వైట్‌హౌస్‌ బాల్‌రూమ్‌ కాంట్రాక్ట్‌లో ట్రంప్‌ హస్తం! | Trump is using 500M no-bid contract to build his White House ballroom | Sakshi
Sakshi News home page

వైట్‌హౌస్‌ బాల్‌రూమ్‌ కాంట్రాక్ట్‌లో ట్రంప్‌ హస్తం!

Jul 1 2026 5:05 AM | Updated on Jul 1 2026 5:05 AM

Trump is using 500M no-bid contract to build his White House ballroom

బిడ్డింగ్‌ లేకుండానే  500 మిలియన్‌ డాలర్ల ప్రాజెక్ట్‌ను 

ఇష్టారీతిగా కట్టబెట్టిన అధ్యక్షుడు 

కిక్‌బ్యాక్‌ రూపంలో  లబ్ధి పొందారని విమర్శలు 

వాషింగ్టన్‌: వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యే ప్రాజెక్టులను నాణ్యతతో నిర్మించే సంస్థలను బిడ్డింగ్‌ ద్వారా ఎంపికచేసి ఆ సంస్థకే కాంట్రాక్ట్‌ కట్టబెట్టాలనే నిబంధనలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చరమగీతం పాడారని, ఆ కాంట్రాక్ట్‌ అప్పగింతలో ఆయన స్వయంగా కలుగజేసుకున్నారని ‘ది వాషింగ్టన్‌ పోస్ట్‌’మంగళవారం సంచలన కథనాన్ని ప్రచురించింది. అమెరికా అధ్యక్ష భవనంలోని బాల్‌రూమ్‌ తూర్పు విభాగాన్ని పునర్‌నిర్మించేందుకు గత ఏడాది ఇచ్చిన కాంట్రాక్ట్‌ వివరాలను రహస్యంగా ఉంచాలనే ఉద్దేశంతో ‘ఎగ్జిక్యూటివ్‌ రెసిడెన్స్‌’కార్యాలయం ద్వారా ఈ తతంగం నడిపించారని వాషింగ్టన్‌ పోస్ట్‌ తన కథనంలో పేర్కొంది.

దాదాపు రూ.4,730 కోట్ల(500 మిలియన్‌ డాలర్ల) విలువైన ప్రాజెక్ట్‌ను ఫలానా సంస్థకే ఎందుకు అప్పగించారనే ప్రశ్నకు ట్రంప్‌ సర్కార్‌ బదులు చెప్పకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోందని తాజాగా అమెరికా మీడియా కోడైకూస్తోంది. బిడ్డింగ్‌ లేకుండానే క్లార్క్‌ కన్‌స్ట్రక్షన్‌ అనే సంస్థకు ఈ నిర్మాణ కాంట్రాక్ట్‌ను కట్టబెట్టారు. ట్రంప్‌ స్వయంగా రంగంలోకి దిగి ఆ సంస్థతో సంప్రతింపులు జరిపి కాంట్రాక్ట్‌ మొత్తాన్ని ఖరారుచేశారని తెలుస్తోంది. వర్జీనియాకు చెందిన ఈ కంపెనీకి ఇప్పటికే 3 శాతం ప్రాఫిట్‌ మార్జిన్‌ ఇచ్చినట్లు తాజాగా బహిర్గతమైన కాంట్రాక్ట్‌ ఒప్పందం ద్వారా వెల్లడైంది. కాంక్రీట్‌ వంటి ముడి పదార్థాల ధరలను స్వయంగా ట్రంప్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

అయితే తాను మెచ్చిన సంస్థకే కాంట్రాక్ట్‌ కట్టబెట్టి ప్రతిగా కిక్‌బ్యాక్‌ రూపంలో ఆర్థికలబ్ది పొంది ఉంటారని ఆరోపణలు వెల్లువెత్తాయి. బిడ్డింగ్‌ ప్రక్రియ చేపట్టకుండా కాంట్రాక్ట్‌ అప్పగించడం, వివరాలు బయటకు పొక్కకుండా ఉండేందుకు ఎగ్జిక్యూటివ్‌ రెసిడెన్స్‌ కార్యాలయాన్ని రంగంలోకి దింపడంతో కాంట్రాక్ట్‌ ప్రక్రియలో పారదర్శకతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈస్ట్‌వింగ్‌ బాల్‌రూమ్‌ నిర్మాణం అనేది ట్రంప్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్‌. 

ఇందులో 250 అడుగుల విస్తీర్ణంలో అర్ధచంద్రాకార కమాను, నేషనల్‌ మాల్‌ రిఫ్లెక్టింగ్‌ సరస్సు, లింకన్‌ మెమోరియల్‌లో అతిపెద్ద నడువా నిర్మించాలని తలపోశారు. ఇందుకయ్యే వేల కోట్ల రూపాయలను ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చుచేయకుండా సంపన్నులు దేశం కోసం విరాళంగా ఇవ్వాలని ట్రంప్‌ గతంలో కోరారు. తర్వాత 100 కోట్ల డాలర్ల నిధులు మంజూరు చేయాలని చట్టసభలను కోరారు. అయితే మధ్యంతర ఎన్నికల్లో ప్రజావ్యతిరేకత రావచ్చనే భయంతో అధికార రిపబ్లికన్లు ఈ ప్రతిపాదనకు అడ్డు చెప్పారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement