Special Report On Mystery Deaths Of Russian Businessmen In 2022, Know Details - Sakshi
Sakshi News home page

రష్యాలో ఒకరి తర్వాత ఒకరు.. అపర కుబేరులు ఎందుకు చనిపోతున్నారు?

Published Thu, Jan 5 2023 7:26 PM

Special Report On Mystery Deaths of Russian Businessmen In 2022 - Sakshi

రష్యాలో అపర కుబేరులు హఠాత్తుగా చనిపోతున్నారు. అంత్యంత అనుమానస్పదంగా ప్రాణాలు వదిలేస్తున్నారు. కోట్లకు పడగలెత్తిన వారేఎందుకిలా చనిపోతున్నారో అంతు చిక్కడం లేదు. ఒక్క రష్యాలోనే కాదు ఇతర దేశాల్లోనూ రష్యన్ కుబేరులు మిస్టీరియస్‌గా తలలు వాల్చేస్తున్నారు. ఇవన్నీ ఆత్మహత్యలేనని పుతిన్ ప్రభుత్వం అంటోంది. అయితే మరణాలు జరిగిన తీరు చూస్తే మాత్రం ఇవి హత్యలేమో! అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ ఇవి హత్యలా? ఆత్మహత్యలా? లేక సహజ మరణాలా? హత్యలైతే వీటి వెనుక ఉన్న కుట్రదారు ఎవరు? సూత్రధారి ఎవరు? హంతకులు ఎవరు? 

ఏంటీ డెత్ మిస్టరీ?
డిసెంబరు 24న మన పొరుగునే ఉన్న ఒడిషాలోని రాయగడలోని ఓ హోటల్ కిటికీ నుంచి పడి రష్యాకు చెందిన ఎంపీ, మల్టీ బిలియనీర్  పావెల్ ఆంటోవ్ అనుమానస్పద స్థితిలో మరణించారు. దీనికి రెండు రోజుల ముందే అంటే డిసెంబరు 22న ఇదే హోటల్‌లో ఆంటోవ్ సన్నిహితుడు అయిన మరో రష్యన్  వ్లదిమీర్ బిడెనోవ్ గుండెపోటుతో మరణించారు. ఈ ఇద్దరితో పాటు మరో ఇద్దరు రష్యన్లు డిసెంబరు 21న ఈ హోటల్ లో దిగారు. ఆంటోవ్ 66వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోడానికి ప్రశాంతంగా ఉండే రాయగడ ప్రాంతాన్ని ఎంచుకున్న నలుగురు స్నేహితులు కలిసి ఇక్కడకు వచ్చారు.

బిడెనోవ్ మరణంతో  షాక్ తిన్న ఆంటోవ్ డిప్రెషన్‌లో పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుని ఉండచ్చన్నది పోలీసుల అనుమానం. అయితే ఈ రెండూ కూడా సహజ మరణాలో ఆత్మహత్యలో కావని ఇవి కచ్చితంగా కోల్డ్ బ్లడెడ్ మర్డర్లేనని మరి కొందరు అంటున్నారు. ఇంకో చిత్రం ఏంటంటే ఆంటోవ్ చనిపోయిన రోజే సెయింట్ పీటర్స్ బర్గ్ లోఅడ్మిరల్లీ షిప్ యార్డ్స్  డైరెక్టర్ జనరల్ అలెక్జాండర్ బుజకోవ్ హఠాత్తుగా మరణించారు. ఆయన మరణానికి కారణాలేంటన్నది కూడా ఇప్పటి వరకు తెలియరాలేదు.

వెనకున్నదెవరు?
ఏంటీ మరణాలు? వీటి వెనుక ఏమన్నా కుట్ర ఉందా? కిరాయి హంతకులు ఉన్నారా?  ఉంటే ఆ హంతకుల వెనుక  ఉన్నదెవరు? ఎందుకంటే చనిపోయిన ఈ ముగ్గురూ కూడా మామూలు మనుషులు కారు. ఆంటోవ్ అయితే రష్యాలోనే అత్యంత సంపన్నుడైన రాజకీయ నాయకుడు. వ్యాపారాల్లోనూ దిట్ట.  మిగతా వారూ మల్టీ బిలియనీర్లే. ఒక వేళ వీరివి హత్యలే అయితే.. వీరిని హతమార్చాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? కోట్లకు పడగలెత్తిన వీరిని హతమార్చడానికి కిరాయి హంతకులను కుదుర్చుకోగల సత్తా ఎవరికి ఉంటుంది? 

కచ్చితంగా ఈ కోటీశ్వరులను తలదన్నే పెద్దలే దీని వెనుక ఉండే అవకాశాలు ఉంటాయి. రష్యాలో ఇలా అనుమానస్పదంగా ప్రాణాలు వదిలేస్తోన్న కుబేరుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. అసలు రష్యాలో ఏం జరుగుతోంది? పెద్ద సస్పెన్స్ హర్రర్ అండ్ క్రైమ్ థ్రిల్లర్‌ను మరిపించే ఈ వరుస మిస్టీరియస్ డెత్స్ వెనుక ఉన్న కథేంటి? ఇదే ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిగా మారింది.

ఈ ఒక్క నెలలోనే అయిదుగురు రష్యన్ కుబేరులు అనుమానస్పదంగా మరణించారు. మొత్తం మీద ఏడాదికాలంగా 22 మంది రష్యన్ ప్రముఖులు భయానకంగా చనిపోయారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది రష్యాలోని ప్రముఖ చమురు , సహజ వాయువు కంపెనీల్లో అత్యున్నత హోదాల్లో ఉన్నవారే కావడం గమనార్హం. గ్రాజ్ పోమ్, నోవాటెక్ వంటి ఆయిల్ కంపెనీలు రష్యాలో వ్యాపారాలను శాసిస్తున్నాయి. ఈ రెండు కంపెనీలకు చెందిన కుబేరులు అనుమానాస్పదంగా మరణించిన వారిలో ఉండడం విశేషం.

చనిపోయిన వారిలో చాలా మంది తాము ఉన్న అపార్ట్‌మెంట్‌పై అంతస్థుల  కిటికీలనుండి కిందకు పడి చనిపోయారు.  కొందరయితే తుపాకీ కాల్పుల్లో చనిపోయారు. కొద్ది మంది గుండెపోటుతో మరణించినట్లు అధికారులు పేర్కొనగా ఒకళ్లిద్దరి విషయంలో మరణాలకు కారణాలు కూడా తెలీలేదు. కొందరి మరణాలు సంభవించిన తీరు మరీ భయంకరంగా ఉంది. ఇవన్నీ చూస్తే ఇవి నిజంగానే సహజ మరణాలా? ఆత్మహత్యలా? లేక కిరాయి హంతకులతో వీరిని ఎవరైనా తుదముట్టించారా? అన్న అనుమానాలు కలగక మానవు.

విగత జీవులుగా భార్య పిల్లలు.. ఆయనేమో ఉరికి
నోవాటెక్ కంపెనీ మాజీ డిప్యూటీ ఛైర్మన్ సెర్గీ ప్రోటో సెన్యా  ఈ ఏడాది ఏప్రిల్‌లో  కుటుంబ సభ్యులతో కలిసి స్పెయిన్ వెళ్లారు. అక్కడ ఓ లక్జరీ విల్లాలో బస చేశారు. ఓ రోజు ఉదయాన చూసే సరికి ప్రోటో సెన్యా విల్లా చూరుకు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించారు. ప్రొటో సెన్యా భార్య, కూతురుల మృతదేహాలు విల్లాలో ఉన్నాయి. ఆ ఇద్దరి శరీరాలపైనా గొడ్డలితో నరికిన ఆనవాళ్లు ఉన్నాయి. అలాగే కత్తితో పొడిచిన గాట్లు కూడా ఉన్నాయి. ప్రొటో సెన్యానే తన భార్యా పిల్లల్ని రాక్షసంగా చంపేసి ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడని స్పానిష్ పోలీసులు అన్నారు. ఒకవేళ ప్రొటొ సెన్యా ఆత్మహత్య చేసుకుని ఉంటే ఎందుకు చేసుకుంటున్నాడో ఓ లేఖను పెట్టే వాడు. కానీ ఈ విల్లాలో ఎక్కడా కూడా సూసైడ్ లెటర్ ను పోలీసులు స్వాధీనం చేసుకోలేదు.

ఒక్కరోజు ముందే
ప్రొటో సెన్యా విషాద మరణానికి ఒక్కరోజు ముందే ఏప్రిల్ 18న గ్యాజ్ ప్రోమ్ బ్యాంక్ మాజీ వైస్ ప్రెసిడెంట్ వ్లడిశ్లావ్ అవయేవ్ మాస్కోలనో తన అపార్ట్ మెంట్ లో భార్య పిల్లలతో సహా శవమై కనిపించారు. తన భార్య పిల్లల్ని కాల్చి చంపిన తర్వాత అవయేవ్ పిస్తోల్‌తో తనని తాను కాల్చుకుని చనిపోయి ఉండచ్చని భావిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇదే కంపెనీకి గతంలో వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన ఇగోర్ వోలో బుయేవ్ అయితే అవయేవ్ ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాదని అన్నారు. బహుశా వ్యవస్థలో చాలా పెద్దలకు సంబంధించిన కీలక సమాచారం ఏదో అవయేవ్ కు తెలిసి ఉంటుందని.. అది తమకి ప్రమాదమని భావించే వారి చేతిలో ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉంటాయని  ఇగోర్ భావిస్తున్నారు.

అనుమానస్పద మృతి
అవయేవ్ మరణానికి ఇంచుమించు నెల రోజుల క్రితం మార్చి 23న మెడ్ స్టార్మ్ కంపెనీ అధినేత వాసిలీ మెల్నికోవ్ నోవో గొరోడ్ లోని తన అపార్ట్ మెంట్‌లో తన భార్య, ఇద్దరు కొడుకులతో సహా అనుమానస్పద స్థితిలో మరణించారు. వైద్య పరికరాల తయారీ కంపెనీ అధినేత అయిన మెల్నికోవ్ తన భార్య, కొడుకులను కత్తితో పొడిచి చంపి అనంతరం తనని తాను పొడుచుకుని చనిపోయారన్నది పోలీసుల కథ. 

ఉరి తాడుకు వేలాడుతూ
గతేడాది జనవరి 30న గ్యాస్ ప్రోమ్ డైరెక్టర్ షుల్మన్ తన ఇంట్లోని బాత్ రూంలో శవమై కనిపించారు. ఆయన పక్కన ఓ సూసైడ్ నోట్ కూడా దొరికినట్లు పోలీసులు చెప్పారు. గ్యాజ్ ప్రోమ్ కంపెనీ మాజీ ఎగ్జిక్యూటివ్  ట్యుల్య కోవ్ సెయింట్ పీటర్ బర్గ్ లోని తన ఇంట్లో ఉరి తాడుకు వేలాడుతూ కనిపించారు.  ట్యుల్యకోవ్ చనిపోయిన మూడు రోజులకే   రష్యాలోనే ప్రముఖ ఆయిల్ కంపెనీ మ్యాగ్నెట్ గా పేరొందిన మిఖైల్ వాట్ ఫోర్డ్ ఇంగ్లాండ్ లోని  తన ఇంట్లో ఉరి తాడుకు వేలాడుతూ కనిపించాడు. ఆ తర్వాత స్కై రిసార్ట్ అధినేత ఆండ్రీ క్రుకోవ్ స్కీ  ఓ శిఖరంపై నుండి జారి పడి చనిపోయారు. 

పుతిన్‌పై అనుమానాలు
అన్నీ అనుమానస్పద మరణాలే. ప్రతీ మరణ ఘటన లోనూ ఎన్నో ప్రశ్నలు. ఏ ప్రశ్నకూ సమాధానం లేదు. అన్నీ దారుణ ఘటనలే. వీటన్నింటినీ నిశితంగా గమనిస్తే ఇవన్నీ కూడా రష్యా ప్రభుత్వాధినేత పుతిన్ చేయించినవే కావచ్చునన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే తన ఆధిపత్యాన్ని ప్రశ్నించిన వారిని కానీ.. తనకు కంట్లో నలుసుగా తయారయ్యే వారిని కానీ తనకి భవిష్యత్తులో తలనొప్పిగా మారతారన్న వారిని కానీ  ప్రాణాలతో విడిచి పెట్టడం అంత మంచిది కాదని పుతిన్ భావిస్తారన్నది పుతిన్ వ్యతిరేకుల వాదన.

మొదట్నుంచీ కూడా పుతిన్‌ తన ప్రత్యర్ధులపై హత్యాయత్నాలకు పాల్పడిన చరిత్ర ఉందని వారంటున్నారు. రాజకీయాల్లో పుతిన్‌కు నిద్ర లేకుండా చేసిన రాజకీయ ప్రత్యర్ధి నావెల్నీపై 2020లో విష ప్రయోగం జరిగింది. ఆసుపత్రిలో సుదీర్ఘ చికిత్స అనంతరం నావెల్నీ ప్రాణాలతో బయట పడ్డారు. అంతకు రెండేళ్ల క్రితం 2018లో  రష్యా నిఘా విభాగానికి మాజీ అధిపతి అయిన సెర్గీ స్క్రిపాల్ పైనా నావెల్నీ తరహాలోనే విష ప్రయోగం జరిగింది. ఈయన కూడా తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. రష్యా భద్రతాధికారి అలెగ్జాండర్ లిట్వినెంకోపై  లండన్‌లో రేడియో ధార్మిక పదార్ధమైన పొలోనియంను ప్రయోగించారు. అలెగ్జాండర్ మాత్రం ఈ ఘలనలో చనిపోయారు.

పుతిన్ పై అనుమానానికి కారణాలు లేకపోలేదు. 
ఒడిషాలో  అనుమానస్పదంగా మరణించిన పావెల్ ఆంటోవ్ ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి కాలు దువ్వడాన్ని విమర్శించారు. క్యీవ్ నగరంపై రష్యా వైమానిక దాడులను ఉగ్ర వాద చర్యగా అభివర్ణించారు. అయితే ఆ వెంటనే  ఆంటోవ్ పై  నుంచి ఒత్తిడి పెరిగిపోయింది. ఆ వెంటనే ఆంటోవ్ చేత  బలవంతంగా క్షమాపణలు చెప్పించేశారు. సోషల్ మీడియాలో తన వ్యాఖ్యలు దురదృష్టకరమైనవని అవగాహనా రాహిత్యంతో సాంకేతిక లోపంతో చేసిన వ్యాఖ్యలని ఆంటోవ్ వివరణ ఇచ్చుకున్నారు కూడా. అసలు అపర కుబేరులే ఎందుకు చనిపోతున్నారు.? ఈ మిస్టీరియస్ డెత్స్ వెనుక నిజంగానే పుతిన్ ఉన్నారా? ఇంతకీ ఈ అపర కుబేరులు ఎలా అవతరించారో కూడా తెలుసుకోవాలి. 

1991 లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత  కమ్యూనిస్టు దేశంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. రష్యా కొత్త నేత బోరిస్ ఎల్సిన్  అధికారంలోకి రావడంతోనే పెద్ద ఎత్తున ప్రభుత్వ సంస్థలను  ప్రైవేటీకరించారు. వేలాది సంస్థలను  కొందరు ప్రైవేటు వ్యక్తులు చేజిక్కించుకున్నారు. రాత్రికి రాత్రే వారు అపర కుబేరులయ్యే అవకాశం వచ్చింది. ప్రత్యేకించి రష్యాకు ప్రధాన ఆదాయ వనరు అయిన చమురు సహజ వాయు రంగంలో ప్రైవేటు పెట్టుబడిదారులు అడుగు పెట్టారు. అలా కీలక రంగాలన్నీ దక్కించుకున్న ఈ నయా వ్యాపారులనే ఆలిగాక్స్ అని పిలుస్తున్నారు. వారే రష్యాలో అత్యంత ధనవంతులన్నమాట. పుతిన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యాపారుల్లో కొందరు పుతిన్ కు అండగా నిలిచారు. పుతిన్ వ్యవహార శైలి నచ్చక కొందరు దూరంగా ఉన్నారు.

ఉక్రెయిన్ పై పుతిన్ యుద్ధానికి కాలుదువ్విన మరుక్షణమే ప్రపంచంలో అందరి కన్నాఎక్కువగా ఆందోళన చెందింది ఈ కుబేరులే. ఎందుకంటే తమ వ్యాపారాలపై యుద్ద ప్రభావం పడుతుందని వీరు భయపడ్డారు. వీరు అనుకున్నట్లే  నాటో దేశాల ఆంక్షల తో రష్యన్ బిలియనీర్ల వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయి. అన్నింటినీ మించి యూకే, ఫ్రాన్స్, అమెరికా, స్పెయిన్ లలో రష్యన్ కుబేరులు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. విలాసవంతమైన విల్లాలు, ఎస్టేటులు కొన్నారు ప్రైవేటు జెట్ విమానాలు,  ఓడలు పోర్టులు కొన్నారు.

రష్యా యుద్ధం మొదలు పెట్టగానే నాటో దేశాలు రష్యా పై కఠిన ఆంక్షలు విధించాయి. రష్యన్లకు ఇతర దేశాల్లో ఉన్న ఆస్తులు, బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. ఒక పక్క రష్యాలో తమ వ్యాపారాలు పడిపోవడం మరో పక్క విదేశాల్లోని తమ ఆస్తులన్నీ ఫ్రీజ్ అయిపోవడంతో  రష్యన్ బిలయనీర్లు ఒక్కసారిగా సంక్షోభంలో కూరుకుపోయారు. ఇది వారిని తీవ్ర మానసిక క్షోభకు గురి చేసింది. ఈ ఫ్రస్ట్రేషన్ లోనే యుద్ధానికి కారణమైన పుతిన్ పై  వ్యాపారులు మండి పడ్డారు. ఆ కోపంలోనే పుతిన్ పై విమర్శలూ చేశారు. ఆ తర్వాతనే 22 మంది  సంపన్నులు అనుమానస్పద స్థితిలో చనిపోతూ వచ్చారు. సస్పెన్స్ సినిమాలో మాదిరిగా ఒకరి తర్వాత ఒకరు ఒకే విధంగా  మరణానికి గురి కావడం ఆశ్చర్యచకితులను చేసింది. కొన్ని మరణాలు మరీ బీభత్సంగా క్రూరంగా ఉండడం మిగతా వారిని భయపెట్టింది.

ప్రభుత్వం ఏమో ఆత్మహత్యలే అంటుంది. అక్కడి వాతావరణం చనిపోయిన తీరు చూస్తే అవి హత్యలేమో అన్న అనుమానాలు వస్తున్నాయి.ఈ మారణ హోమం ఎప్పటికి అంతం అవుతుందనేది అతి పెద్ద ప్రశ్న. ఉక్రెయిన్ తో యుద్ధం ఆగిన వెంటనే ఈ మరణాలు కూడా ఆగితే మాత్రం ఇవి ముమ్మాటికీ పుతిన్ ప్రభుత్వ హత్యలే అనుకోవలసి వస్తుందని మేథావులు అంటున్నారు. పాలకులను చికాకు పెట్టే వారినీ ప్రభుత్వ విధానాలను తప్పుబట్టేవారినీ మూడోకంటికి తెలీకుండా మాయం చేసేసి శాల్తీలు గల్లంతు చేయడం అనేది రష్యాకు కొత్తకాదంటున్నారు విశ్లేషకులు.

సోవియట్ యూనియన్ రోజుల్లోనూ నాటి గూఢచర సంస్థ కేజీబీ  ఇదే చేసేదని వారంటున్నారు. ఇపుడు రష్యాలో కమ్యూనిజం లేకపోవచ్చుకానీ ప్రత్యర్ధులను లేపేసే వారసత్వం మాత్రం అలానే కొనసాగుతోందని వారంటున్నారు. పుతిన్ విధానాలను నిలదీసినందుకే  రష్యాలో ఆలిగాక్స్ ల ప్రాణాలు గాల్లో కలుస్తూ ఉండచ్చని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. 

సోవియట్ యూనియన్ కాలంలోనే కమ్యూనిజాన్ని వ్యతిరేకించిన వారిని గుర్తించి కఠిన శిక్షలు విధించడం ఆనవాయితీగా వస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దేశాధినేత పుతిన్ కూడా ఒకనాటి కేజీబీ అధికారి కాబట్టే  సోవియట్ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్లుందని వారు అభిప్రాయ పడుతున్నారు. విషాదం ఏంటంటే రష్యాలో చోటు చేసుకుంటోన్న  వరుస మృతి ఘటనల్లో ఏ ఒక్క కేసులోనూ సరియైన సాక్ష్యాలు లేకపోవడం. అయితే దీన్ని ఇలా వదిలేయడం కరెక్ట్ కాదంటున్నారు మేధావులు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని హక్కుల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement