ఆందోళనలో ట్రంప్‌.. నెతన్యాహూకు అల్టిమేటం? | Trump worried as Netanyahu risks derailing Iran peace efforts | Sakshi
Sakshi News home page

ఆందోళనలో ట్రంప్‌.. నెతన్యాహూకు అల్టిమేటం?

Jun 9 2026 7:14 AM | Updated on Jun 9 2026 10:32 AM

Trump worried as Netanyahu risks derailing Iran peace efforts

ఇరాన్‌తో శాంతి ఒప్పందం దిశగా సాగుతున్న అమెరికా ప్రయత్నాలు మళ్లీ పట్టాలు తప్పుతాయేమోనన్న ఆందోళన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లో కనిపిస్తోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పెరుగుతున్న వేళ.. ఇరాన్‌పై మరిన్ని దాడులకు సిద్ధమవుతున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ సంకేతాలు పంపిస్తున్నారు. ఈ పరిణామం  వాషింగ్టన్‌ను కలవరపెడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ట్రంప్‌ నెతన్యాహుకు పదే పదే ఫోన్లు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. 

ఇరాన్‌తో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి తొందరపాటు చర్యలకు పాల్పడొద్దని ఇజ్రాయెల్‌ ప్రధానికి ట్రంప్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. "బీబీ.. చాలా జాగ్రత్తగా ఉండు. లేదంటే తొందర్లోనే నువ్వు ఒంటరివాడివైపోతావు" అని నెతన్యాహూతో జరిగిన సంభాషణలో ట్రంప్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా మీడియా సంస్థ యాక్సియోస్‌ (Axios) కథనం వెల్లడించింది.

బీబీ అనేది నెతన్యాహు చిన్నప్పటి ముద్దు పేరు. ఇజ్రాయెల్‌ రాజకీయ నేతలు, అభిమానులతో పాటు పలు దేశాధినేతలు కూడా ఆయన్ని అలాగే పిలుస్తుంటారు. అందుకే ట్రంప్‌ ఆ పదం వాడారని తెలుస్తోంది.  

సాధారణంగా ఇజ్రాయెల్‌కు అత్యంత సన్నిహిత మిత్రదేశంగా అమెరికాను భావిస్తారు. ముఖ్యంగా ట్రంప్, నెతన్యాహూ ఇద్దరూ రైట్‌వింగ్‌ లీడర్లుగా గుర్తింపు పొందారు. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే ఇరాన్ అంశంలో ఇద్దరి మధ్య వ్యూహాత్మక విభేదాలు పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇరాన్‌తో దీర్ఘకాలిక ఘర్షణ కంటే చర్చల ద్వారా పరిష్కారం సాధించాలన్నది ట్రంప్ వైఖరి. మరోవైపు ఇరాన్‌ అణు కార్యక్రమం, ప్రాంతీయ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని మరింత కఠిన వైఖరిని అవలంబించాలని నెతన్యాహూ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అమెరికా ఇరాన్‌తో శాంతి ఒప్పందం దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ సమయంలో ఇజ్రాయెల్ చేపట్టే ఏకపక్ష సైనిక చర్యలు చర్చలను పూర్తిగా దెబ్బతీసే ప్రమాదం ఉందని వైట్‌హౌస్ భావిస్తోంది. అందుకే గత కొన్ని వారాలుగా లెబనాన్, ఇరాన్ అంశాల్లో ట్రంప్ వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని నెతన్యాహూను నియంత్రించే ప్రయత్నం చేస్తున్నట్లు అమెరికా మీడియా కథనాలు చెబుతున్నాయి.

ఇక.. నెతన్యాహుకు ట్రంప్‌ ఇచ్చిన వార్నింగ్‌ అసలు సారాంశం.. అమెరికా మద్దతు గురించి. ఇజ్రాయెల్‌కు ఆయుధాలు, క్షిపణి నిరోధక వ్యవస్థలు, ఇంటెలిజెన్స్ సమాచారం వంటి కీలక సహాయం అమెరికా నుంచే అందుతోంది. ఒకవేళ నెతన్యాహూ అమెరికా అభిప్రాయాన్ని పట్టించుకోకుండా ఇరాన్‌పై పూర్తి స్థాయి యుద్ధానికి దిగితే.. వాషింగ్టన్ నుంచి అదే స్థాయి మద్దతు కొనసాగకపోవచ్చన్న సంకేతంగా విశ్లేషకులు ఈ హెచ్చరికను చూస్తున్నారు.

ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ పరిస్థితి పూర్తిగా ప్రశాంతంగా లేదు. ఇరాన్ మళ్లీ దాడి చేస్తే కఠినంగా స్పందిస్తామని నెతన్యాహూ చెబుతుండగా, యుద్ధం కంటే దౌత్యమే పరిష్కారమని ట్రంప్ పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన "జాగ్రత్త బీబీ" హెచ్చరిక కేవలం ఇద్దరు నేతల మధ్య సంభాషణ మాత్రమే కాకుండా.. పశ్చిమాసియాలో భవిష్యత్తు పరిణామాలను ప్రభావితం చేసే కీలక రాజకీయ సంకేతంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement