California Shooting: టిక్‌టాక్‌ స్టార్‌ హత్య

TikTok star Anthony Barajas Passed away after California cinema shooting - Sakshi

 కరోనా థియేటర్‌లో కాల్పులు

అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన రైలీ గుడ్రిచ్‌

 వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ టిక్‌టాక్‌స్టార్‌ ఆంథోనీ కన్నుమూత

కాలిఫోర్నియా: అమెరికాలోని  కరోనా థియేటర్లో చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడిన టిక్‌టాక్‌ స్టార్‌ ఆంథోనీ బరాజాస్ (19) తుది శ్వాస విడిచాడు. గతం వారం రోజులుగా మృత్యువుతో పోరాడిన ఆంథోనీ మెదడులోని తీవ్ర గాయాల కారణంగా చనిపోయినట్టు  కాలిఫోర్నియా పోలీసులు  ప్రకటించారు. 

గత నెల 26 న దక్షిణ కాలిఫోర్నియాలోని కరోనా థియేటర్‌లో హారర్‌ మూవీ  "ది ఫరెవర్ పర్జ్‌​"  ప్రదర్శిస్తున్న సమయంలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. సినిమా ముగిసిన తర్వాత, ఆడిటోరియం శుభ్రం చేస్తున్నథియేటర్ ఉద్యోగులు రక్తపు మడుగులో పడిఉన్న ఇద్దరు బాధితులను  గుర్తించారని రివర్‌సైడ్ కౌంటీ ప్రాసిక్యూటర్ మైక్ హెస్ట్రిన్ ఒక ప్రకటనలో తెలిపారు. చాలా సమీపంనుంచి ఇద్దర్నీ తలపై గురిపెట్టి  మరీ కాల్చిన ఈ ఘటనలో ఆంథోనీ ఫ్రెండ్‌ రైలీ గుడ్రిచ్‌ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. తీవ్రంగా గాయపడిన ఆంథోనీని ఆసుపత్రికి తరలించి వెంటిలేటర్‌పై చికిత్స అందించారు.

కానీ ఫలితం లేకపోవడంతో వైద్యులు లైఫ్‌ సపోర్టు తొలగించారు. దీంతో అతను సోమవారం తుదిశ్వాస విడిచినట్టు కాలిఫోర్నియా అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా అతని కుటుంబానికి, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఇది అనాలోచిత చర్యగా ప్రకటించారు. ఈ ఘటనలో నిందితుడు జోసెఫ్ జిమెనెజ్ (20)ను  అరెస్టు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.  


రైలీ గుడ్రిచ్‌ (ఫైల్‌ ఫోటో)

చెరగని చిరునవ్వు, దయగల హృదయం ఆంథోనీ సొంతం.తన గురించి తెలిసిన వారందరికీ అతడొక గిప్ట్‌..ఆయనలేని లోటు తీరనిది అంటూ ఆంథోనీ కుటుంబం నివాళులర్పించింది. అటు ఆంథోనీ అకాల మరణంపై స్నేహితులు తీవ్ర విచారం చేశారు. ఫస్ట్‌ డేట్‌లోనే ప్రాణాలు కోల్పోయిన ఆంథోనీ, రైలీని తలుచుకుని కన్నీరు పెట్టుకున్నారు. మరోవైపు ఆంథోనీ బరాజాస్ అవయవాలను దానం చేయన్నారని అతని స్నేహితుడు  మాలిక్ ఎర్నెస్ట్ ట్విట్‌ర్‌లో తెలిపారు.

కాగా ఆంథోనికి టిక్‌టాక్‌లో దాదాపు 10 లక్షల మంది, ఇన్‌స్టాలో 50 వేలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. హైస్కూల్‌ స్థాయిలో అద్భుతమైన సాకర్ ప్లేయర్‌గా పాపులర్‌ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఆంథోని లైఫ్ సపోర్ట్‌లో ఉన్నప్పుడు వైద్య ఖర్చుల నిమిత్తం ‘గోఫండ్‌మీ’ ద్వారా 80వేల డాలర్లకు పైగా విరాళాలు రావడం గమనార్హం.


నిందితుడు నజోసెఫ్ జిమెనెజ్(ఫైల్‌ ఫోటో)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top