యూకేలో క్రిస్మస్‌ తర్వాత రెండు వారాల లాక్‌డౌన్‌!

UK government is planning a 2 week lockdown after Christmas - Sakshi

UK Omicron Lockdown:: వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్‌ వేరియెంట్‌ విస్తృతిని అడ్డుకోవడానికి కిస్మస్‌ తర్వాత రెండు వారాల లాక్‌డౌన్‌ విధించే ప్రణాళిక యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే) ప్రభుత్వం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కోవిడ్‌–19 కట్టడికి శాస్త్రవేత్తల సలహా బృందం (సేజ్‌) ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ముందు ఉంచిన పలు ప్రతిపాదనల్లో రెండు వారాల లాక్‌డౌన్‌ సిఫారసు కూడా ఉంది.

యూకేలో గురువారం 88,376, శుక్రవారం 93,045 కేసులు వచ్చాయి. లండన్‌లో శుక్రవారం ఒక్కరోజే 26 వేలకు పైగా కేసులు నమోదు కావడంతో నగర మేయర్‌ సాదిక్‌ ఖాన్‌ హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించారు. ఒకవైపు ఆసుపత్రుల్లో చేరే వారే సంఖ్య పెరుగుతుండగా... మరోవైపు సిబ్బంది గైర్హాజరు పెరుగుతోంది. దాని కి తోడు లండన్, స్కాట్లాండ్‌లలో ఒమిక్రాన్‌ కేసులు ఎక్కవగా నమోదవుతున్నాయి. సాధారణ పరిస్థితుల్లో ప్రభుత్వాసుత్రుల్లో అందేస్థాయి సేవలు అందకపోవచ్చనే సంకేతాలను మేయర్‌ ఇచ్చారు.

► నెదర్లాండ్‌లో ఆదివారం నుంచి కఠిన లాక్‌డౌన్‌ను అమలు చేయనున్నట్లు అపద్ధర్మ ప్రధాని మార్క్‌ రుట్టే ప్రకటించారు. ఒమిక్రాన్‌తో ఐదోవేవ్‌ విరుచుకుపడుతున్నందువల్ల తప్పట్లేదన్నారు.  

► ఫ్రాన్స్‌ నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధించింది. ‘జనవరి ఆరంభానికల్లా ఒమిక్రాన్‌ ప్రధాన వేరియెంట్‌గా అవతరించే అవకాశాలున్నాయి. ఐదోవేవ్‌ వచ్చేసింది, పూర్తిస్థాయిలో విరుచుపడుతోంది’ అని ఫ్రాన్స్‌ ప్రధాని జీన్‌ కాస్తక్స్‌ ప్రకటించారు. క్రిస్మస్‌కు పెద్ద సంఖ్యలో గుమిగూడొద్దని, వేడుకల్లో పాల్గొనే కుటుంబసభ్యుల సంఖ్యను కూడా పరిమితం చేయాలని కోరారు.

► డెన్మార్క్‌ థియేటర్లను, సంగీత కచేరి నిర్వహించే హాళ్లను, మ్యూజియంలు, అమ్యూజ్‌మెంట్‌ పార్కులను మూసివేసింది.
డెల్టా కంటే ఒమిక్రాన్‌ వేగమెక్కువ: డబ్లు్యహెచ్‌ఓ

జెనీవా: కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ను 89 దేశాల్లో గుర్తించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లు్యహెచ్‌ఓ) తెలిపింది. డెల్టా కన్నా ఇది చాలా వేగంగా వ్యాపిస్తోందని, దీని వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లో 1.5–3 రోజుల్లోనే ఇది రెట్టింపవుతోందని హెచ్చరించింది. అందుబాటులో ఉన్న గణాంకాల ఆధారంగా శుక్రవారం ఒమిక్రాన్‌పై సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. సమూహ వ్యాప్తి జరుగుతున్న చోట డెల్టాను ఈ వేరియంట్‌ మించిపోగలదని తెలిపింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top