అమెరికా కాంగ్రెస్‌లో ‘గ్రీన్‌లాండ్ అనెక్సేషన్ అండ్ స్టేట్‌హుడ్’ బిల్లు
51వ రాష్ట్రంగా మార్చే అవకాశం
వాషింగ్టన్: డెన్మార్క్‌లో భాగంగా కొనసాగుతూ పాక్షికంగా స్వయం ప్రతిపత్తి హోదా కలిగిన గ్రీన్‌లాండ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పటి నుంచో కన్నేశారు. సహజ వనరులు, ముడి చమురుతో కూడిన ఆ ప్రాంతాన్ని అమెరికాలో విలీనం చేసుకొనే దిశగా అడుగులేస్తున్నారు. అందులో భాగంగా రిపబ్లికన్ సభ్యుడు ర్యాండీ ఫైన్ అమెరికా కాంగ్రెస్‌లో సోమవారం ‘గ్రీన్‌లాండ్ అనెక్సేషన్ అండ్ స్టేట్‌హుడ్’ పేరిట బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు చట్టసభలో ఆమోదం పొందితే గ్రీన్‌లాండ్‌ను అమెరికాలో విలీనం చేసి 51వ రాష్ట్రంగా మార్చేసే అధికారం అధ్యక్షుడు ట్రంప్‌కు లభిస్తుంది.
అమెరికా జాతీయ భద్రత కోసం గ్రీన్‌లాండ్‌ను ఎలాగైనా స్వా«దీనం చేసుకోక తప్పదని ట్రంప్ ఇప్పటికే స్పష్టంచేశారు. వీలైతే సులభ మార్గంలో, లేకపోతే కఠిన మార్గంలో గ్రీన్‌లాండ్‌ను అమెరికాలో కలిపేస్తామని ఆయన ప్రకటించారు. బల ప్రయోగానికైనా సిద్ధమని పరోక్షంగా సంకేతాలిచ్చారు. డబ్బులిచ్చి గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేస్తామని అమెరికా చెప్పగా అందుకు డెన్మార్క్ నేతలు అంగీకరించలేదు. ఆ ప్రాంతం అమ్మకానికి లేదని తెలియజేశారు.

గ్రీన్‌లాండ్ విలీనం అనేది విస్మరించదగిన అంశం కాదని ర్యాంటీ ఫైన్ పేర్కొన్నారు. అమెరికా భద్రతకు అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. గ్రీన్‌లాండ్ విలీనం లేదా బలవంతపు ఆక్రమణ కోసం చర్యలు చేపట్టడానికి వీలుగా ట్రంప్‌కు అధికారాలు ఇవ్వడానికే బిల్లును తీసుకొచి్చనట్లు తెలిపారు. ఈ ఆర్కిటిక్ ద్వీపం అమెరికాలో ఒక రాష్ట్రంగా మారాలంటే ఫెడరల్ చట్టంలో మార్పులు చేయాల్సి ఉంటుంది.
ఆ ఫొటోల్లో ట్రంప్ అంతరంగం
గ్రీన్‌లాండ్‌ను ఎప్పుడెప్పుడు సొంతం చేసుకోవాలా? అని డొనాల్డ్ ట్రంప్ తెగ ఆలోచిస్తున్నారు. ఆయన మనసంతా అక్కడే ఉంది. అమెరికా అధ్యక్ష భవనమైన వైట్‌హౌస్ మంగళవారం నాలుగు ఆసక్తికరమైన ఫొటోలను ‘ఎక్స్’లో షేర్ చేసింది. వీటిని ఒక క్రమపద్ధతిలో అమర్చి చూస్తే ట్రంప్ అంతరంగం బయటపడుతోంది. ఇందులో ట్రంప్ వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీసు కిటికీ నుంచి అటువైపున్న గ్రీన్‌లాండ్‌ను నిశితంగా గమనిస్తున్నారు. తాజా పరిస్థితిని ఆయన పర్యవేక్షిస్తున్నట్లుగా దీనికి శీర్షికను జోడించారు.


