పోస్ట్‌మార్టం చేయడానికి వెళ్తే గురక శబ్దం.. తీరా చూస్తే

Spain Man Declared Dead by 3 Doctors Wakes Up Just Before Autopsy - Sakshi

మూడేళ్ల క్రితం స్పెయిన్‌లో చోటు చేసుకున్న సంఘటన

జైలులో స్పృహ కోల్పోయిన ఖైదీ

ఖైదీ చనిపోయినట్లు నిర్ధారించిన ముగ్గురు డాక్టర్లు 

మాడ్రిడ్‌: దైవానికి, సాంకేతికతకు మధ్య నిత్యం వివాదం రాజుకుంటూనే ఉంటుంది. దైవం లేదని సైన్స్‌ అంటుంది. కానీ సాంకేతికతకు అంతుపట్టని రహస్యాలు ఈ సృష్టిలో కోకొల్లలు. ఈ కోవకు చెందిన ఓ సంఘటన స్పెయిన్‌లో వెలుగు చూసింది. ఓ వ్యక్తి మరణించినట్లు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు డాక్లర్లు నిర్ధారించారు. పోస్ట్‌మార్టం చేయడానికి సిద్ధం అవుతుండగా.. ఓ భయానక సంఘటన చోటు చేసుకుంది. మృతి చెందినట్లు భావించిన వ్యక్తి అకస్మాత్తుగా లేచి కూర్చున్నాడు. ఈ సంఘటన చూసి వైద్యులు ఒణికిపోయారు. ఆ వివరాలు.. 

మూడేళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన గురించి సైన్స్‌ అలర్ట్‌లో ప్రచురించడంతో మరోసారి వార్తల్లోకి వచ్చింది. దీని ప్రకారం.. జనవరి 7, 2018న స్పెయిన్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న గొంజలో మోంటోయా జిమెనెజ్ అనే ఖైదీ ఉన్నట్లుండి స్పృహ కోల్పోయాడు. అధికారులు అతడిని లేపేందుకు ప్రయత్నించారు.. కానీ అతడిలో ఎలాంటి చలనం లేదు. దాంతో జైలులో ఆ రోజు విధుల్లో ఉన్న ఇద్దరు వైద్యులను పిలిచి గొంజలోకు వైద్య పరీక్షలు చేయించారు. సదరు ఖైదీని పరీక్షించిన ఆ ఇద్దరు వైద్యులు గొంజలో చనిపోయినట్లు ప్రకటించారు.

ఎందుకైనా మంచిది మరోసారి నిర్ధారించుకుందామని భావించి ఫోరెన్సిక్ వైద్యుడిని పిలిపించి పరీక్షలు చేయించారు. అతడు కూడా గొంజలో మృతి చెందినట్లు తెలిపాడు. ఇక అధికారిక నియమాల ప్రకారం గొంజలో మృతదేహాన్ని బ్యాగ్‌లో ఉంచి మార్చురీ కోల్డ్ స్టోరేజ్‌లో ఉంచారు. శవపరీక్ష నిర్వహించడానికి అతని మృతదేహాన్ని స్కాల్పెల్ గుర్తులతో గుర్తించారు. పోస్ట్‌మార్టం నిర్వహించడానికి మార్చురీలోకి వచ్చిన వైద్యులు అక్కడ చోటు చేసుకున్న సంఘటన చూసి భయంతో వణికిపోయారు. శవాలు మాత్రమే ఉండే ఆ గదిలో వారికి పెద్ద గురక శబ్దం వినిపించింది. భయంతో షాక్‌కు గురైన వైద్యులు.. ఆ తర్వాత తేరుకుని.. శబ్దం ఎక్కడ నుంచి వస్తుందో తెలుసుకునేందుకు తేరిపార గమనించారు. 

గొంజలో మృతదేహం ఉన్న బ్యాగ్ లోపలి నుంచి శబ్దం వస్తోందని తెలుసుకున్నారు. చనిపోయాడని వైద్యులు ధ్రువీకరించి.. కోల్డ్‌ స్టోరేజ్‌లో పెట్టిన తర్వాత గొంజలో శరీరంలో చలనం వచ్చింది. వెంటనే అతడి బాడీని ఆసుపత్రికి తరలించగా గొంజలో బతికే ఉన్నట్లు తెలిపారు వైద్యులు. ఈ సందర్భంగా హాస్పిటల్ అధికారులు మీడియాతో మాట్లాడుతూ ‘‘ఇది ఉత్ప్రేరక కేసు కావచ్చు ఈ లాంటి సందర్భంలో మానవ శరీరం బందీకావడం లేదా ట్రాన్స్ లాంటి దశలోకి ప్రవేశించి స్పృహ, అనుభూతిని కోల్పోతుంది. ఫలితంగా సదరు వ్యక్తి మరణించినట్లు నిర్ధారిస్తాం’’ అని తెలిపారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top