రూ.2.3 లక్షల టిప్ ఇచ్చాడు.. తీసుకున్నాక సీన్ రివర్స్.. ఆమె ఆనందం ఆవిరి..

Restaurant Sues Man Tipping Waitress Rs 2 Lakhs Demanding Back - Sakshi

వాషింగ్డన్: రెస్టారెంట్‌కు వెళ్లిన ఓ కస్టమర్‌ ఫుడ్ ఆర్డర్ చేసి హాయిగా తిన్నాడు. ఆ తర్వాత వెయిట్రెస్‌కు రూ.2.3లక్షలు(3వేల డాలర్లు) టిప్ ఇచ్చాడు. అంత భారీ మొత్తం తనకే అని తెలిసి ఆమె ఆశ్చర్యంతో పాటు ఆనందంలో మునిగిపోయింది. అమెరికా పెన్సిల్వేనియాలోని అల్‌ఫ్రెడోస్ పిజ్జా కేఫ్ రెస్టారెంట్‌లో ఈ ఘటన జరిగింది. టిప్ ఇచ్చిన కస్టమర్ పేరు ఎరిక్ స్మిత్ కాగా.. తీసుకున్న వెయిట్రెస్ పేరు మరియానా లాంబర్ట్. 

ఇంతవరకూ బాగానే ఉన్నా ఆ తర్వాతే అసలు ట్విస్ట్ ఇచ్చాడు కస్టమర్. తాను ఇచ్చిన టిప్‌ను తిరిగిచ్చేయాలన్నాడు. దీంతో రెస్టారెంట్‌తో పాటు వెయిట్రెస్‌ కూడా కంగుతింది. ఎరిక్ తన బిల్లుతో పాటు టిప్‌ను క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించాడు.  టిప్ ఇస్తూ బిల్లుపై 'ఫర్ జీసస్‌'(జీసస్‌ కోసం) అని రాశాడు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ పేరుతో ఉద్యమం నడుస్తోంది. చాలా మంది ఇతరుల కోసం భారీ సాయం చేస్తున్నారు. దీంతో ఇది దేవుడు తనకోసం ఇచ్చిన కానుక అని వెయిట్రెస్ సంబరపడిపోయింది. కానీ కొన్ని గంటలకే ఆనందం ఆవిరైంది.

తాను టిప్ ఇచ్చిన రూ.2.3లక్షలపై క్రెడిట్ కార్డు కంపెనీతో గొడవపడ్డాడు ఎరిక్. ఈ మొత్తాన్ని బిల్లులో చేర్చవద్దన్నాడు. దీంతో క్రెడిట్ కార్డు కంపెనీ ఈ  విషయాన్ని రెస్టారెంట్‌ దృష్టికి తీసుకెళ్లింది. అయితే ఏదో పొరపాటు జరిగి ఉంటుందని రెస్టారెంట్ యాజమాన్యం ఎరిక్‌ను సంప్రదించేందు ప్రయత్నించింది. ఫేస్‌బుక్‌లో సందేశాలు పంపింది. కానీ అతని నుంచి ఎలాంటి స్పందన లేదు.

దీంతో ఎరిక్‌పై కోర్టులో దావా వేసింది రెస్టారెంట్ యాజమాన్యం. రూ.2.3లక్షలను తాము అప్పటికే లాంబర్ట్‌కు ఇచ్చేశామని, ఇప్పుడు అంత మొత్తాన్ని తిరిగి ఇవ్వలేమని చెప్పింది. కస్టమరే స్వయంగా టిప్ ఇచ్చి మళ్లీ వెనక్కి ఇవ్వాలనడంపై అభ్యంతరం తెలిపింది. ఆ టిప్‌ తీసుకునేందుకు లాంబర్ట్‌కు పూర్తి అర్హత ఉందని, ఆమె చాలా కష్టపడి పనిచేస్తుందని చెప్పింది.
చదవండి: ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో ప్రిన్స్ హ్యరీ తీరుపై నెటిజన్ల ఫైర్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top