దద్దరిల్లుతున్న డోన్బాస్‌

Russia Forces Attack Launch Attack On Donbas Ukraine - Sakshi

భారీగా దాడులు చేస్తున్న రష్యా 

క్రెమినా, మరో పట్టణం ఆక్రమణ 

మరో 50 వేల సేనల తరలింపు! 

రెండో దశ యుద్ధమిది: జెలెన్‌స్కీ 

నిలువరించి తీరతామని ధీమా

కీవ్‌: తూర్పు ఉక్రెయిన్‌లోని పారిశ్రామిక హబ్‌ డోన్బాస్‌ ప్రాంతంపై దాడులను రష్యా ఉధృతం చేస్తోంది. అక్కడి లుహాన్స్‌క్‌ ప్రాంతంలోని క్రెమినా నగరాన్ని బలగాలు చుట్టుముట్టి ఆక్రమించుకున్నాయి. డోన్బాస్‌ విముక్తే లక్ష్యంగా తమ సైనిక చర్యలో తదుపరి దశ మొదలైందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ ప్రకటించారు. ‘‘క్రెమినాలో ఎటు చూసినా వీధి పోరాటాలే జరుగుతున్నాయి. నగరాన్ని రష్యా సైన్యం దాదాపుగా నేలమట్టం చేసింది’’ అని ఉక్రెయిన్‌ పేర్కొంది.

సమీపంలోని మరో చిన్న పట్టణాన్ని కూడా రష్యా ఆక్రమించిందని చెప్పింది. డోన్బాస్‌కు రష్యా నుంచి మరో 50 వేల సైన్యం, భారీగా ఆయుధాలు తరలాయని అమెరికా పేర్కొంది. మారియుపోల్‌ పూర్తిగా వశమైతే అక్కడినుంచి మరో 10 వేల రష్యా సైన్యం డోన్బాస్‌కు తరలుతుందని అంచనా వేసింది. దీన్ని ‘డోన్బాస్‌పై యుద్ధం’గా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ అభివర్ణించారు. తూర్పుపై గురి పెట్టడం ద్వారా యుద్ధంలో కీలకమైన రెండో దశకు రష్యా తెర తీసిందన్నారు. ఎంత సైన్యంతో వచ్చినా పోరాడతామని, డోన్బాస్‌ను కాపాడుకుని తీరతామని చెప్పారు. దక్షిణ ఉక్రెయిన్‌లో టార్చర్‌ చాంబర్లు ఏర్పాటు చేసి మరీ పౌరులను రష్యా సైన్యం హింసిస్తోందన్నారు. 

ఇతర చోట్లా భీకర దాడులు 
ఉక్రెయిన్లోని మిగతా ప్రాంతాల్లోనూ రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటిదాకా కాస్త సురక్షితంగా ఉంటూ వచ్చిన లివీవ్‌ నగరంపైనా భారీగా బాంబు దాడులు జరిగాయి. వీటిలో ఏడుగురు మరణించారని, చాలామంది గాయపడ్డారని నగర మేయర్‌ చెప్పారు. ఉక్రెయిన్‌లో 20కి పైగా ఆయుధాగారాలు, కమాండ్‌ హెడ్‌క్వార్టర్లు, ఇతర సైనిక లక్ష్యాలను మంగళవారం క్షిపణులతో నేలమట్టం చేసినట్టు రష్యా ప్రకటించింది. రేవు పట్టణం మారియుపోల్‌లో స్టీల్‌ ప్లాంట్‌ లోపల ఉండి పోరాడుతున్న ఉక్రెయిన్‌ సైనికులు లొంగిపోవాలన్న రష్యా ఆఫర్‌ను మరోసారి తిరస్కరించారు. దాంతో ప్లాంటుపై రష్యా సైన్యం బంకర్‌ బస్టర్‌ బాంబులు వేస్తోంది. ప్లాంటులో పౌరులు భారీగా తలదాచుకుంటున్నారని తెలిసి కూడా ఇందుకు తెగబడటం దారుణమని ఉక్రెయిన్‌ దుయ్యబట్టింది. మారియుపోల్‌లో 21,000 మంది మరణించారని చెప్పింది.

ఈయూ దిశగా అడుగులు 
యూరోపియన్‌ యూనియన్‌లో ఉక్రెయిన్‌ చేరిక దిశగా అడుగులు వేగవంతమవుతున్నాయి. ఇం దుకు సంబంధించి ఈయూ ప్రశ్నావళికి సమాధా నాలను ఉక్రెయిన్‌లో ఈయూ రాయబారి మత్తీ మాసికాస్‌కు అధ్యక్షుడు జెలెన్‌స్కీ సమర్పించారు. ఈయూ సభ్యత్వం పొందితే యూరప్‌లో తామూ సమాన భాగస్వాములమన్న ఉక్రెయిన్‌వాసుల విశ్వాసం మరింత దృఢమవుతుందన్నారు. అయితే ఉక్రెయిన్‌కు ఈయూ సభ్యత్వం లభిస్తే రష్యా మరింతగా రెచ్చిపోవచ్చని విశ్లేషకులు 
అభిప్రాయపడుతున్నారు. 

ధరలు పెరిగాయి: పుతిన్‌ 
ఉక్రెయిన్‌పై దాడి అనంతరం రష్యాలో నిత్యావసరాల ధరలు బాగా పెరిగాయని అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అంగీకరించారు. అయితే పశ్చిమ దేశాల ఆంక్షలు పూర్తిగా విఫలమయ్యాయని చెప్పుకొచ్చారు. ‘‘వాటిని తట్టుకుని నిలిచాం. పైగా ఆంక్షలు అమెరికా, యూరప్‌ దేశాలకే బెడిసికొట్టాయి. ఆ దేశాల్లో ద్రవ్యోల్బణం పెరిగింది. ప్రజల జీవన ప్రమాణాలు దిగజారాయి’’ అన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top