తాలిబన్ల సంచలన నిర్ణయం.. ఆవేదనలో ఆప్ఘన్‌ బాలికలు

Taliban Orders Afghan Girls Schools Shut Down After Reopening - Sakshi

కాబూల్‌: తాలిబన్లు మరోసారి మాట తప్పారు. ప్రపంచ దేశాలు తమ వైపు వేలెత్తి చూపించేలా షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నారు. బాలికలు హైస్కూల్​ విద్యను అభ్యసించేందుకు అనుమతించట్లేదని ప్రకటించడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. 

కాగా, ఈ ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభంలో బాలికలను హైస్కూల్​ విద్యకు కూడా అనుమతిస్తున్నట్లు తాలిబన్లు కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. తీరా స్కూల్స్‌ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే తమ నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్టు షాకిచ్చారు. అయితే, ప్రపంచ దేశాలు తమ ప్రభుత్వాన్ని గుర్తించేందుకు వీలుగా పలు సంస్కరణలు చేపడుతున్నట్లు గతంలో ప్రకటించారు. ఇందులో భాగంగానే బాలికలకు ఉన్నత చదువులు అందించేందుకు కూడా అనుమతిస్తున్నట్లు చెప్పారు. కానీ మళ్లీ మాట మార్చుతూ బాలికలను చదువుకు దూరం చేశారు.  బాలికలకు ఉన్నత విద్య అభ్యసించేందుకు అనుమతించట్లేదని.. ఆరవ తరగతి వరకే పరిమితం చేస్తున్నట్లు చెప్పారు. దీంతో బాలికలు ఆవేదనకు గురవుతున్నట్టు సమాచారం.

అయితే, ఇందుకు కారణం గ్రామీణ ప్రజలేనని తాలిబన్లు ఆరోపిస్తున్నారు. గ్రామీణ ప్రాంత, గిరిజన ప్రాంతాల్లో ఉన్న వారు తమ పిల్లలను స్కూల్స్‌కు పంపేందుకు అంగీకరించడంలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బాలికలకు ఉన్నత విద్యను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు.. తాలిబన్లు అధికారం చేపట్టిన నాటి నుంచి సీనియర్‌ నేతల మధ్య విబేధాలు భగ్గుమంటున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మహిళ స్వేచ్చ పట్ల ఆంక్షలు ఉండాలని, కఠినంగా వ్యవహరించాలని సీనియర్లు కోరుతుండగా.. స్వేచ్చ అవసరమంటూ మరికొందరు పట్టుబడుతున్నట్టు సమాచారం.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top