బాంబు పేల్చిన మస్క్‌.. ట్రంప్‌పై సంచలన ఆరోపణ | Trump Musk Spat: Here's The Full Details Of Latest Sensational Allegations, Check Full Story Inside | Sakshi
Sakshi News home page

బాంబు పేల్చిన మస్క్‌.. ట్రంప్‌పై సంచలన ఆరోపణ

Jun 6 2025 6:54 AM | Updated on Jun 6 2025 10:30 AM

Trump Musk Spat: Here Latest Sensational Allegations Full Details Here

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ప్రముఖ బిలీయనీర్‌ ఎలాన్‌ మస్క్‌ల మధ్య గొడవలు నాటకీయ పరిణామాల నడుమ రోజురోజుకీ ముదురుతున్నాయి. ఇరువురు పరస్పరం సంచలన ఆరోపణలతో పోటాపోటీ పడుతున్నారు. తాజాగా.. ట్రంప్‌ను అభిశంసించి ఆ స్థానంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను అధ్యక్షుడిగా చేయాలంటూ మస్క్‌ బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో మరో సంచలన ఆరోపణ చేశాడు.

వాషింగ్టన్‌: ప్రముఖ బిలీయనీర్‌ ఎలాన్‌ మస్క్‌ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై సంచలన ఆరోపణలకు దిగాడు. ‘‘పెద్ద బాంబులాంటి విషయాన్ని చెప్పాల్సిన సమయం వచ్చింది.  ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌(EPSTEIN FILES)లో ట్రంప్‌ పేరు ఉంది. అందుకే ఆ ఫైల్స్‌ వివరాలను బయటపెట్టడం’’ లేదంటూ ఓ పోస్ట్‌ చేశాడు. బిగ్‌ బ్యూటీఫుల్‌ బిల్‌ వ్యవహారంలో మస్క్‌ తీరునుతో తాను‌ విసిగిపోయానంటూ ట్రంప్‌ మీడియా ముఖంగా చెప్పిన గంటలోపే మస్క్‌ ఈ ట్వీట్‌ చేయడం గమనార్హం.

 

 

ఎప్‌స్టీన్‌ ఫైల్స్(EPSTEIN FILES) అనేది అమెరికాలో సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణానికి సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం. ఈ ఫైల్స్‌లో ఎప్‌స్టీన్‌ కాంటాక్ట్‌ లిస్ట్‌, ఫ్లైట్‌ లాగ్‌లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ కేసులో ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు ఉన్నారని ఆరోపణలూ ఉన్నాయి. ప్రముఖ ఇన్వెస్టర్‌ అయిన ఎప్‌స్టీన్‌ లైంగిక వేధింపుల ఆరోపణలతో మీటూ ఉద్యమ సమయంలో అరెస్ట్‌ అయ్యాడు. ఆపై 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా.. ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు. అయితే ఈ ఫైల్స్‌ ఇప్పటిదాకా బయటకు రాకపోవడంతో అమెరికా రాజకీయాల్లో, మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. 

అంతకు ముందు.. తన మద్దతు లేకుంటే 2024 అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్, రిపబ్లికన్‌ పార్టీ నేతలు ఓటమి పాలయ్యేవారని టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ వ్యాఖ్యానించారు. ‘నేను లేకుంటే ట్రంప్‌ ఓడిపోయేవారు. ప్రతినిధుల సభపై డెమోక్రాట్లు ఆధిక్యం సాధించేవారు. సెనెట్‌లో రిపబ్లికన్లు 5149తో ఉండేవారు’ అని ఆయన గురువారం స్పష్టం చేశారు. అయితే.. 

ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య మరింత దూరం

అయితే మస్క్‌ వ్యాఖ్యలను ట్రంప్‌ తోసిపుచ్చారు. రిపబ్లికన్‌ ట్యాక్స్‌ బిల్లును మస్క్‌ వ్యతిరేకించడంతో తాను అసంతృప్తికి గురయ్యానని, శ్వేతసౌధంలో తన స్నేహితుడు(మస్క్‌ను ఉద్దేశించి..) లేకపోవడం విచారకరమని ట్రంప్‌ సైతం వ్యాఖ్యానించారు. తాను ఎన్నికల్లో విజయం సాధించడానికి మస్క్‌ అవసరం లేదని స్పష్టం చేశారు. మస్క్‌ లేకుండానే పెన్సిల్వేనియాలో తాను గెలిచేవాడినని తెలిపారు. మస్క్‌ వ్యాపారాలకు ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టులకు, రాయితీలకు కోత వేస్తానని ట్రంప్‌ హెచ్చరించారు. 

అదే సమయంలో మస్క్‌ వరుసగా ఎక్స్‌లో స్పందించారు. ట్రంప్‌ చెప్పిందంతా అబద్ధమని అన్నాడు. బెదిరింపులకు తలొగ్గనని, అవసరమైతే స్పేస్‌ఎస్‌ ఒప్పందాన్ని ఆపేస్తానని బదులిచ్చాడు.

 అదే సమయంలో..  కొత్త పార్టీ పెట్టవచ్చా? అని అభిమానులను ప్రశ్నించారు. ‘80శాతం మందికి ప్రాతినిధ్యం వహించేలా అమెరికాలో కొత్త పార్టీ పెట్టడానికి ఇది సమయమేనా?’ అని అడిగాడు. అలాగే ట్రంప్‌ను తొలగించాలంటూ ఓ వ్యక్తి వేసిన ప్రశ్నకు అవుననే బదులిచ్చాడు.

 

తాను ప్రతిపాదించిన ఫెడరల్‌ ప్రభుత్వ వ్యయ నియంత్రణ బిల్లును.. ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ వ్యతిరేకించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ బిల్లులోని ముఖ్యఅంశాలు తెలిసి కూడా వ్యతిరేకించారని, దాంతో తాను నిరాశ చెందానని చెప్పారు. ప్రభుత్వ వ్యయ నియంత్రణకు ఉద్దేశించిన ప్రభుత్వ సామర్థ్య విభాగం (డోజ్‌)కు మస్క్‌ అధిపతిగా ఉండడం, ఈ బిల్లును చూసిన తరువాత ఆ పదవికి రాజీనామా చేయడం గమనార్హం. గురువారం ట్రంప్‌ శ్వేత సౌధంలోని ఓవల్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఒక్క విద్యుత్తు వాహనాల అంశం తప్ప బిల్లులోని మిగిలిన అంశాలపై మస్క్‌కు అభ్యంతరాలు లేవని అన్నారు.

‘మస్క్‌కు ఎంతో చేశాను. ఇద్దరి మధ్య గొప్ప స్నేహం ఉంది. అది కొనసాగుతుందో లేదో చెప్ప లేను. ఆయన నా గురించి ఎంతో గొప్పగా చెప్పారు. చెడుగా ఒక్క మాట అనలేదు. అయినా ఆయనతో అసంతృప్తి చెందా’ అని వ్యాఖ్యానించారు. ట్రంప్‌ వ్యాఖ్యలపై మస్క్‌ ఎక్స్‌లో స్పందిస్తూ వ్యయ నియంత్రణ బిల్లును తనకు చూపలేదని తెలిపారు. తన సహకారం లేకుంటే ఎన్నికల్లో ట్రంప్‌ గెలిచి ఉండేవారు కాదని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement