ఇరాన్‌పై యుద్ధం.. డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు | Trump Claims Iran Gave The US A Major Present, Suggesting A Link To The Strait Of Hormuz, Sparks Global Speculation | Sakshi
Sakshi News home page

ఇరాన్‌పై యుద్ధం.. డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

Mar 25 2026 9:13 AM | Updated on Mar 25 2026 10:21 AM

Trump claims Iran gave the US a major present, suggesting a link to the Strait of Hormuz

వాషింగ్టన్‌: ఇరాన్‌పై యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ నుంచి అమెరికాకు ఒక ‘రహస్య బహుమతి’ అందిందని ఆయన ప్రకటించారు. 

వైట్ హౌస్‌లో ట్రంప్‌ మీడియాతో మాట్లాడారు. ‘వారు మాకు ఒక బహుమతి ఇచ్చారు. అది చాలా పెద్దది. దాని విలువ అపారం. ఇది అణు సంబంధమైనది కాదు. చమురు, గ్యాస్‌కు సంబంధించినది. వారు చేసిన పని చాలా మంచిది’ అని పేర్కొన్నారు. అయితే, ఆ బహుమతి ఏమిటన్నది ఆయన స్పష్టంగా వెల్లడించలేదు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికపై కొత్త చర్చలకు దారితీసాయి. చమురు సరఫరా, సముద్ర మార్గ భద్రత లేదా ఇతర వ్యూహాత్మక అంశాలకు సంబంధించినదా అన్న ఊహాగానాలు మొదలయ్యాయి.

ట్రంప్‌ మరోసారి అమెరికాదే పైచేయి అని పునరుద్ఘాటించారు. అదే సమయంలో యుద్ధం త్వరగా ముగియడం పట్ల రక్షణశాఖ కార్యదర్శి పీట్‌ హెగ్సెత్ నిరాశ చెందారని తెలిపారు. అమెరికా అధికారులు టెహ్రాన్‌లోని కీలక వ్యక్తులతో సంప్రదింపులు జరుపుతున్నారని, ఇరాన్ నాయకులు యుద్ధాన్ని ముగించేందుకు ఒప్పందానికి ఆసక్తి చూపుతున్నారని ఆయన పేర్కొన్నారు.

హర్మూజ్‌ జలసంధి ప్రపంచంలో అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గం. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు ఐదో వంతు ఈ మార్గం ద్వారా వెళ్తుంది. ఇరాన్ తరచుగా ఈ మార్గాన్ని మూసివేస్తానని హెచ్చరించడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లలో అస్థిరత ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

గత కొన్ని వారాలుగా అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అమెరికా ఇప్పటికే హర్మూజ్‌ ప్రాంతంలో నౌకాదళాన్ని మోహరించింది. మిత్రదేశాలను కూడా యుద్ధ నౌకలు పంపమని కోరింది. అయితే, చాలా దేశాలు దీనికి నిరాకరించాయి.

ట్రంప్ చెప్పిన ‘రహస్య బహుమతి’ అసలు ఏమిటన్నది స్పష్టత లేకపోయినా, ఇది అమెరికా–ఇరాన్ సంబంధాల్లో తాత్కాలిక సర్దుబాటు సంకేతమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ పరిణామం చమురు ధరలు, అంతర్జాతీయ మార్కెట్లు, భద్రతా సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement