breaking news
Deep Space gateway
-
అంతరిక్షంలో అంతుబట్టని వస్తువు
అంతరిక్షం అనంత రహస్యాల పుట్ట. మానవుడు ఇప్పటికీ గుర్తించని వింతలు, విడ్డూరాలకు అంతరిక్షంలో కొదవేలేదు. ఖగోళ శాస్త్రవేత్తలకు తాజాగా ఓ వింత అనుభవం ఎదురైంది. డీప్ స్పేస్‌లో ఓ గుర్తు తెలియని వస్తువును కనిపెట్టారు. అదేమిటన్నది వారికే అంతుబట్టడం లేదు. ఆ వస్తువు నుంచి రేడియో, ఎక్స్ తరంగాలు వెలువడుతున్నట్లు గుర్తించారు. అందులో తరచుగా పేలుళ్లు సంభవిస్తూ తరంగాలను ఉత్పత్తి చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ వివరాలను జర్నల్ నేచర్‌లో ప్రచురించారు. ఈ అంతుబట్టని వస్తువు నుంచి ప్రతి 44 నిమిషాలకోసారి రెండు నిమిషాలపాటు బలమైన సంకేతాలు వెలువడుతున్నాయి. ఇది చాలా అసాధారణమని సైంటిస్టులు అంటున్నారు. ఇలాంటి పరిణామం మునుపెన్నడూ చూడలేదని స్పష్టంచేస్తున్నారు. ఇప్పటిదాకా అంతరిక్షంలో గుర్తించిన వస్తువుల్లో ఇలా తక్కువ సమయంలో తరచుగా సంకేతాలు వెలువడినట్లు తేలలేదు. ఈ కొత్త వస్తువును లాంగ్ పిరియడ్ ట్రాన్సియంట్(ఎల్పీటీ) కేటగిరీలో చేర్చారు. ఇది మ్యాగ్నేటర్ కావొచ్చని అంచనా వేస్తున్నారు. మృత నక్షత్రానికి చెందిన అత్యధిక ఆయస్కాంత శక్తి కలిగిన అవశేషాన్ని మ్యాగ్నేటర్ అంటారు. రాబోయే రోజుల్లో రేడియో, ఎక్స్–రే టెలిస్కోప్‌ల ద్వారా ఇలాంటి వస్తువులను మరిన్ని గుర్తించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. విశ్వం ఆవిర్భావం గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇవి దోహదపడతాయని చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నిషిద్ధ కాంతి చిక్కింది
ఇప్పటిదాకా వినడమే తప్ప కంటికి కనబడని విశ్వపు సుదూరాల్లోని నిషిద్ధ కాంతి ఎట్టకేలకు చిక్కింది. దాన్ని హబుల్ టెలిస్కోప్ తాజాగా తన కెమెరాలో బంధించింది. భూమికి ఏకంగా 27.5 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో హైడ్రా నక్షత్ర రాశిలో ఉన్న ఎంసీజీ–01–24–014 స్పైరల్ గెలాక్సీ నుంచి వెలువడుతున్న ఈ కాంతి తరంగాలను ఒడిసిపట్టింది. వాటికి సంబంధించి అబ్బురపరిచే ఫొటోలను భూమికి పంపింది. టెలిస్కోప్ తాలూకు అడ్వాన్స్డ్ కెమెరా ఫర్ సర్వేస్ (ఏసీఎస్) ఈ ఘనత సాధించింది. అత్యంత స్పష్టతతో ఉన్న ఫొటోలు చూసి నాసా సైంటిస్టులతో పాటు అంతా సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. ఈ కిరణాల వెలుగులో కనువిందు చేస్తున్న ఎంసీజీ గెలాక్సీ అందాలకు ఫిదా అవుతున్నారు. కాస్మిక్ ఫొటోగ్రఫీ చరిత్రలోనే దీన్ని అత్యంత అరుదైన ఫీట్‌గా అభివరి్ణస్తున్నారు. హబుల్ ఫొటోల్లో కన్పిస్తున్న ఎంసీజీ గెలాక్సీ పూర్తిస్థాయిలో వికసించిన నిర్మాణం, అత్యంత శక్తిమంతమైన కేంద్రకంతో కనువిందు చేస్తోంది. ఇది అత్యంత చురుకైన కేంద్రకాలున్న టైప్–2 సీఫెర్ట్ గెలాక్సీల జాబితాలోకి వస్తుందని నాసా పేర్కొంది. సీఫెర్ట్ గెలాక్సీలు అంతరిక్షంలో మనకు అత్యంత దూరంలో ఉండే అతి ప్రకాశవంతమైన నక్షత్ర మాలికలైన క్వాసార్ల సమీపంలో ఉంటాయి. అయితే క్వాసార్లు తామున్న గెలాక్సీలను బయటికి ఏమాత్రమూ కని్పంచనీయనంతటి ప్రకాశంతో వెలిగిపోతుంటాయి. సీఫెర్ట్ గెలాక్సీలు మాత్రం వీక్షణకు అనువుగానే ఉంటాయి. కానీ అత్యంత సుదూరంలో ఉన్న కారణంగా వీటి వెలుతురు ఇప్పటిదాకా మనిషి కంటికి చిక్కలేదు. ఆ కారణంగానే సైంటిస్టుల పరిభాషలో దాన్ని ‘నిషిద్ధ కాంతి’గా ముద్దుగా పిలుచుకుంటూ వస్తున్నారు. పైగా ఈ కాంతి పుంజాలు భూమ్మీద మనకు ఇప్పటిదాకా తెలిసిన పరిమాణ భౌతిక శాస్త్ర నియమాలకు పూర్తిగా అతీతమన్నది సైంటిస్టుల నమ్మకం. అనంత విశ్వంలో అంతటి సుదూర అంతరిక్ష క్షేత్రంలో మన భౌతిక శాస్త్ర నియమాలన్నీ తల్లకిందులవుతాయని వారు చెబుతుంటారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చంద్రుడిపై నాసా మానవ సహిత ప్రయోగం
వాషింగ్టన్: చంద్రుడిపై మానవ సహిత అంతరిక్ష ప్రయోగాన్ని చేపట్టేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సమాయత్తమవుతోంది. ఏడాదిపాటు చంద్రుడి కక్ష్యలో పరిభ్రమించేలా ఈ నూతన మిషన్‌ను రూపొందిస్తుంది. 2030లో మార్స్ మానవ సహిత ప్రయోగం కంటే ముందే అనగా 2027లోనే ఈ ప్రయోగాన్ని చేపట్టాలని నాసా భావిస్తోంది. మార్స్ ప్రయోగానికి అవసరమయ్యే సాంకేతికతను పరీక్షించేందుకు చంద్రుడి చుట్టూ ‘డీప్ స్పేస్ గేట్‌వే’ను నిర్మించనుంది. దీనినే మార్స్‌పైకి చేసే ప్రయోగానికి లాంచింగ్ పాయింట్‌గా ఉపయెగించుకోనున్నామని నాసాలోని హ్యూమన్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ ఆపరేషన్స్ మిషన్ డిప్యూటీ అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ గ్రేగ్ విలియమ్స్ తెలిపారు. ఈ లునార్ మిషన్‌లో మొత్తం ఐదు సహ ప్రయోగాలు ఉంటాయని, వీటిలో నాలుగు సిబ్బందికి అవసరమైన హార్డ్‌వేర్‌ను అందిస్తుందని వెల్లడించారు.