
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లోగల ఒక హిందూ దేవాలయం గోడలపై ద్వేషపూరిత జాత్యహంకార రాతలు కనిపించడంతో కలకలం చెలరేగింది. ఆస్ట్రేలియా హిందూ కౌన్సిల్ అధ్యక్షుడు, విక్టోరియా చాప్టర్, మకరంద్ భగవత్ ఈ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ ఆలయం శాంతి, భక్తి, ఐక్యతకు నిలయమని ఆయన పునరుద్ధాటించారు.
ఆస్ట్రేలియాలోని వాధర్స్ట్ డ్రైవ్‌లో గల స్వామినారాయణ ఆలయం గోడపై దుండగులు ఎర్రటి పెయింట్ చల్లి, జాత్యహంకార దుర్భాషపూరిత వ్యాఖ్యలు రాశారు. స్థానిక దినపత్రిక తెలిపిన వివరాల ప్రకారం ఈ ఆలయానికి సమీపంలోని రెండు ఆసియా రెస్టారెంట్లలో కూడా ఇదే సందేశం కనిపించింది. హిందూ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు, విక్టోరియా చాప్టర్, మకరంద్ భగవత్ ఈ సంఘటనపై స్పందిస్తూ, స్వామి నారాయణ ఆలయం రోజువారీ ప్రార్థనలు, సామూహిక భోజనాలు, సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహిస్తుందని భగవత్ తెలిపారు.
అయినప్పటికీ ఇటువంటి ఘటనలు ఎదురవడం శోచనీయమన్నారు. హిందువులు ఇతర వర్గాలవారిపై ప్రేమను చూపించాలని, ద్వేషంపై ప్రేమ విజయం సాధిస్తుందని భగవత్ అన్నారు. ఆలయంలో జరిగిన ఘటన తీవ్రంగా కలత పెట్టే అంశమని, భయాన్ని వ్యాప్తి చేయడానికే విద్రోహులు ఇటువంటి చర్యకు పాల్పడ్దారని భగవత్ పేర్కొన్నారు.