
వాషింగ్టన్: ప్రపంచ దేశాలపై అమెరికా పరస్పర సుంకాలతో.. పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కకావికలం అవుతున్నాయి. ఆర్థిక మాంధ్యం భయాలు నెలకొని.. అమెరికా మార్కెట్లు సైతం భారీ నష్టాలతో కుదేలు అవుతోంది. వరుసగా రెండో రోజూ వాల్‌స్ట్రీట్‌లో బ్లడ్‌బాత్‌తో పలు కంపెనీల షేర్లు దారుణంగా పడిపోయాయి. అయినప్పటికీ.. మరేం ఫర్వాలేదని ఆ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు.
మార్కెట్ క్రాష్ భయాలను తోసిపుచ్చిన ఆయన.. తన టారిఫ్‌ల నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, అందులో ఎలాంటి మార్పులు ఉండబోవని కుండబద్ధలు కొట్టారు. టారిఫ్ నిర్ణయం వల్ల అమెరికాలోకి పెట్టుబడి పెట్టడానికి చాలా మంది వస్తున్నారని, మున్నుపెన్నడూ లేని స్థాయిలో ధనవంతులు కావడానికి ఇదే మంచి సమయమని ట్రూత్‌లో ఓ పోస్టు చేశారు.

పైగా తన నిర్ణయం అమెరికా ఆర్థిక వ్యవస్థకు సూపర్ ఛార్జ్‌గా పనికొస్తుందని.. టారిఫ్‌ల వల్ల బడా వ్యాపారాలకు వచ్చిన నష్టమేమీ లేదని అంటున్నారాయన. తాను విధించిన పరస్పర సుంకాలతో దిగుమతికి బదులు.. కంపెనీలు అమెరికా గడ్డపై ఉత్పత్తిని ప్రారంభిస్తాయని ట్రంప్ బలంగా నమ్ముతున్నారు. తద్వారా ఉద్యోగాల కల్పన, అటుపై అమెరికా ఆర్థిక వ్యవస్థను మార్చివేసే అవకాశం ఉందని భావిస్తున్నారాయన.