరిగే ఎన్నికల్లో ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉందని గురువారం వెల్లడించింది. బ్రిటన్‌లో ప్రస్తుతం 18 ఏళ్లకు ఓటు హక్కు కల్పిస్తున్నారు. ఇకపై 16 ఏళ్లకే ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం లభించనుంది. బ్రిటన్‌లో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ అధికారంలోకి వచి్చంది.
ఓటింగ్ వయో పరిమితిని 16 ఏళ్లకు తగ్గిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఆ పార్టీ హామీ ఇచ్చింది. ఓటింగ్ వయసును కుదించడాన్ని బ్రిటన్ ప్రజాస్వామ్య వ్యవస్థలో అతిపెద్ద మార్పుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. యూకేలో ఓటర్ ఐడీ వ్యవస్థను సైతం విస్తరింపజేయబోతున్నారు. బ్యాంకులు జారీ చేసిన క్రెడిట్, డెబిట్ కార్డులను కూడా పోలింగ్ స్టేషన్ల వద్ద గుర్తింపు కార్డులుగా పరిగణనలోకి తీసుకున్నారు. అర్హులైన వారికి ఓటు హక్కును నిరాకరించకూడదన్నదే దీని ఉద్దేశం.