రష్యా-ఉక్రెయిన్‌ డిజిటల్‌ వార్

Russia Ukraine War: Ukraine digital army brews cyberattacks - Sakshi

రష్యా యుద్ధాన్ని సైబర్‌ దాడులతో అడ్డుకునే ప్రయత్నం

డిజిటల్‌ ఆర్మీగా ఏర్పడిన ఉక్రెయిన్‌ టెక్కీలు

రష్యా కూడా ప్రతీకార సైబర్‌ దాడులు

యూరప్‌ దేశాల్లో పలుమార్లు

ఇంటర్నెట్‌ సేవలకు అంతరాయం  

మాస్కో/కీవ్‌: రష్యా నుంచి భీకరమైన దాడుల్ని అడ్డుకోవడానికి తమ ముందున్న అన్ని మార్గాలను ఉక్రెయిన్‌ పూర్తి స్థాయిలో వినియోగించుకుంటోంది. సైబర్‌ యుద్ధాన్ని ముమ్మరం చేసింది. ఆ దేశానికి చెందిన వందలాది మంది హ్యాకర్లు డిజిటిల్‌ యుద్ధం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.

డిజిటల్‌ ఆర్మీగా ఏర్పాటై రష్యా దాడుల్ని నిలువరిస్తున్నారు. ‘‘మాది ఒక రకంగా సైన్యమే, స్వీయ నియంత్రణలో ఉన్న సైన్యం’’ అని డిజిటిల్‌ ఆర్మీ సభ్యుడైన 37 ఏళ్ల వయసున్న రోమన్‌ జఖరోవ్‌ చెప్పారు. వీరంతా రష్యాకు చెందిన వెబ్‌సైట్లను బ్లాక్‌ చేయడం, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయకుండా అడ్డుకోవడమే కాకుండా రష్యా సైనికులు ఏయే ప్రాంతాల్లో ఉన్నారో గుర్తించి ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు.

రష్యా దాడి చేస్తున్న ప్రాంతాల్లో క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించడానికి కావాల్సినన్నీ పంపడం వంటివన్నీ ఈ డిజిటల్‌ ఆర్మీ దగ్గరుండి చూస్తోంది. స్టాండ్‌ఫర్‌ఉక్రెయిన్‌ హ్యాష్‌ట్యాగ్‌తో సామాజిక మాధ్యమాల్లో అందరి మద్దతు కూడదీస్తోంది. డిజిటల్‌ ఆర్మీలో చేరడానికి ముందు జఖరోవ్‌ ఆటోమేషన్‌ స్టార్టప్‌ను నడిపేవారు. ఆయన కింద సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు, మార్కెటింగ్‌ మేనేజర్లు, గ్రాఫిక్‌ డిజైనర్లు, ఆన్‌లైన్‌ యాడ్‌ బయ్యర్లు పని చేస్తుంటారు. ఇప్పుడు వీరంతా సైబర్‌ యుద్ధంలో పాలుపంచుకుంటున్నారు. అంతేకాదు రష్యా చేసే సైబర్‌ దాడుల నుంచి ఆత్మ రక్షణగా తమ ఇంటర్నెట్‌ వ్యవస్థ కుప్పకూలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  

మీడియా నుంచి రైల్వేల వరకు...
డిజిటల్‌ ఆర్మీలోని రోమన్‌ జఖరోవ్‌ బృందం ‘‘లిబరేటర్‌’’ అనే టూల్‌ని రూపొందించింది. ఈ టూల్‌ ద్వారా ప్రపంచంలో ఎక్కడ నుంచైనా రష్యా వెబ్‌సైట్లపై దాడులు చేయవచ్చు. సైబర్‌ దాడులకు లోనుకాకుండా రష్యా దగ్గర పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఉన్నప్పటికీ మీడియా, బ్యాంకులు, టెలిఫోన్లు, రైల్వేలు చాలా రంగాలకు చెందిన వెబ్‌సైట్లలో మాల్‌వేర్‌ జొప్పించి కొద్ది సేపైనా నిలువరించడంలో ఉక్రెయిన్‌ డిజిటల్‌ ఆర్మీ విజయం సాధిస్తోందని సైబర్‌ సెక్యూరిటీ అధికారి విక్టర్‌ జోరా చెప్పారు. మరికొందరు ఐటీ నిపుణులు ఐటీ ఆర్మీ అన్న పేరుతో గ్రూప్‌గా ఏర్పడి సైబర్‌ దాడులకు పాల్పడుతున్నారు. టెలిగ్రామ్‌లో 2,90,000 మంది ఫాలోవర్లు ఉన్న ఈ గ్రూపు ఐటీ రంగంలో నిపుణులైన ఉక్రెయిన్లు ఎక్కడ ఉన్నా తమకు సహకారం అందించాలని పిలుపునిస్తోంది.  

ఇది సరైన పనేనా? 
ఇప్పటికే యుద్ధంతో నలిగిపోతున్న ఉక్రెయిన్‌లో ఇలా ప్రతీ వ్యక్తి సైబర్‌ యుద్ధానికి దిగడంపై సొంతదేశంలోనే వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. ఎందుకంటే పేరు చెప్పుకోవడానికి ఇష్టపడని ఒక ఉక్రెయిన్‌ సైబర్‌ సంస్థ రష్యా ఉపగ్రహాలను కూడా అడ్డుకున్నామని ప్రచారం చేస్తోంది. ఉపగ్రహాలపై కూడా కన్నేశామని చెప్పుకోవడం వల్ల ఉక్రెయిన్‌కి మరింత నష్టం జరుగుతుందని సైబర్‌ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపగ్రహాలనే టార్గెట్‌ చేస్తే అంతరిక్ష యుద్ధానికి దారి తీస్తుందని, అదే అసలు సిసలు యుద్ధంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. అయితే అంతరిక్ష రంగంలో చట్టవిరుద్ధ కార్యకలాపాలను తాము ప్రోత్సహించడం లేదని ఉక్రెయిన్‌ ప్రత్యేక కమ్యూనికేషన్ల సర్వీసులకు చెందిన డిప్యూటీ చైర్మన్‌ జోరా స్పష్టం చేశారు.

యూరప్‌లో ఇంటర్నెట్‌ సేవలు బంద్‌  
ఉక్రెయిన్‌ సైబర్‌ దాడులతో రైల్వే టికెట్ల బుకింగ్, బ్యాంకింగ్, టెలిఫోన్ల సేవలకు తరచూ అంతరాయం కలుగుతూ ఉండడంతో రష్యా కూడా తమ హ్యాకర్లని రంగంలోకి దింపింది. రష్యా హాకర్లు ఇ–మెయిల్స్‌ ద్వారా  మాల్‌వేర్‌లు పంపించి ఇంటర్నెట్‌ వ్యవస్థని స్తంభింపజేస్తున్నారు. దీంతో శుక్రవారం నాడు యూరప్‌ వ్యాప్తంగా జర్మనీ, ఫ్రాన్స్, హంగేరి, గ్రీస్, ఇటలీ, పోలండ్‌ దేశాల్లో ఇంటర్నెట్‌ సేవలకు అంతరాయం ఏర్పడింది. రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధంతో యూరప్‌ దేశాలు కూడా పలు ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాయి.  

మానవీయ కోణంలో..  
రెండు దేశాల మధ్య ఈ పోరులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అసలు విలన్‌ అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. రష్యా నెటిజన్లు చాలా మంది  సామాజిక మాధ్యమాల వేదికగా ఉక్రెయిన్‌కి మద్దతు ప్రకటిస్తున్నారు. అధ్యక్షుడు పుతిన్‌కు మతి పోయిందని వ్యాఖ్యానిస్తున్నారు. సాధారణ రష్యన్ల నుంచి మద్దతు రావడంతో ఉక్రెయిన్‌ డిజిటల్‌ ఆర్మీ వారి పట్ల మానవీయ కోణంతో స్పందిస్తోంది. ఉక్రెయిన్‌ వీధుల్లో తిరుగుతున్న సైనికులు క్షేమ సమాచారాల్ని రష్యాలో వారి తల్లిదండ్రులకు తెలిసేలా ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ రూపొందించారు. వారి వీడియోలు తీసి ఉంచడం, మరణించిన సైనికులు ఫొటోలు అప్‌లోడ్‌ చేయడం, యుద్ధం వద్దంటూ గ్రాఫికల్‌ డిజైన్స్‌ సందేశాలు రూపొందించి ప్రచారం చేయడం వంటివి చేస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top