మళ్లీ మొదటికి! | Trump cancels US envoys trip to Pakistan for talks on Iran war | Sakshi
Sakshi News home page

మళ్లీ మొదటికి!

Apr 26 2026 4:44 AM | Updated on Apr 26 2026 11:19 AM

Trump cancels US envoys trip to Pakistan for talks on Iran war

ఇస్లామాబాద్‌లో పాక్‌ ప్రధాని షెహబాజ్‌తో ఇరాన్‌ మంత్రి అరాఘ్చీ

వెనుతిరిగిన ఇరాన్‌... ముందుకు రాని అమెరికా

డిమాండ్ల చిట్టాను పాక్‌కు ఇచ్చేసి ఒమన్‌కు పయనమైన ఇరాన్‌ మంత్రి 

పరోక్ష చర్చలకు ఆసక్తి చూపని ట్రంప్‌ 

పాక్‌కు తన బృందాన్ని పంపబోమని వెల్లడి 

రెండో దఫా ప్రత్యక్ష చర్చలపై వీడని పీటముడి

ఇస్లామాబాద్‌/వాషింగ్టన్‌/దుబాయ్‌: పశ్చిమాసియాలో హార్మూజ్‌ దిగ్బంధం ఏ స్థాయిలో కొనసాగుతోందో పాకిస్తాన్‌ వేదికగా రెండో దఫా ప్రత్యక్ష చర్చలపై ప్రతిష్టంభన అదే స్థాయిలో కొనసాగుతోంది. ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ ఒకడుగు ముందుకేసి పాకిస్తాన్‌కు స్వయంగా విచ్చేసి ఆ దేశ ప్రధాని, ఆర్మీ చీఫ్‌లతో చర్చిస్తున్న వేళ సంతోషం వ్యక్తంచేసిన అమెరికా తన బృందాన్ని సైతం పంపేందుకు సంసిద్ధమవుతుండగా అరాఘ్చీ హఠాత్తుగా పాక్‌కు వీడి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కోపం తెప్పించారు.

దీంతో ఇరాన్‌ బృందంలేని పాకిస్తాన్‌లో తాము మాత్రం ఎలా ప్రత్యక్ష చర్చలకు కూర్చోగలమనే అసహనంతో ట్రంప్‌ వెంటనే తన బృందం ప్రయాణాన్ని రద్దుచేశారు. దీంతో రెండోదఫా ప్రత్యక్ష చర్చలు ఎప్పుడు జరుగుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఈ అంశంలో ఇరాన్‌ ఒక స్పష్టతనిచ్చింది. అమెరికాతో మరోమారు ప్రత్యక్షచర్చలకు కూర్చోబోమని తెగేసి చెప్పింది. పరోక్ష చర్చలకే తాము సుముఖంగా ఉన్నామని ఇరాన్‌ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్‌ బఘేల్‌ శనివారం ప్రకటించారు.  

పాక్‌ ప్రధాని, ఫీల్డ్‌ మార్షల్‌తో మంతనాలు 
పాక్‌ నుంచి ఒమన్‌కు వెళ్లిపోయే ముందు ఇరాన్‌ విదేశాంగ మంత్రి అరాఘ్చీ ఇస్లామాబాద్‌లో పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్, ఆర్మీ చీఫ్, ఫీల్డ్‌ మార్షల్‌ ఆసిం మునీర్, పాక్‌ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషక్‌ దార్‌లతో విస్తృతస్థాయిలో చర్చించారు. శాంతి చర్చలకు సంబంధించిన తమ దేశ డిమాండ్లను అమెరికాకు తెలియజేయాలని సంబంధిత ప్రతిపాదనల చిట్టాను షెహబాజ్‌కు అందజేసినట్లు తెలుస్తోంది. ఇరాన్‌ తరఫున ఉప విదేశాంగ మంత్రి కజీమ్‌ ఘరీబ్‌అబాదీ, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్‌ బఘేల్, పాక్‌ తరఫున పాక్‌ అంతర్గత మంత్రి మొహ్‌సిన్‌ నఖ్వీ సైతం ఈ భేటీలో పాల్గొన్నారు.

అయితే చర్చల్లో ప్రస్తావనకు వచ్చిన అంశాల వివరాలను అటు పాక్‌గానీ ఇటు ఇరాన్‌గానీ అధికారికంగా బహిర్గతంచేయలేదు. ప్రాంతీయ అస్థిరత, శాంతి చర్చల అంశాలపై నేతలు చర్చించారని సామాజిక మాధ్యమంలో ఇరాన్‌ రాయబార కార్యాలయం ఒక పోస్ట్‌పెట్టింది. ఇరాన్‌ పెట్టిన షరతులను ఇస్లామాబాద్‌కు విచ్చేసే అమెరికా ప్రతినిధుల ఎదుట పాక్‌ పెట్టనుందని, వాటికి సమ్మతిస్తేనే ప్రత్యక్ష చర్చలకు ఇరాన్‌ బృందం పాక్‌కు రానుందని పాక్‌ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ వివరాలను తుర్కియేతో పాక్‌ పంచుకుంది.  

మీరు వెళ్లాల్సిన అవసరం లేదు.. 
తమ బృందం రాకముందే ఇరాన్‌ మంత్రి పాక్‌ నుంచి వెళ్లిపోయారనే వార్త తెల్సి ట్రంప్‌ వెంటనే కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ ప్రతినిధులనూ పాక్‌కు పంపబోమని తెగేసి చెప్పారు. ఈ మేరకు సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్‌ సోషల్‌’లో ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘18 గంటలు ప్రయాణించి ఇస్లామాబాద్‌కు వెళ్లేందుకు నా బృందం సిద్ధమవుతుంటే వెంటనే ఆగిపొమ్మని చెప్పేశా. పాక్‌కు అన్ని గంటలపాటు ప్రయాణంచేయడం వృథా. అనవసర శ్రమ. పాక్‌లో మనతో మాట్లాడ్డానికి ఎవరూ లేనప్పుడు, ఎలాంటి చర్చల్లేనిదానికి అంతదూరం వెళ్లడం దండగ.

అసలే ఇరాన్‌లో ఎవరు తమ నేతనో తేల్చుకోలేక తలలు పట్టుకుంటున్నారు. వాళ్లలో ఇన్‌చార్జ్‌ ఎవరో వాళ్లకే తెలీడంలేదు. ఆట మనచేతుల్లోనే ఉంది. వాళ్లకు అంతగా మాట్లాడాలనుకుంటే ఇరాన్‌ నాయకులు మనకు ఫోన్‌చేసి మాట్లాడతారు. మేం వినేందుకు సిద్ధంగా ఉన్నాం’’అని ట్రంప్‌ స్పష్టంచేశారు. పశి్చమాసియాలో అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్‌ విట్కాఫ్, ట్రంప్‌ అల్లుడు జేర్డ్‌ కుష్నర్‌లను పాక్‌కు కొద్దిసేపట్లో పంపబోతున్నామని శ్వేతసౌధంలో ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్‌ లీవిట్‌ అంతకుముందే ప్రకటించగా కొన్ని నిమిషాలకే ట్రంప్‌ విరుద్ధమైన ప్రకటన చేశారు.

దీంతో అమెరికా ప్రతినిధి బృందం పాక్‌ పర్యటన చివరినిమిషంలో వాయిదాపడింది. ఈ బృందం ఇక ఎప్పుడు పాక్‌కు వస్తుందనేది చెప్పలేని పరిస్థితి నెలకొంది. అయితే ప్రత్యక్ష చర్చల కోసం తమ ప్రయత్నాలు నిరాటంకంగా కొనసాగుతాయని పాక్‌ విదేశాంగ మంత్రి ఇషాక్‌దార్‌       పునరుద్ఘాటించారు. 

అమెరికా చిత్తశుద్ధిచూద్దాం.. 
పాక్‌ నుంచి ఒమన్‌ రాజధాని మస్కట్‌కు చేరుకున్న ఇరాన్‌ మంత్రి అరాఘ్చీ ‘ఎక్స్‌’లో ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘పాక్‌లో పర్యటన సత్ఫలితాలనిచ్చింది. యుద్ధం శాశ్వత పరిసమాప్తికి మేం చేసిన ప్రతిపాదనలను పాక్‌ ముందుంచాం. వాటిని వినేందుకు, యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా ఏపాటి చిత్తశుద్ధిచూపుతుందో చూద్దాం’’అని అన్నారు. ఒమన్‌ తర్వాత రష్యాలో అరాఘ్చీ పర్యటిస్తారు. తిరిగి ఆయన శనివారం లేదా ఆదివారం పాక్‌కు వచ్చే అవకాశముందని తెలుస్తోంది.  

ఇంధనాన్ని ఆదా చేసుకోవాలి: మసూద్‌ 
యుద్ధకాలంలో ఇరాన్‌ ఇంధన వనరులు, మౌలికవసతులను అమెరికా సేనలు దారుణంగా దెబ్బతీయడంతో వాటిని ఇప్పుడు పొదుపుగా వాడుకోవాలని ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ సూచించారు. ‘‘ఇంట్లో పది లైట్లు ఉంటే అన్ని వెలిగించాల్సిన అవసరమేంటి? ఒక రెండు వెలిగిస్తే సరిపోతుంది’’అని సలహా ఇచ్చారు. కరెంట్‌ వృథా ఖర్చును భారీగా తగ్గించుకోవాలని ఇరాన్‌ విద్యుత్‌ సంస్థ సీఈవో తవానిర్‌ ఇరానియన్లను కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement