ఇరాన్‌లో భావోద్వేగ దృశ్యాలు.. ఖమేనీకి కన్నీటి నివాళి | Tehran in Tears as Khamenei Farewell Draws Millions | Sakshi
Sakshi News home page

ఇరాన్‌లో భావోద్వేగ దృశ్యాలు.. ఖమేనీకి కన్నీటి నివాళి

Jul 4 2026 7:30 AM | Updated on Jul 4 2026 12:25 PM

Tehran in Tears as Khamenei Farewell Draws Millions

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో భావోద్వేగ వాతావరణం నెలకొంది. మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ తుదివీడ్కోలు కార్యక్రమానికి దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. గ్రాండ్ మోసల్లా ప్రాంగణం కన్నీళ్లు, నినాదాలు, సంతాప సందేశాలతో శోకసంద్రంగా మారింది. ప్రార్థన మందిరం వద్ద నిశ్శబ్దం అలుముకోగా.. ఖమేనీ పార్థివదేహం రాకతో ఆ ప్రాంతంలో రోదనలు మిన్నంటాయి.

ఖమేనీ భౌతికకాయాన్ని జాతీయ జెండాతో కప్పి ప్రాంగణానికి తీసుకురాగా, ఆయన తలపై ఉండే నల్ల టర్బన్‌ను కూడా సంప్రదాయంగా ఉంచారు. కుటుంబ సభ్యుల పార్థివదేహాలను ప్రత్యేక పేటికల్లో ఆయన పక్కపక్కనే ఉంచారు. ఈ క్రమంలో అత్యంత భావోద్వేగ దృశ్యంగా ఆయన 14 నెలల మనవరాలు జహ్రా మొహమ్మది గోల్పాయెగాని చిన్న శవపేటికను ప్రత్యేకంగా ప్రదర్శించారు. 

జాతీయ జెండాతో కప్పిన ఆ చిన్న పేటిక పక్కనే ఆమె ఫోటోను ఉంచడంతో అక్కడున్నవారు తీవ్రంగా భావోద్వేగానికి లోనయ్యారు. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాకర్ ఘలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి సహా పలువురు ఉన్నతాధికారులు భావోద్వేగాన్ని నియంత్రించుకోలేక కన్నీరు పెట్టుకున్నారు.

ఫిబ్రవరి 28న అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అప్పటి నుంచి భద్రపరచిన భౌతికకాయాన్ని ఇప్పుడు ఆరు రోజుల పాటు జరిగే సంతాప కార్యక్రమాల కోసం ప్రజల సందర్శనార్థం ఉంచారు.

టెహ్రాన్‌లోని గ్రాండ్ మోసల్లా వద్దకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. గేట్లు తెరవగానే భారీ జనసంద్రం లోపలికి ప్రవేశించింది. అమెరికాకు వ్యతిరేక నినాదాలతో పాటు ప్రతీకారాన్ని సూచించే ఎరుపు రంగు జెండాలు ప్రదర్శించారు. మరోవైపు.. ‘‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను హతమార్చాలని, అమెరికాపై ప్రతీకారం తీర్చుకోవాలని’’ వేలమంది నినాదాలు చేస్తూ.. ఫ్లకార్డులు ప్రదర్శించడం చర్చనీయాంశమైంది.

ఈ సంతాప కార్యక్రమానికి దాదాపు 100 దేశాల నుంచి ప్రతినిధులు హాజరైనట్లు సమాచారం. భారత్ సహా రష్యా, పాకిస్థాన్, టర్కీ తదితర దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. మొత్తం రెండు కోట్ల మంది వివిధ దశల్లో ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని అంచనా వేశారు. అధికారులు కఠిన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఖమేనీ భౌతికకాయం టెహ్రాన్‌లో సోమవారం వరకు ఉంచి, అనంతరం ఖోమ్‌కు తరలించనున్నారు. మంగళవారం కర్బలా, నజాఫ్ వంటి పవిత్ర నగరాల మీదుగా ప్రయాణించి, చివరగా గురువారం ఆయన స్వస్థలమైన మష్హద్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ ఆరు రోజుల సంతాప యాత్రతో ఇరాన్ అంతటా శోక వాతావరణం కొనసాగుతోంది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement