Russia-Ukraine War: చేతులు కలపండి.. యుద్ధాన్ని ఆపండి

Russia-Ukraine War: Ukraine war creating global food, energy security challenges - Sakshi

ప్రపంచ దేశాలకు ఐరాస సెక్రటరీ

జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ పిలుపు

యుద్ధానికి ఇకనైనా ముగింపు

పలకాలని రష్యాకు హితవు  

వాషింగ్టన్‌/ఐక్యరాజ్యసమితి: ఉక్రెయిన్, రష్యా దేశాల సంక్షేమంతోపాటు మొత్తం ప్రపంచ శాంతి కోసం యుద్ధానికి ముగింపు పలకాలని పుతిన్‌ను ఐరాస సెక్రెటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ కోరారు. ఐరాస భద్రతా మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మతిలేని యుద్ధం వల్ల ప్రపంచానికి హాని తప్ప ఒరిగేదేమీ ఉండదన్నారు. ప్రపంచానికి ఆహార, ఎరువుల కొరత తప్పాలంటే ఉక్రెయిన్, రష్యా, బెలారస్‌ల్లో ఉత్పత్తి యథాతథంగా కొనసాగాల్సిందేనన్నారు.

ఏం చేయాలో మాకు తెలుసు: భారత్‌
ఉక్రెయిన్‌–రష్యా వ్యవహారంలో ఐరాసలో ఓటింగ్‌లకు భారత్‌ దూరంగా ఉంటుండడాన్ని తప్పుబడుతూ ఇంగ్లండ్‌లో నెదర్లాండ్స్‌ రాయబారి కరెల్‌ వాన్‌ ఊస్టెరోమ్‌ ట్వీట్‌ చేశారు. దీనికి ఐరాసలో భారత శాశ్వత రాయబారి టి.ఎస్‌.తిరుమూర్తి గట్టిగా బదులిచ్చారు. ‘‘మీ సలహాలు, సాయం అక్కర్లేదు, ఏం చేయాలో భారత్‌కు తెలుసు’’ అంటూ అన్నారు. ఈ యుద్ధంలో విజేతలంటూ ఎవరూ ఉండరనిఐరాస భద్రతా మండలి భేటీలో మాట్లాడుతూ ఆయన అన్నారు. భారత్‌ ఎప్పటికీ శాంతిపక్షమేనన్నారు.

రష్యాపై ‘యుద్ధ నేరాలు’: ఆమ్నెస్టీ
ఉక్రెయిన్‌లో రష్యా సైనికులు యుద్ధ నేరాలకు పాల్పడ్డారని ఆమ్నెస్టీ సెక్రెటరీ జనరల్‌ ఆగ్నస్‌ కలామార్డ్‌ ఆరోపించారు. వారి అరాచకాలను నమోదు చేశామన్నారు. ఈ యుద్ధ నేరాలకు విచారణను రష్యా ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు.

విపత్తు పరిస్థితులు: జెలెన్‌స్కీ
రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో విపత్తు తరహా పరిస్థితులు నెలకొన్నాయని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు. రష్యా సైన్యం ఇప్పటివరకు ఉక్రెయిన్‌పై 2,014 క్షిపణులు ప్రయోగించిందని చెప్పారు. 400 ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలను రష్యా సైన్యం ధ్వంసం చేసిందని తెలిపారు. 2,682 రష్యా యుద్ధ విమానాలు తమ గగనతలంపై ప్రయాణించాయని వెల్లడించారు. మరోవైపు మారియూపోల్‌ నుంచి రష్యా సేనలు చాలావరకు తూర్పు ప్రాంతానికి తరలివెళ్లాయని అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది.

శరణార్థులతో జిల్‌ బైడెన్‌ భేటీ
స్లొవేకియా సరిహద్దులో ఆశ్రయం పొందుతున్న ఉక్రెయిన్‌ శరణార్థులను అమెరికా ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌ కలిశారు. ఉక్రెయిన్‌ ప్రజలకు అమెరికా అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు. శరణార్థుల ఆవేదన ఒక తల్లిగా తనకు తెలుసని అన్నారు. జిల్‌ నాలుగు రోజుల పాటు యూరప్‌లో పర్యటించనున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top