
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం వైపు అడుగులేస్తున్నారు. లాటిన్ అమెరికా దేశాల్లో సైనిక చర్య చేపట్టే యోచనలో ఉన్నారు. డ్రగ్ కార్టెల్స్‌ను ఇదివరకే ఉగ్రసంస్థలుగా గుర్తించిన ఆయన.. వాటిపై ఉక్కుపాదం మోపే క్రమంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
జనవరిలో అధ్యక్ష హోదాలో వైట్‌హౌజ్‌లో అడుగుపెట్టిన వెంటనే.. లాటిన్ దేశాలకు చెందిన పలు కార్టెళ్లను జాతీయ భద్రతా ప్రమాదంగా గుర్తించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారాయన. ‘‘లాటిన్ అమెరికాలో చాలా కార్టెళ్లు ఉన్నాయి. వాటిల్లో మాదకద్రవ్యాలు ప్రవహిస్తున్నాయి. వాటి నుంచి మన దేశాన్ని ఎలాగైనా రక్షించాలి’’ అని ఆ సందర్భంలో ఆయన వ్యాఖ్యానించారాయన. ఈ క్రమంలోనే అలాంటి కార్టెళ్లను లక్ష్యంగా చేసుకుని సైనిక చర్య చేపట్టే అవకాశం ఉందని ప్రముఖ అమెరికన్ మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి.
2025 ఫిబ్రవరిలో మెక్సికో, వెనిజులా దేశాల్లోని ఎనిమిది డ్రగ్ కార్టెళ్లను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలుగా అమెరికా గుర్తించింది. ఇందులో మెక్సికో సినాలోవ్, వెనిజులా ట్రెన్ డె అరగ్వా ప్రధానంగా ఉన్నాయి. తర్వాతి రోజుల్లో వెనిజులాకే చెందిన సన్స్(Suns) అనే మరో కార్టెల్‌ను చేర్చింది అమెరికా. గత 20 ఏళ్లుగా ఈ కార్టెల్ నుంచే అమెరికాకు టన్నుల కొద్దీ మాదకద్రవ్యాలు అక్రమ రవాణా అవుతున్నాయని అమెరికా అంటోంది. అంతేకాదు ఈ కార్టెల్‌ను వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోనే నడిపిస్తున్నారని అమెరికా ఆరోపించగా.. ఆయన ఆ ఆరోపణలను ఖండించారు కూడా.
న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. ప్రత్యేక బలగాలు, ఇంటెలిజెన్స్ మద్దతుతో సైనిక చర్యకు సిద్ధమవ్వాలని.. అవసరమైతే అంతర్జాతీయ మిత్రదేశాల సహకారంతో ముందుకు వెళ్లాలని అమెరికా రక్షణ విభాగం పెంటగాన్‌ను ట్రంప్ ఆదేశించారు. ఇదే విషయాన్ని వాల్ స్ట్రీట్ జనరల్ సైతం ప్రచురించింది. అయితే..
అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌజ్ ఈ విషయాన్ని ధృవీకరించలేదు. కానీ అధ్యక్ష భవన ప్రతినిధి అన్నా కెల్లీ మాట్లాడుతూ.. అమెరికాను రక్షించడం ట్రంప్ తొలి ప్రాధాన్యం. ఇప్పటికే పలు కార్టెల్స్‌ను ఉగ్రసంస్థలుగా ఆయన ప్రకటించారు. ఈ క్రమంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేందుకు కూడా ఆయన వెనకాడరని గుర్తించాలి అని అన్నారు.
సైనిక చర్యను అనుమతిస్తాయా?
ఒక దేశపు సైన్యాన్ని.. మరొక దేశంలో ప్రయోగిస్తామంటే ఊరుకుంటారా?. తాజా అమెరికా సైనిక చర్య కథనాలపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బౌమ్ స్పందించారు. ‘‘మాదక ద్రవ్యాల కట్టడికి ఇరు దేశాలు(అమెరికా, మెక్సికో) కలిసే పని చేస్తున్నాయి. ఇప్పటికే మేం ఆ దేశానికి సహకరిస్తున్నాం కూడా. అలాంటప్పుడు సైనిక చర్య దేనికి?. ఇది స్వాగతించదగ్గ నిర్ణయం ఏమాత్రం కాదు. ఎట్టి పరిస్థితుల్లో అమెరికా సైన్యాన్ని మా దేశంలో అడుగుపెట్టనివ్వం’’ అని పేర్కొన్నారు. మెక్సికో విదేశాంగ శాఖ కూడా అమెరికా సైనిక జోక్యం కథనాలను ఖండిస్తూ.. అలాంటి చర్యలకు అనుమతించబోమని స్పష్టం చేసింది.
సైనిక చర్య.. ట్రంప్ ప్లాన్ ఎలాగంటే..
విదేశీ మిత్ర దేశాలతో సమన్వయం
సముద్రంలో, విదేశీ భూభాగాల్లో నేరగాళ్లపై దాడులు
ఈ దాడుల్లో స్పెషల్ ఫోర్సెస్, గూఢచర్య సంస్థలు పాల్గొనే ఛాన్స్
అమెరికా తగ్గేదే లే..
అయితే.. అమెరికా మాత్రం ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయమని చెబుతోంది. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కార్టెల్స్ అనే వాటిని కేవలం మాదకద్రవ్యాల విక్రయ సంస్థలుగా కాకుండా ఆయుధాలతో కూడిన ఉగ్రవాద సంస్థలుగానే పరిగణించాలి. ఈ గుర్తింపుతోనే ఇకపై ఇది అమెరికాకు జాతీయ భద్రతా సమస్యగా మారింది. తద్వారా వాటి కార్యకలాపాలపై అమెరికా గూఢచర్య సంస్థలు, రక్షణ శాఖలను ప్రయోగించబోతున్నాం అని పేర్కొన్నారాయన.