కెనడాలో వారం వ్యవధిలో..  ముగ్గురు భారత సంతతి వ్యక్తులు హత్య | Three Indian-origin people murdered in Canada | Sakshi
Sakshi News home page

కెనడాలో వారం వ్యవధిలో..  ముగ్గురు భారత సంతతి వ్యక్తులు హత్య

Mar 19 2026 6:28 AM | Updated on Mar 19 2026 11:23 AM

Three Indian-origin people murdered in Canada

జాతి విద్వేష దాడులుగా అనుమానాలు

అట్టావా: కెనడాలో జాతి విద్వేష ఘటనలపై భారతసంతతి వాసులు ఆందోళన చెందుతున్నారు. వారం వ్యవధిలో భారతసంతతికి చెందిన ముగ్గురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. మార్చి 14వ తేదీన అల్బెర్టా ప్రావిన్స్‌లో బీరీందర్‌ సింగ్‌(22) లెడుక్‌ ప్రాంతంలో వాహనంలో ఉండగా కాల్పులకు గురై ప్రాణాలు కోల్పోయాడు. మార్చి 13వ తేదీన సాస్కాట్చెవాన్‌లోని నార్త్‌ బ్యాటిల్‌ ఫోర్డ్‌లో దేవీందర్‌ సింగ్‌(31), అదే రోజు ఫోర్ట్‌ సెయింట్‌ జాన్‌ వద్ద జరిగిన గొడవలో గుర్‌కిరీట్‌ మనోచా(31) మృతి చెందారు. 

‘ఆ రోజు మధ్యాహ్నం సమయంలో లెడుక్‌ వద్ద కారులో బీరీందర్‌తో కలిసి కారులో ఉన్నాం. అంతలోనే ఓ పికప్‌ కారు మా పక్కన వచ్చి ఆగింది. అందులోని వ్యక్తులు మాపై కాల్పులు జరిపారు. తూటాలు తగిలి కారు స్టీరింగ్‌ వద్ద ఉన్న బీరీందర్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.  ఇది జాతి విద్వేష ఘటనే అనుకుంటున్నాం’అని బీరీందర్‌ స్నేహితుడు తెలిపారు. మారుమూల, జన సంచారం అంతగా లేని ప్రాంతాలకు వెళ్లడం ప్రమాదకరమన్నారు. 

కాగా, దేవీందర్‌ హత్యపై దర్యాప్తు జరుగుతోందని రాయల్‌ కెనడియన్‌ మౌంటెడ్‌ పోలీస్‌(ఆర్‌సీఎంపీ) తెలిపింది. రెండో ఘటన. బ్రిటిష్‌ కొలంబియాకు చెందిన గుర్‌కిరీట్‌ సింగ్‌ మనోచా మేనేజ్‌మెంట్‌ డిగ్రీ చదువుకునేందుకు ఫోర్ట్‌ సెయింట్‌ జాన్‌కు మకాం మార్చాడు. ఈ నెల 13న చార్లీలేక్‌ బోట్‌ క్యాంపు వద్ద రాత్రి 11 గంటల సమయంలో జరిగిన గుర్తు తెలియని వ్యక్తులతో తలెత్తిన ఘర్షణలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు వచ్చే సరికే చనిపోయి ఉన్నాడు. ఇతడి సొంతూరు భారత్‌లోని ఉజ్జయిని. కాగా, గుర్‌కిరీట్‌తో ఘర్షణ పడిన వ్యక్తులెవరనే దానిపై పోలీసులు ఒక స్పష్టతకు రాలేదు.

 రాత్రి వేళ, అదీ జన సంచారం తక్కువగా ఉండే చోటుకావడంతో దర్యాప్తు నెమ్మదిగా సాగుతోందని నేర విభాగం తెలిపింది. మూడో ఘటన..మార్చి 13వ తేదీన ఉదయం 8గంటల వేళ క్యాబ్‌ డ్రైవర్‌ దేవీందర్‌ సింగ్‌కు హిచింగ్‌ పోస్ట్‌ మోటెల్‌ నుంచి పిలుపు వచ్చింది. అక్కడికి వెళ్లాక అతడిపై ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. అతడిని తుపాకీతో కాల్చి పరారయ్యారు. తీవ్ర గాయాలతో దేవీందర్‌ మృతి చెందాడు. దుండగులను పోలీసులు అరెస్ట్‌ చేసి, కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటనతో భారత సంతతి క్యాబ్‌ డ్రైవర్లు తీవ్రంగా భయపడుతున్నారని దేవీందర్‌ పనిచేసే క్రౌన్‌ క్యాబ్‌ సంస్థ యజమాని హరీశ్‌ కొరాఠ్‌ తెలిపారు. కొందరు క్యాబ్‌ డ్రైవింగ్‌ మానేశారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement