Russia-Ukraine War: ఉక్రెయిన్‌కు 3 లక్షల రిజర్వు సేనలు

Russia-Ukraine War: Putin Announces Partial Military Mobilisation Against Ukraine - Sakshi

ఎదురుదెబ్బల నేపథ్యంలో రష్యా కీలక నిర్ణయం

అవసరమైతే అన్ని రకాల ఆయుధాలూ ప్రయోగిస్తాం: పుతిన్‌

ఇది అణు దాడి బెదిరింపే

మండిపడుతున్న పశ్చిమ దేశాలు

6 వేల మంది సైనికులను కోల్పోయాం: రష్యా

మాస్కో: ఉక్రెయిన్‌లో భారీ ఎదురుదెబ్బల నేపథ్యంలో ఏకంగా 3 లక్షల రిజర్వు దళాలను తక్షణం యుద్ధ రంగానికి తరలించాలని రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఈ మేరకు ఆదేశించారు. బుధవారం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ఉక్రెయిన్‌తో పాటు మొత్తం పాశ్చాత్య దేశాల సంఘటిత యుద్ధ వ్యవస్థతో తాము పోరాడుతున్నామని ఈ సందర్భంగా వాపోయారు.

‘‘పోరు బాగా విస్తరించింది. సరిహద్దుల్లోనూ, విముక్త ప్రాంతాల్లోనూ ఉక్రెయిన్‌ నిత్యం కాల్పులకు తెగబడుతోంది. దాంతో ఈ చర్య తీసుకుంటున్నాం’’ అని ప్రకటించారు. అమెరికా సారథ్యంలో పాశ్చాత్య దేశాలు అణు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ‘‘రష్యాను బలహీనపరిచి, విభజించి, అంతిమంగా నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. 1991లో సోవియట్‌ యూనియన్‌ను ముక్కలు చేశామని ఇప్పుడు బాహాటంగా ప్రకటించుకుంటున్నాయి.

రష్యాకూ అదే గతి పట్టించాల్సిన సమయం వచ్చిందంటున్నాయి’’ అంటూ ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో తమ భూభాగాలను, సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకునేందుకు అన్ని రకాల ఆయుధ వ్యవస్థలనూ వాడుకుంటామంటూ నర్మగర్భ హెచ్చరికలు చేశారు. ఇది అన్యాపదేశంగా అణు దాడి హెచ్చరికేనంటూ యూరప్‌ దేశాలు మండిపడుతున్నాయి. రష్యా అంతటి దుస్సాహసం చేయకపోవచ్చని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. పుతిన్‌ ప్రకటనను రష్యా బలహీనతకు ఉదాహరణగా, దురాక్రమణ విఫలమవుతోందనేందుకు రుజువుగా అమెరికా, బ్రిటన్‌ అభివర్ణించాయి. ఉక్రెయిన్‌తో పోరులో ఇప్పటిదాకా 5,937 మంది రష్యా సైనికులు మరణించినట్టు వెల్లడించారు. అయితే ఉక్రెయిన్‌ అంతకు పదింతల మంది సైనికులను కోల్పోయిందని చెప్పుకొచ్చారు.

రష్యాను వీడుతున్న యువత
పుతిన్‌ తమనూ నిర్బంధంగా యుద్ధానికి పంపుతారేమోనని రష్యా యువకులు భయపడుతున్నారు. బుధవారం ఆయన  ప్రకటన వెలువడగానే వారు భారీ సంఖ్యలో అందుబాటులో ఉన్న విమానాల్లో దేశం వీడారు. దాంతో టికెట్లకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. మాస్కో–ఇస్తాంబుల్‌ టికెట్‌ ఏకంగా 9 వేల డాలర్లు దాటింది. అయినా కొనేందుకు ఎగబడటంతో టికెట్లన్నీ హట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. రానున్న కొద్ది రోజుల దాకా అన్ని విమానాల్లోనూ సీట్లన్నీ నిండిపోయాయి. దాంతో రైలు తదితర మార్గాల వెదుకులాట మొదలైంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top