
దానినుంచి ఎక్స్, రేడియో తరంగాలు
ముప్పావు గంటకోసారి బలమైన సంకేతాలు
అంతరిక్షం అనంత రహస్యాల పుట్ట. మానవుడు ఇప్పటికీ గుర్తించని వింతలు, విడ్డూరాలకు అంతరిక్షంలో కొదవేలేదు. ఖగోళ శాస్త్రవేత్తలకు తాజాగా ఓ వింత అనుభవం ఎదురైంది. డీప్ స్పేస్‌లో ఓ గుర్తు తెలియని వస్తువును కనిపెట్టారు. అదేమిటన్నది వారికే అంతుబట్టడం లేదు. ఆ వస్తువు నుంచి రేడియో, ఎక్స్ తరంగాలు వెలువడుతున్నట్లు గుర్తించారు. అందులో తరచుగా పేలుళ్లు సంభవిస్తూ తరంగాలను ఉత్పత్తి చేస్తున్నట్లు చెబుతున్నారు.
ఈ వివరాలను జర్నల్ నేచర్‌లో ప్రచురించారు. ఈ అంతుబట్టని వస్తువు నుంచి ప్రతి 44 నిమిషాలకోసారి రెండు నిమిషాలపాటు బలమైన సంకేతాలు వెలువడుతున్నాయి. ఇది చాలా అసాధారణమని సైంటిస్టులు అంటున్నారు. ఇలాంటి పరిణామం మునుపెన్నడూ చూడలేదని స్పష్టంచేస్తున్నారు. ఇప్పటిదాకా అంతరిక్షంలో గుర్తించిన వస్తువుల్లో ఇలా తక్కువ సమయంలో తరచుగా సంకేతాలు వెలువడినట్లు తేలలేదు.
ఈ కొత్త వస్తువును లాంగ్ పిరియడ్ ట్రాన్సియంట్(ఎల్‌పీటీ) కేటగిరీలో చేర్చారు. ఇది మ్యాగ్నేటర్ కావొచ్చని అంచనా వేస్తున్నారు. మృత నక్షత్రానికి చెందిన అత్యధిక ఆయస్కాంత శక్తి కలిగిన అవశేషాన్ని మ్యాగ్నేటర్ అంటారు. రాబోయే రోజుల్లో రేడియో, ఎక్స్–రే టెలిస్కోప్‌ల ద్వారా ఇలాంటి వస్తువులను మరిన్ని గుర్తించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. విశ్వం ఆవిర్భావం గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇవి దోహదపడతాయని చెబుతున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్