3000 ఏళ్లుగా ఎడారి గర్భంలో రాజు సమాధి | The story about King Tut's tomb - Sakshi
Sakshi News home page

3000 ఏళ్లుగా ఎడారి గర్భంలో రాజు సమాధి

Published Tue, Aug 29 2023 8:42 AM

story about king tuk tomb - Sakshi

భూమి తన గర్భంలో అనేక రహస్యాలను దాచుకుంది. వాటి గురించి నేటికీ ఎవరికీ పూర్తిగా తెలియదు. అయితే ఈ రహస్యాలు కాలక్రమేణా ప్రపంచం ముందు బయటపడుతూనే ఉన్నాయి. టుటన్‌ఖామెన్ సమాధి 3000 సంవత్సరాలకు పైగా ప్రపంచానికి తెలియని పెద్ద రహస్యంగా నిలిచింది. 1922 నవంబర్‌లో బ్రిటిష్ ఈజిప్టు శాస్త్రవేత్త హోవార్డ్ కార్టర్, అతని బృందం ఈజిప్టు రాజుల ఘాటీలో టుటన్‌ఖామెన్ సమాధిని తవ్వడం ప్రారంభించినప్పుడు అనేక రహస్యాలు ప్రపంచానికి తెలియవచ్చాయి. 

ఎడారి గర్భంలో దాగిన సమాధి
టుటన్‌ఖామెన్ సమాధి 3000 సంవత్సరాలకు పైగా ఎడారి గర్భంలోనే దాగి ఉంది. 1922, నవంబర్ 4న కార్టర్ బృందం ఇక్కడ తవ్వకాలు మొదలుపెట్టినప్పుడు వారు ఇసుకలో ఖననం చేసిన సమాధి మెట్లను కనుగొన్నారు. తరువాత ఆ బృందం మెట్ల దారిని శోధించింది. నవంబర్ చివరి నాటికి వారు ఒక గది, ఒక భారీ ఖజానా, సమాధి తలుపులను కనుగొన్నారు. కార్టర్, అతని బృందం అక్కడి తలుపునకు గల రంధ్రం నుంచి లోపలకి చూసి తెగ ఆశ్చర్యపోయారు. ఈవిధంగా వారు బంగారు నిధులతో నిండిన గదిని కనుగొన్నారు.
 
9 ఏళ్ల వయసులోనే పాలకుడు
1922, నవంబర్ 26న ఈ బంగారు నిధిని కార్టర్, అతని బృందం కనుగొంది. అయితే టుటన్‌ఖామెన్ మమ్మీ ఉన్న శవపేటికను చాలా కాలం తర్వాత కనుగొన్నారు. టుటన్‌ఖామెన్ ఈజిప్ట్ పాలకుడు. ఇతనిని కింగ్ టుట్ అని పిలిచేవారు. ఈజిప్ట్ ఫారో రాజు టుట్ 1333 బీసీలో కేవలం తన 9 సంవత్సరాల వయస్సులోనే ఈజిప్ట్ పాలకుడయ్యాడు. అతని పాలన అనంతరం అతను మరణించినప్పుడు, సంప్రదాయం ప్రకారం అతని మృతదేహాన్ని మమ్మీగా తీర్చిదిద్ది భద్రపరిచారు. అతని మమ్మీతో పాటు పలు కళాకృతులు, నగలు, నిధులు కూడా అతని సమాధిలో ఖననం చేశారు. అయితే కాలక్రమేణా ఈ సమాధి ఎడారి ఇసుకలో కూరుకుపోయింది. 

ఎట్టకేలకు వీడిన మరణ రహస్యం
కింగ్ టుట్ సమాధిలో వేలాది కళాఖండాలు, ప్రసిద్ధ శిరస్త్రాణం లభ్యమయ్యాయి. సమాధి నుండి బయటపడిన అమూల్య వస్తువుల జాబితాను రూపొందించేందుకు కార్టర్, అతని బృందానికి సుమారు 10 సంవత్సరాలు పట్టింది. సమాధిని కనుగొన్న తరువాత కింగ్ టుట్ ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ ఈజిప్షియన్ చక్రవర్తులలో ఒకరిగా గుర్తింపుపొందారు. శాస్త్రవేత్తలు, విద్యార్థుల పరిశోధన అంశంగా ఇతని చరిత్ర నిలిచింది. అయితే కింగ్ టుట్ ఎలా మరణించాడనేది చాలా కాలం మిస్టరీగానే మిగిలింది. ఈ రాజు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని కొందరు చరిత్రకారులు అంటుండగా, మరికొందరు ప్రమాదంలో మరణించాడంటారు. అయితే ఒక శతాబ్దం తర్వాత శాస్త్రవేత్తలు డిజిటల్ ఇమేజింగ్, డీఎన్‌ఏ పరీక్షల ద్వారా కింగ్ టుట్ మలేరియాతో మరణించినట్లు కనుగొన్నారు.
ఇది కూడా చదవండి: సిక్కుల తలపాగా రహస్యం ఏమిటి? దీనిని ఎందుకు ధరిస్తారు?

Advertisement
 

తప్పక చదవండి

Advertisement